Share News

ఈదురుగాలుల బీభత్సం

ABN , Publish Date - May 26 , 2024 | 12:53 AM

ప్రకృతి బీభత్సానికి రాజన్న సిరిసిల్ల జిల్లా అతలాకూతలం అయ్యింది. శనివారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా భారీ గాలి దుమారంతో కురిసిన వాన ప్రజలను ఇబ్బందుల్లో పడేసింది.

ఈదురుగాలుల బీభత్సం
సిరిసిల్ల చిన్న బోనాల వద్ద కూలిన భారీ వృక్షం

- కూలిన భారీ వృక్షాలు

- విరిగిన విద్యుత్‌ స్తంభాలు

- కొట్టుకుపోయిన రేకుల షెడ్లు

సిరిసిల్ల, మే 25 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి బీభత్సానికి రాజన్న సిరిసిల్ల జిల్లా అతలాకూతలం అయ్యింది. శనివారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా భారీ గాలి దుమారంతో కురిసిన వాన ప్రజలను ఇబ్బందుల్లో పడేసింది. జిల్లా కేంద్రంలో విరిగి పడిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, రేకుల షెడ్లు దెబ్బతిన్నాయి. బీవైనగర్‌, విద్యానగర్‌, వెంకంపేట, గోపాల్‌నగర్‌, శాంతినగర్‌, పద్మనగర్‌, గాంధీనగర్‌, సుభాష్‌నగర్‌ పెద్దబజార్‌ తదితర ప్రాంతాల్లో చెట్ల కోమ్మలు విరిగిపడి విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. దాదాపు నాలుగు గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్లు విరిగిపడి సిరిసిల్ల, ముస్తాబాద్‌లో కార్లు ధ్వంసం అయ్యాయి. సిరిసిల్లలోని చిన్నబోనాల వద్ద భారీ వృక్షం నేల కూలింది. విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్నాయి. రుద్రంగి, కోనరావుపేట, ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట, చందుర్తి, తంగళ్లపల్లి, వేములవాడ ప్రాంతాల్లో భారీ గాలులతో రేకుల షెడ్లు కొట్టుకుపోయాయి. రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. మున్సిపల్‌ గ్రామ పంచాయతీ, సెస్‌ సిబ్బంది స్పందించి వాటిని తొలగించారు.

ఫ సిరిసిల్ల టౌన్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం ఈదురు గాలి దుమారం బీభత్సం సృష్టించింది. సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు చెట్ల కొమ్మలు తగిలి విద్యుత్‌ స్తంభాలు ఒక వైపు ఒరిగిపోయాయి. అప్రమత్తమైన సెస్‌ అధికారులు విద్యుత్‌ సరఫరాను వెంటనే నిలిపివేశారు. పట్టణంలోని విద్యానగర్‌ పద్మనాయక కల్యాణ మందిరం సమీపంలో గాలి దుమారంతో సిరిసిల్ల-సిద్దిపేట ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డంగా చెట్టు విరిగి పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సాయంత్రం దాదాపు ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో విరిగి పడిన చెట్లను బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి పరిశీలించి మున్సిపల్‌ అధికారులకు తెలియజేస్తూ వారి సహకారంతో వాటిని దగ్గరుండి తొలగించారు.

ఫ సిరిసిల్ల రూరల్‌: సిరిసిల్ల అర్భన్‌ పరిధిలోని గ్రామాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షానికి చెట్లతోపాటు విద్యుత్‌స్తంభాలు విరిగిపడిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అర్భన్‌ పరిధిలోని చిన్నబోనాల గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఉన్న 125 సంవత్సరాల నాటినుంచి ఉన్న మర్రి చెట్టు ఈదురుగాలులకు వేర్లతో సహా పడిపోయింది. అలాగే పెద్దబోనాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఈదురుగాలులకు విద్యుత్‌స్తంభాలతోపాటు సర్ధాపూర్‌, పెద్దూర్‌, చంద్రంపేట, రగుడు, ముష్టిపల్లి, రాజీవ్‌నగర్‌లో చెట్లు పడిపోవడంతో రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. రోడ్లుపై పడిపోయిన చెట్లను మున్సిపల్‌ అధికారులు పరిశీలించి వెంటనే తొలగించారు. పలువురు కౌన్సిలర్లు పరిశీలించారు.

ఫ తంగళ్లపల్లి మండలంలో..

తంగళ్లపల్లి: తంగళ్లపల్లి మండలంలో శనివారం సాయంత్రం ఈదురు గాలులు భీభత్సం సృష్టించాయి. మండల కేంద్రంలోని చక్రాల నాగరాజు ఇంటి పైకప్పు లేచిపోయి వంద మీటర్ల దూరంలో ఉన్న స్ధంభానికి ఢీకొట్టి మరో ఇంటిపై పడింది. దీంతో విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. అలాగే కట్కూర్‌ గ్రామానికి చెందిన గున్నాల గౌరవ్వ ఇంటి పైకప్పు రేకులు ఈదురు గాలులకు లేచిపోయాయి. తంగళ్ళపల్లి పాఠశాల అవరణలో ఉన్న భారీ చింతచెట్లు నేలకూలి పక్కనే ఉన్న పర్వాతల గట్టవ్వ ఇంటిపై పడడంతో పాక్షికంగా ఇల్లు దెబ్బతింది. ఇందిరమ్మకాలనీలో విద్యుత్తు వైర్లు తెగిపడ్డాయి. అలాగే బస్వాపూర్‌-నేరెళ్ల గ్రామాల మధ్య భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈదురు గాలులకు మామిడి కాయలు రాలినట్లు బాధిత రైతు బాల్‌రెడ్డి తెలిపారు. విద్యుత్‌ వైర్లు తెగి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు.

