Share News

అకాల వర్షం... తగ్గిన తాపం

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:13 AM

జిల్లాలో అకాల వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొద్ది రోజులుగా మండిపోతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం కాస్త ఊపశమనం పొందారు.

అకాల వర్షం... తగ్గిన తాపం

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 17: జిల్లాలో అకాల వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొద్ది రోజులుగా మండిపోతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం కాస్త ఊపశమనం పొందారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలో 15.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గన్నేరువరంలో 43.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చొప్పదండిలో 1, రామడుగులో 1.8, గంగాధరలో 2.2, సైదాపూర్‌లో 5.4, హుజూరాబాద్‌లో 8, జమ్మికుంటలో 8.4, వీణవంకలో 10.4, ఇల్లందకుంట మండలంలో 12.4, మానకొండూర్‌లో 15.6, శంకరపట్నంలో 18.4, కరీంనగర్‌ రూరల్‌లో 15.8, తిమ్మాపూర్‌లో 22.8, చిగురుమామిడిలో 23.6, కరీంనగర్‌ అర్బన్‌లో 38.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమై చల్లగాలులు వీయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని పలు చోట్ల ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షానికి మామిడి కాయలు నేలరాలడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే పూత రాలి కాయలు తక్కువగా ఉండగా అవికూడా ఈ గాలీవానకు రాలిపోయాయని మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీణవంక మండలం వల్బాపూర్‌ గ్రామంలో పిడుగుపాటుకు తాళ్లపల్లి శ్రీనివాస్‌కు చెందిన గేదె, గన్నేరువరం మండల కేంద్రంలో బుర్ర రాంచంద్రన్‌గౌడ్‌కు చెందిన మరో గేదె మృతి చెందాయి. జిల్లా కేంద్రంలో కురిసిన చిరుజల్లులకే కోట్ల రూపాయలతో నిర్మించిన తీగెలవంతెనపై వర్షపు నీరు నిలువడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తీగలవంతెన నిర్మాణం, నిర్వహణ సరిగా లేదని, కొద్ది వర్షానికే నీరు నిలిస్తే భారీ వర్షం పడితే పరిస్థితి ఎలాఉంటుందోనని చర్చించుకుంటున్నారు.

Updated Date - Mar 18 , 2024 | 12:13 AM