Share News

ఉరిసిల్లను సిరి సంపదలకు నిలయంగా మార్చాం

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:40 AM

కాంగ్రెస్‌ హయాంలో సిరిసిల్లను ఉరిసిల్లగా చేశారని, ఆత్మహత్యల పేరు పడిందని, కేసీఆర్‌ ఉరిసిల్లను సిరిసంపదలకు నిలయంగా మార్చారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కే తారకరామారావు అన్నారు.

ఉరిసిల్లను సిరి సంపదలకు నిలయంగా మార్చాం
సిరిసిల్లలో మాట్లాడుతున్న కేటీఆర్‌

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కాంగ్రెస్‌ హయాంలో సిరిసిల్లను ఉరిసిల్లగా చేశారని, ఆత్మహత్యల పేరు పడిందని, కేసీఆర్‌ ఉరిసిల్లను సిరిసంపదలకు నిలయంగా మార్చారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కే తారకరామారావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో తంగళ్లపల్లి మండల బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ ఎంత అభివృద్ధి చేశారో జిల్లాకు వస్తున్న రేవంత్‌రెడ్డి చూసి పోవాలన్నారు. జిల్లాకు మెడికల్‌ కాలేజీ, ఇంజనీరింగ్‌, వ్యవసాయ పాలిటెక్నిక్‌, డిగ్రీ, నర్సింగ్‌ కళాశాలలు చూడవచ్చని అన్నారు. కేసీఆర్‌ కట్టిన బిల్డింగ్‌ రిబ్బన్‌ కట్‌ చేయడం తప్ప దేనికి పనికిరారన్నారు. సిరిసిల్ల వేదికపై నుంచి బతుకమ్మ చీరల ఆర్డర్లు ప్రకటించాలని, కాటన్‌ పరిశ్రమను ఆదుకోవాలని అన్నారు. తనమీద కోపంతో నేతన్నలను, కేసీఆర్‌పై కోపంతో రైతులపై కక్ష సాధింపు చేయవద్దన్నారు. సిరిసిల్లలో తన మీద నాలుగు సార్లు ఓడిపోయిన మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే ఎక్కడా లేని అహంకారం కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారన్నారు. పదేళ్లు మంత్రిగా ఉన్న తాను ఏనాడూ మాట్లాడలేదన్నారు. బతుకమ్మ చీరల అర్డర్లు లేక నేత కార్మికుడు పాపుడాలు అమ్ముకుంటున్నాడని మీడియాలో వస్తే ఇన్ని రోజులు దొబ్బి తిన్నది చాలదా? అంటూ మాట్లాడడంపై ఆగ్రహించారు. అధికారం వచ్చి వంద రోజులు కాలేదని ముఖ్యమంత్రికి కేసీఆర్‌ మీద కోపం రైతులమీద చూపితే పద్మశాలీలు ఓట్లు వేయలేదని, బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేశారని అన్నారు. నాలుగుసార్లు ఓడించినా బుద్ధిరాలేదన్నారు. సిరిసిల్లకు వస్తున్న రేవంత్‌రెడ్డి నేత కార్మికులకు మహేందర్‌రెడ్డితో క్షమాపణ చెప్పించాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి మోదీని బుట్టలో వేసుకోవడానికి బడాభాయ్‌, చోటాభాయ్‌ అంటూ మాట్లాడుతున్నారని, అది చూస్తే తెలంగాణలో బడే మియాతో బడేమియా చోటామియా సుభానల్లా అని ఆయనేం చేయడు, ఈయన ఏమి చేయడని అన్నారు. గతంలో రేవంత్‌రెడ్డి బీజేపీ, ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రికలో ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేసి బడాభాయ్‌ అనే పాత వాసనలు పోకపోవచ్చన్నారు. అత్మగౌరవం ఉన్న తెలంగాణ బిడ్డ తెలంగాణ మోడల్‌ గురించి చెబుతారని, గుజరాత్‌ మోడల్‌గా రాష్ట్రాన్ని మంచిగా చేసుకుంటానని ఎవరైనా చెబుతారా అని అన్నారు. రెండు నెలల్లో ఎన్నికలు ఉండగా బడాభాయ్‌ ఆశీర్వాదం భవిష్యత్‌లో ఉండాలని కోరుకోవడం చూస్తే రాహుల్‌గాంధీ గెలిచేది లేదు. పీకేది లేదు నువ్వే ప్రధాని అని చెప్పినట్లు కాదా? అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై చర్చ జరుగుతోందని, కేసీఆర్‌ లక్షల కోట్లు తిన్నారని ముఖ్యమంత్రి నుంచి కింద ఉన్న కాంగ్రెస్‌ సన్నాసుల వరకు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అని 40 లక్షల ఎకరాలకు, సగం తెలంగాణకు సంబంధం ఉందని అన్నారు. 85 ఫిల్లర్లు ఉన్న మేడిగడ్డలో ఒక్క ఫిల్లర్‌ మాత్రమే కుంగిందని దాని చుట్టూ కేసీఆర్‌ ఉంటే కాపార్‌ డ్యాం కట్టి మిగతీ నీళ్లు అటు పోకుండా ఒక పంప్‌తో నైనా నీళ్లు నింపేవారన్నారు. ఈ ప్రభుత్వానికి తెలివి లేదన్నారు. రోజు 5 వేల క్యూసెక్కుల నీళ్లు కిందకు వెళ్తున్నాయన్నారు.

