Share News

నకిలీ విత్తనాల దందాను ఉపేక్షించేది లేదు

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:27 AM

రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తన దందాను ఉపేక్షించేది లేదని, విత్తన దందా చేస్తున్న వ్యాపారులు, రవాణా దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ హెచ్చరిం చా రు.

నకిలీ విత్తనాల దందాను ఉపేక్షించేది లేదు
నకిలీ విత్తనాలు, నిందితుని అరెస్టు చూపుతున్న పోలీసులు

- మహారాష్ట్ర నుంచి రవాణా అవుతున్న 2.5క్వింటాళ్ల పత్తి విత్తనాల పట్టివేత

- రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌

కోల్‌సిటీ, జూన్‌ 5: రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తన దందాను ఉపేక్షించేది లేదని, విత్తన దందా చేస్తున్న వ్యాపారులు, రవాణా దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ హెచ్చరిం చా రు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి ప్రాణహిత ఫెర్రి పాయుంట్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రనుంచి ఎడ్లబండ్లలో రవాణా అవుతున్న 2.5క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్టు సీపీ తెలిపారు. బుధవారం స్థానిక కమిషనరేట్‌ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన నకిలీ విత్తనాల పట్టివేత, అరెస్టు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిర్వంచ ప్రాంతానికి చెందిన కోల రమేష్‌(50), అతని కుమారుడు కోల సాయికిరణ్‌ (23) అనే వ్యక్తులు కొంతకాలంగా మంచిర్యాల జిల్లా కోటపల్లిలో నివాసముంటున్నారన్నారు. వారు మహారాష్ట్రకు చెందిన సుమిత్‌, జంగ సంపత్‌, వద్ద నకిలీ పత్తి విత్తనాలను కొని మంచిర్యాల జిల్లాలో రైతులకు అమ్మాలని ప్ర యత్నిస్తున్నారన్నారు. దీనిలో భాగంగా బుధవారం తెల్లవారుజామున ఎడ్లబండి లో నకిలీ విత్తనాలు తీసుకువస్తుండగా నీల్వాయి ఎస్‌ఐ శ్యాంపటేల్‌, కానిస్టేబుళ్లు నాగేందర్‌, శేఖర్‌, మరికొందరు సిబ్బంది వేమనపల్లి వద్ద వ్యవసాయ అధికారితో కలిసి మాటువేశారన్నారు. ఎడ్లబండి ద్వారా విత్తనాలు రాగానే పట్టుకున్నారని, విత్తనాలు రవాణా చేస్తున్న కోల సాయికిరణ్‌(23)ను అరెస్టు చేశామన్నారు. అత ని తండ్రి రమేష్‌ పరారయ్యాడన్నారు. ఇతని వద్ద నుంచి 6.75లక్షల రూపాయల విలువైన నకిలీ పత్తివిత్తనాలు, ఎడ్ల బండి, ఎద్దులను స్వాధీనం చేసుకున్నామన్నా రు. కేసులో రమేష్‌, సుమిత్‌, జంగ సంపత్‌ పరారీలో ఉన్నారన్నారు. వారంలో మూడు నకిలీ పత్తి విత్తనాల రవాణాను పట్టుకున్నట్టు సీపీ వెల్లడించారు. మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాలు రవాణా జరుగుతున్నట్టు గుర్తించామని, అక్కడ కూడా త్వరలోనే దాడులు చేస్తామన్నారు. నిందితులపై పీడీ యాక్టు కూడా నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. కాగా నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ వరి విత్తనాలు సరఫరా చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా నకిలీ విత్తనాలు పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ శ్యాంపటేల్‌, కానిస్టేబుళ్లు రాజేందర్‌, రాజశేఖర్‌ను సీపీ అభినందించారు. విలేకరుల సమావేశంలో అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) రాజు, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్‌ రూరల్‌ సీఐ సుధాకర్‌, నీల్వాయి ఎస్‌ఐ శ్యాంపటేల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 12:27 AM