Share News

‘బడి బాట’కు వేళాయె..

ABN , Publish Date - May 31 , 2024 | 12:41 AM

జిల్లాలో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విద్యా శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

‘బడి బాట’కు వేళాయె..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విద్యా శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జూన్‌ 3 తేదీ నుంచి 19వ తేదీవరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు, బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా పాఠశాలల ఆరంభానికి ముందు నుంచి నిర్వహిస్తున్నారు. బడి ఈడు పిల్లలను గుర్తించి వారిని సమీప పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంటుంది. ఆయా గ్రామాలు, పట్టణాల్లో ఉండే విద్యార్థులను ప్రైవేట్‌ పాఠశాలల్లో గాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, గుణాత్మక విద్యను అందించడం లక్ష్యంగా పనిచేస్తారు. సమాజ భాగస్వామ్యం, మద్దతుతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం. అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలను గుర్తించి సమీప పాఠశాలలో నమోదు చేయించడం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తారు. విలేజ్‌ ఎడ్యుకేషన్‌ రిజిస్టర్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయడం, 5వ తరగతి, 7వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఉన్నత తరగతుల్లో నమోదు చేయించనున్నారు. తక్కువ విద్యార్థుల నమోదు ఉన్న పాఠశాలలో ప్రత్యేక ప్రణాళిక ద్వారా తల్లిదండ్రుల భాగస్వామ్యంతో నమోదు పెంచుతారు. బడిబయటి పిల్లలను గుర్తించి వారి వయస్సుకు తగిన తరగతిలో నమోదు చేర్పించనున్నారు. బాలికా విద్య ప్రాముఖ్యతను తల్లితండ్రులకు వివరించి వారందరినీ పాఠశాలల్లో నమోదు చేయిస్తారు.

జూన్‌ 1న గ్రామసభల నిర్వహణ..

బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గాను ముందుగా పాఠశాలలో జూన్‌ 1వ తేదీన అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాలు, ఆశా కార్యకర్తలతో ప్రత్యేక అధికారుల అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి బడిబాట లక్ష్యాలను సాధించడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ సమావేశంలో ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలపై చర్చించి కార్యక్రమ ప్రణాళిక తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన కరపత్రాలు, బ్యానర్‌, తదితర ఏర్పాట్లు చేసుకోవాలి. 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అన్ని గ్రామాలు, ఆవాస ప్రాంతాలలో ఉదయం 8 నుండి 11 గంటల వరకు ర్యాలీలు నిర్వహించి ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు షెడ్యూల్‌ ప్రకారం రోజువారీ కార్యక్రమాలు నిర్వహించాలి. చివరిరోజైన 19న విద్యార్థులకు క్రీడలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాల నిర్వహణకు ఆర్థిక వనరులను పాఠశాల నిధుల నుంచి ఖర్చు చేయాలి. బడి బాట విజయవంతంగా నిర్వహించి అధికంగా విద్యార్థులను నమోదు చేసిన పాఠశాలలను జిల్లా స్థాయిలో 3, రాష్ట్రస్థాయిలో 10 పాఠశాలలను ఎంపిక చేసి బాధ్యులను సన్మానించనున్నారు.

ప్రతి రోజు ప్రచారం చేయాలి..

గ్రామాల్లోని ప్రతిఒక్కరికి తెలిసే విధంగా ప్రతిరోజూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ర్యాలీలు, బ్యాసర్లు, పోస్టర్లు, కరపత్రాల పంపిణీ ద్వారా డోర్‌ టు డోర్‌ ప్రచార కార్యక్రమం నిర్వహించాలి, మన ఊరు మన బడి ఇంగ్లీష్‌ మీడియం, రాష్ట్ర ప్రభుత్వ పథకాల పట్ల తల్లిదండ్రులు, సమాజంలో చైతన్యం కలిగించి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా ప్రోత్సహించాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో అర్హత కలిగిన పిల్లలను పాఠశాలల్లో 1వ తరగతిలో చేర్చించే విధంగా అంగన్‌వాడీ టీచర్లతో సమన్వయం చేసుకోవాలి. బడి ఈడు పిల్లలు, బడి మానేసిన, దీర్ఘకాలికంగా బడికి రాని వాళ్లు, స్వయం సహాయక సంఘాల వారి సహాయంతో గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక తయారుచేసి అమలుచేయాలి. 5 నుంచి 14 సంవత్సరాల బడిబయటి పిల్లలను గుర్తించి పాఠశాలల్లో నమోదు చేసుకోవాలి. బాలకార్మికు లను గుర్తించి పాఠశాలలో నమోదు చేసుకోవాలి. గ్రామ విద్య రిజిస్టర్‌ను నవీకరణ చేసుకోవాలి. పిల్లల్లో పాఠశాల, విద్యపై ఆసక్తి కలిగేలా సంసిద్ధతా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది.

ఉపాధ్యాయులు అందరూ పాల్గొనాలి

- మాధవి, జిల్లా విద్యాశాఖ అధికారి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బడి బాట కార్యక్రమంలో జిల్లాలోని ప్రభత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అందరు పాల్గొంటారు. జూన్‌ 3 నుంచి 19 వరకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ తేదీల్లో ఉపాధ్యాయులు బడి బయట ఉన్న పిల్లల వివరాలు సేకరించి వారికి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల్సి ఉంటుంది. అంగన్‌వాడీ కేంద్రాలలోని చిన్నారుల వివరాలు సేకరించి వారిని చేర్పించాలి. ఈ ఏడాది అధిక సంఖ్యలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - May 31 , 2024 | 12:41 AM