Share News

బొగ్గు బ్లాకుల వేలంపై అగ్గి రాజుకుంటున్నది..

ABN , Publish Date - Jul 08 , 2024 | 01:04 AM

సింగరేణి బొగ్గు బాకుల వేలంపాట లొల్లి అగ్గి రాజుకుంటున్నది. ఈ అంశంపై కార్మిక సంఘాలు తలో దారిలో ప్రయనిస్తున్నాయి. ఐక్య ఉద్యమాలే శరణ్యమన్న కార్మిక సంఘాల ఎవరికి వారుగా బొగ్గు బ్లాకుల అంశంపై వార్‌ క్యాలెండర్లు ప్రకటించుకుని పోరాటాలు మొదలుపెట్టాయి.

బొగ్గు బ్లాకుల వేలంపై అగ్గి రాజుకుంటున్నది..

- ప్రభుత్వానిది ప్రైవేటీకరణ దారి.. సంఘాలది తలో దారి..

గోదావరిఖని, జూలై 7: సింగరేణి బొగ్గు బాకుల వేలంపాట లొల్లి అగ్గి రాజుకుంటున్నది. ఈ అంశంపై కార్మిక సంఘాలు తలో దారిలో ప్రయనిస్తున్నాయి. ఐక్య ఉద్యమాలే శరణ్యమన్న కార్మిక సంఘాల ఎవరికి వారుగా బొగ్గు బ్లాకుల అంశంపై వార్‌ క్యాలెండర్లు ప్రకటించుకుని పోరాటాలు మొదలుపెట్టాయి. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై గత నాలుగు సంవత్సరాలుగా సింగరేణిలో నిరసన జరుగుతూనే ఉన్నది. కానీ ఇప్పటికే కోయగూడెం, సత్తుపల్లి ఓసీపీ-3 వేలం పాటల్లో ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పుడు శ్రావణపల్లి, కేకే6 వంతు వచ్చింది. కోయగూడెం, సత్తుపల్లి ఓసీపీల వేలం పాటల సందర్భంలో కూడా కార్మిక సంఘాలు అందుకు వ్యతిరేకమైన వైఖరితో ఉద్యమాలు చేశాయి. కానీ కేంద్ర ప్రభుత్వం చిట్టచివరికి ఆ ప్రక్రియను విజయవంతంగా ముగించింది. అప్పుడు గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్‌, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బీఆర్‌ఎస్‌ వాటికి వ్యతిరేకంగా స్పందించడం వల్ల టెండర్‌ ప్రక్రియ రెండుసార్లు వాయిదా పడిందే తప్ప ఫలితం మాత్రం ప్రైవేట్‌పరం అయ్యింది. శ్రావణపల్లి, కేకే-6 టెండర్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులు సింగరేణికి దక్కే విధంగా ఎంఎండీఆర్‌ చట్టంలోని ఆర్టికల్‌-17 ప్రకారం అవకాశం ఉంది. ఖనిజ సంపద ఉన్న ప్రాంతంలో ప్రభుత్వరంగ సంస్థలు వాటిని వెలికితీసేందుకు ఆసక్తి చూపితే కొన్ని రాయితీలతో వాటిని అప్పగించాలని ఆర్టికల్‌-17 చెబుతుంది. కానీ ఈ అంశాన్ని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కానీ, సింగరేణి యాజమాన్యం కానీ ఈ అంశం పట్ల ఆసక్తి కనబర్చడం లేదు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి ఈ బొగ్గు బ్లాకులను దక్కించుకునేందుకు వేలం పాటలో పాల్గొంటుందని చెబుతుందని చెబుతుంటే ఈ రెండు బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రిని కోరారు. ఈ వైరుధ్యం ఇలా ఉండగా సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీయూసీ తన పోరాటాల షెడ్యూల్‌ను ప్రకటించుకున్నది. కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేసింది, సింగరేణి జీఎం కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలకు సిద్ధమైంది. ఐఎన్‌టీయూసీ తన కోర్‌ కమిటీలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రణభేరిని ప్రకటించింది. టీబీజీకేఎస్‌ జూలై 2నుంచి క్యాలెండర్‌ నిరసన కార్యక్రమాలను చేస్తూనే ఉన్నది. ఇక హెచ్‌ఎంఎస్‌, ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ ఇతర సంఘాలు కలిసి ఐక్య వేదికగా ఏర్పడి హైదరాబాద్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించి పోరాటాలకు సిద్ధమైంది. మావోయిస్టు పార్టీ కోల్‌బెల్ట్‌ ఏరియా కమిటీ కూడా సింగరేణి బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా పోరాటాలకు పిలుపునిస్తూనే ఐక్య కార్యాచరణగా కార్మిక సంఘాలు ముందుకు వెళ్లాలని సూచన చేసింది. బీఎంఎస్‌ ఈ అంశంపై తటస్థతను వ్యక్తం చేస్తూ పరనింద ఆరోపణలకు పూనుకుంటున్నది. ఇంత జరుగుతున్నా సింగరేణి యాజమాన్యం మాత్రం బొగ్గు బ్లాకుల వేలం అంశంపై ఇప్పటికీ తన వైఖరిని, తన కార్యాచరణను ప్రకటించలేదు.

