Share News

బాలికల భవిష్యత్తుకు విద్యార్థి దశ నుంచే పునాది వేయాలి

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:11 AM

విద్యార్థి దశ నుంచే బాలికల భవిష్యత్తుకు పునాది వేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు.

బాలికల భవిష్యత్తుకు విద్యార్థి దశ నుంచే పునాది వేయాలి

తిమ్మాపూర్‌, జనవరి 10: విద్యార్థి దశ నుంచే బాలికల భవిష్యత్తుకు పునాది వేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో స్నేహిత కార్యక్రమాన్ని కలెక్టర్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు బాలిక సాధికారత దిశగా జిల్లాలో స్నేహిత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ఆడపిల్లలు ఏ సమస్య ఉన్నా తల్లిదండ్రులకు, ఉపాద్యాయులకు ధైర్యంగా చెప్పాలన్నారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు టోల్‌ ఫ్రీ నంబర్లు, షీ టీంలు ఉన్నాయని గుర్తుచేశారు. విద్యార్థినులు అపరిచితులతో ఇంటర్నెట్‌లో పరిచయాలు పెంచుకొని తమ జీవితాలను పాడుచేసుకొవద్దన్నారు. చదువులపైనే ధ్యాస పెట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తుంటారని, వాటిని అధిగమించి తప్పులను సరి చేసుకుని ముందుకు సాగాలని తెలిపారు. గమ్యాన్ని నిర్ధేశించుకుని ఆ దిశగా చదువు కొనసాగించాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మాట్లాడుతూ జిల్లా అధికారులు, ఉపాద్యాయులతో బాలికా సాధికారత కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం జిల్లాలోని రెండు పాఠశాలల్లో స్నేహిత కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఇందులో విద్యార్థినులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. తిమ్మాపూర్‌ సర్పంచ్‌ దుండ్ర నీలమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఈవో జనార్దన్‌రావు, డీఎంహెచ్‌వో లలితా దేవి, కరీంనగర్‌ రూరల్‌ సీడీపీవో సబితా కుమారి, డీసీపీవో శాంత, తహసీల్దార్‌ కనకయ్య, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ పద్మ పాల్గొన్నారు.

ఫ బాల్య వివాహలకు అడ్డుకట్ట వేయాలి.

మానకొండూర్‌: బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌దేశాయ్‌ సూచించారు. మండలంలోని శ్రీనివాస్‌నగర్‌లోని కేజీబీవీ, పోచంపల్లిలోని ఆదర్శ పాఠశాలలో బుధవారం స్నేహిత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. పోషకాహరం తీసుకోని ఆరోగ్యవంతులుగా జీవించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ వెంకటలక్ష్మి, ఎం అరుణ, శ్రీలత, వైద్యుడు గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 12:11 AM