ఫ రాజకీయాల్లో సిగ్గులేని తనం ఎక్కువగా ఉంటుందని, మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని చెప్పుకోవడానికి సిగ్గు పడడం లేదని అన్నారు. రేవంత్‌రెడ్డి వచ్చి 90 రోజులు అవుతోందని, 15,750 పోలీస్‌ ఉద్యోగాలు, 5962 నర్సింగ్‌ ఉద్యోగాల కాగితాలు ఇచ్చి 30వేలఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారన్నారు. నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకోడందివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు.

ఒక్క పనీ చేయలేదు..

కరీంనగర్‌ ఎంపీగా ఒక్క పని కూడా బండి సంజయ్‌ చేయలేదని, అమిత్‌షా చెప్పులు మోయడం తప్ప ఒక్క గుడి, బడి, కట్టలేదని కేటీఆర్‌ అన్నారు. ప్రధాని మోదీ కూడా ఏం చేశాడో తెలియదని ద్వారకాలో మాత్రం నీళ్లలో మునిగి ఏదో చేశాడని ఎద్దేవా చేశారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో వినోద్‌కుమార్‌ను గెలిపించుకోవాలన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 50 వేల మెజార్టీ ఇవ్వాలన్నారు. 12న కరీంనగర్‌లో జరిగే కదనభేరిని విజయవంతం చేయాలన్నారు. ఫ్రీగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేసే విధంగా సిరిసిల్లలో 6న ఎల్‌ఆర్‌ఎస్‌పై జరిగే ధర్నా విజయవంతం చేయాలన్నారు. 8న కలెక్టర్‌కు వినతిపత్రం అందించాలన్నారు. ముస్తాబాద్‌ నుంచి దుబ్బాక మండలానికి గత ప్రభుత్వం డబుల్‌ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడమే కాకుండా టెండర్‌ కూడా పూర్తి చేసిన తర్వాత ఈ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మాట్లాడుతూ కరీంనగర్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా వినోద్‌కుమార్‌ను గెలిపించుకోవాలన్నారు. నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గజభీంకార్‌ రాజన్న, తంగళ్లపల్లి ఎంపీపీ పడిగెల మానస, మాజీ ఎంపీపీ సరస్వతి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల బాలయ్య, బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్ల మధు, మదన్‌, దేవదాస్‌, మీరాల భాస్కర్‌యాదవ్‌, పడిగెల రాజు, బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:40 AM