ఫ స్పష్టత కరువు..

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఈ రాష్ట్రానికి సంబంధించిన కిషన్‌రెడ్డి అయినప్పటికీ బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించే అంశంపై స్పష్టత ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇది ప్రైవేటీకరణ కాదు, వేలం పాటల్లో సింగరేణి పాల్గొనవచ్చునని సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. ఈ లొల్లిలో దేశ వ్యాప్తంగా 66బొగ్గు బ్లాకులకు వేలం పాటలు జరుగుతున్న సందర్భంలో సింగరేణి యాజమాన్యం కూడా కేవలం సింగరేణిలోని రెండు బ్లాకుల అంశాన్నే చూడకుండా 62బొగ్గు బ్లాకులను దక్కించుకునేందుకు సింగరేణి వేలం పాటల్లో పాల్గొంటే దేశ వ్యాప్తంగా జరుగుతున్న ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి సంకేతం ఇచ్చినట్టు అవుతుందని సింగరేణిలోని కొందరు అధికారులు మెల్లగా ఇప్పుడిప్పుడే నోరు విప్పుతున్నారు. మొత్తం సింగరేణి సంస్థ భవిష్యత్‌నే ప్రశ్నార్థకం చేస్తున్న శ్రావణపల్లి, కేకే-6 బొగ్గు బ్లాకుల వేలం పాటల అంశంపై కార్మిక సంఘాలు ఐక్య కార్యాచరణను రూపొందించుకోకపోవడం అనేది సింగరేణిలో అనేక అనుమానాలను, ప్రశ్నలను రేకెత్తిస్తున్నది. కార్మికుల చిన్న ఆర్థిక ప్రయోజనాల కోసం, లేదా హక్కుల సాధన కోసం జేఏసీలుగా ఏర్పడి ఐక్య పోరాటాలు నిర్వహించిన సింగరేణి కార్మిక సంఘాల స్పృహ ఇప్పుడు ఎందుకు లేకుండా పోయిందనేది చర్చకు వస్తున్నది. యావత్తు సింగరేణి భవిష్యత్‌ను ప్రశ్నార్థం చేస్తున్న వేలం పాటల అంశంపై కార్మిక సంఘాలకు ఎందుకు తీవ్రత లేదనేది కార్మికవర్గం యోచిస్తున్నది. సింగరేణిలో పని చేస్తున్న ప్రస్తుత కార్మికులు ఈ బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై సీరియస్‌గా స్పందించడం లేదని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. కానీ డిపెండెంట్‌ ఎంప్లాయిమెంట్‌ కొనసాగుతున్న సింగరేణిలో కార్మికులు తమ పిల్లల భవిష్యత్‌ కోసమైనా బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతిస్పందించాల్సి ఉందని మావోయిస్టు పార్టీ ర్యాడికల్స్‌ పేర ఒక ప్రకటన వెలువరించింది.

ఫ మనుగడ ప్రశార్థకం..

సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కూడా ఇప్పుడు లేవు కదా, కార్మిక సంఘాలు తమ వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఎందుకు వేరు వేరుగా పోరాటాలు చేస్తున్నాయని కోల్‌బెల్ట్‌లో వాపోతున్నారు. సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకమైతే కార్మిక సంఘాల మనుగడ కూడా లేకుండా పోతుందనే సామాన్యమైన విషయాన్ని కూడా కార్మిక సంఘాలు ఎందుకు స్పృహలోకి తెచ్చుకోవడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అంశం సింగరేణి పరిధిలోనిది అయినప్పటికీ ఈ విషయంపై కోల్‌బెల్ట్‌ సమాజాన్ని కూడా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉన్నదని మేధావుల ఆలోచన. వేరువేరు ఎజెండాలతో, వేరువేరు జెండాలో ఒకేరకమైన నిరసనలు తెలుపుతున్న సింగరేణిలోని క్రియాశీల కార్మిక సంఘాలు ఇప్పటికైనా బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్యపోరాటాలు, సమష్టి పోరాటాలకు సంసిద్ధం కావాల్సిన చారిత్రాత్మక అససరం కనిపిస్తున్నది. ఒకవేళ శ్రావణపల్లి, కేకే-6 బాక్లులు వేలం పాటల్లో ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళితే కేవలం ఐదేళ్ల కాలంలోనే సింగరేణి భవిష్యత్‌ ప్రశ్నార్థంగా మారే ప్రమాదం ఉంది. ఇన్ని పోరాటాలు జరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్లాకులను సింగరేణి కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం మాత్రం బొగ్గు బ్లాకుల వేలాన్నియధాతథంగా కొనసాగించడంతో పాటు ఇది ప్రైవేటీకరణ కాదు అనే విషయాన్ని పదేపదే నొక్కి చెబుతూ వస్తున్నది. ఈ రెండు బ్లాకులు జాతీయ సంపదగా పేర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం సింగరేణి పరిధిలో ఉన్న అంశాన్ని అంత విలువైన విషయంగా పరిగణించడం లేదు.

Updated Date - Jul 08 , 2024 | 01:04 AM