ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:56 PM
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థులను చేర్పించాలని, బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బడిబాట కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

కరీంనగర్ టౌన్, జూన్ 7: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థులను చేర్పించాలని, బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బడిబాట కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమంపై పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన బడిబాట కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి బడీడు పిల్లలను గుర్తించి వారి వివరాలు సేకరించాలన్నారు. వారు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేయాలన్నారు. పైవ్రేట్ పాఠశాలల్లో 1 నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతోనూ సమావేశం నిర్వహించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకొని అప్‌గ్రేడ్ అవుతున్న ఐదు నుంచి ఆరు సంవత్సరాల ఉన్న చిన్నారులను అందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ, విద్యా బోధన, ఆటపాటలు, ప్రత్యేక కార్యక్రమాలు, విహార యాత్రలపై షార్ట్ వీడియోలు రూపొందించాలన్నారు. వాటిని అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు పంపడంతోపాటు వివిధ గ్రూపుల్లో పెద్ద ఎత్తున షేర్ చేయాలని సూచించారు. దీనిపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, టాయిలెట్స్ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, ఈజీఎస్ ద్వారా నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఈ నెల 10 వ తేదీ వరకు పాఠ్యపుస్తకాలు అందించడంతోపాటు యూనిఫామ్స్ విద్యాశాఖ అధికారులు సిద్ధం చేసి ఉంచాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువ ఉన్నచోట పెంచేలా ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. జులైలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు షూస్ అందించే ఏర్పాట్లు చేస్తానని వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రతిభ గల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను గుర్తించాలని ఆదేశించారు. సమావేశంలో డీఈవో జనార్దన్‌రావు, జడ్పీ సీఈవో శ్రీనివాస్, డీపీవో రవీందర్, డీఆర్డీవో శ్రీధర్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, మెప్మా ఇన్‌చార్జి పీడీ స్వరూపారాణి పాల్గొన్నారు.