Share News

దేవుడిపై ఒట్టు వేసి ఓట్ల రాజకీయం

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:00 AM

ఆచరణ సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు దేవుడిపై ఒట్లు పెడుతూ రాజకీయం చేస్తున్నారని కరీంనగర్‌ లోక్‌ సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు.

దేవుడిపై ఒట్టు వేసి ఓట్ల రాజకీయం
వాకర్స్‌తో మాట్లాడుతున్న వినోద్‌ కుమార్‌

వేములవాడ, ఏప్రిల్‌ 24 : ఆచరణ సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు దేవుడిపై ఒట్లు పెడుతూ రాజకీయం చేస్తున్నారని కరీంనగర్‌ లోక్‌ సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. బుధవారం వేములవాడ పట్టణంలోని కూరగాయల మార్కెట్‌, మండల పరిషత్‌ ఆవరణ, బాలానగర్‌లోని కోర్టు సమీపంలోని మైదానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మార్నింగ్‌ వాకర్స్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు దేవుళ్లపై ఒట్లు వేసి ఓట్ల రాజకీయం చేస్తున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నాలుగు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అబద్ధాల పునాదులపై ఏర్పాటైందని, ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం చేసి తమిళనాడుకు నీళ్లను తరలించే కుట్ర చేస్తోందని, పెండింగ్‌ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి గోదావరి బేసిన్‌లో తెలంగాణ నీళ్ల వాటా ఎంతనో తేల్చాలని అన్నారు. నదుల అనుసంధా నంపై రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లోకి చేరిన ధాన్యం ఎండకు ఎండి వానకు తడిసి పోతుందని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిం చారు. బండి సంజయ్‌ వేములవాడ రాజన్న గుడికి ఐదు కొత్తలు తేలేదని, మత రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీ నర్సింహారావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెక్స్‌ టైల్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, మాజీ జడ్పీ చైర్మన్‌ తీగల రవీందర్‌ గౌడ్‌, ప్యాక్స్‌ ఛైర్మన్‌ తిరుపతి రెడ్డి, సీనియర్‌ నాయకులు మనోహర్‌ రెడ్డి, రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 01:00 AM