ఫ ఎల్లారెడ్డిపేట మండలంలో..

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు పదిర, హరిదాస్‌నగర్‌, వెంకటాపూర్‌, అక్కపల్లి, దుమాల, గొల్లపల్లి, బొప్పాపూర్‌, తదితర గ్రామాల్లో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీగా వీచిన గాలులకు ప్రధాన రహదారుల పక్కన ఉన్న వృక్షాలు విరిగి పడ్డాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లోని ఇళ్లపైకప్పు రేకులు, కోళ్ల ఫారం రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. చెట్లు విరిగిపోయి విద్యుత్‌ తీగలపై పడ్డాయి. కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి- సిరిసిల్ల ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడడంతో అరగంట పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులతో కలిసి చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. గాలివానకు ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఇళ్లలోని వంట సామగ్రి కురిసిన వానకు తడిసిపోయింది.

ఫ కోనరావుపేట మండలంలో..

ఫ కోనరావుపేట: కోనరావుపేట మండలంలో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. కోనరావుపేట వైన్స్‌ వద్ద ఉన్న రేకుల షెడ్డు కూలంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పలు గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు కూలి విద్యుత్తుకు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ అధికారులు విద్యుత్‌ సరఫరా కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం గడ్కోలు గ్రామానికి చెందిన కస్తూరి సుమన్‌ సిరిసిల్ల నుండి కొనరావుపేట మీదుగా గడుకోలుకు వెళుతున్న సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో కోనరావుపేట వైన్స్‌ వద్ద ఆగాడు. అప్పుడే అకస్మాత్తుగా వచ్చిన గాలివానకు షెడ్డు కూలడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న కోనరావుపేట ఎస్సై ఆంజనేయులు హుటాహుటిన వచ్చి అతనిని తన వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా పలు గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. అంతేకాకుండా బావుసాయిపేటలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్తు సరఫరాను చేసేందుకు సెస్‌ అధికారులు మరమ్మత్తులు చేపడుతున్నారు.

ఫ రుద్రంగి మండలంలో..

రుద్రంగి: రుద్రంగి మండల కేంద్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రతతో స్థానికులు అల్లాడిపోయారు. ఆ తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం పడింది. ఈదురుగాలుల ప్రభావంతో మండల కేంద్రంలో ప్రధాన రహదారిలోని గండి వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో పెద్ద వృక్షం నేలకోరిగింది. దీంతో విద్యుత్‌ సరఫరాకు ఆంతరాయం ఏర్పడింది. మండల కేంద్రంలోని ఏడో వార్డులో కొబ్బరి చెట్టు విరిగి ఓ ఇంటిపై పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

ఫ ముస్తాబాద్‌ మండలంలో..

ముస్తాబాద్‌: ముస్తాబాద్‌ మండల కేంద్రంతో పాటు గూడెం బదనాకల్‌, తెర్లముద్ది, గన్నవారిపల్లె, నామాపూర్‌ తదితర గ్రామాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు విరిగిపడి విజయభాస్కర్‌, కృష్ణలకు చెందిన రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. గూడెంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ విరిగిపడింది. రోడ్లపై పలుచోట్ల చెట్లు నేలకూలి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు గామాల్లో రేకుల షెడ్లు ఎగిరిపోయి ఇళ్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఎంపీపీ జనగామ శరత్‌రావు అధికారులను కోరారు.

ఫ చందుర్తి మండలంలో..

చందుర్తి: మండలం కేంద్రంతో పాటు లింగంపేట, మూడపల్లి, నర్సింగాపూర్‌, మర్రిగడ్డ తదితర గ్రామాల ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా పెద్దఎత్తున ఈదురు గాలులు వీచాయి. దీంతో మండలంలోని లింగంపేట గ్రామంలోని కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారిలో, మూడపల్లి-నర్సింగాపూర్‌ రహదారిలో చింతచెట్టు, మూడపల్లి గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల చెట్టు విరిగి కొమ్మలు రహదారికి అడ్డంగా పడిపోయాయి. వాహనాలు వెళ్లే మార్గం లేకపోవడంతో సుమారు గంటసేపు రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. పలు గ్రామాల్లో రేకులు లేచిపోవడంతో పాటు, విద్యుత్‌ స్తంభాలు ఒరిగిపోయి తీగలు కిందకు పడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - May 26 , 2024 | 12:53 AM