Share News

కేసీఆర్‌, కాంగ్రెస్‌ పాలనకు మధ్య తేడాను వివరించాలి

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:43 PM

పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతీ ఓటరును కలిసి కేసీఆర్‌ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు మధ్య ఉన్న తేడాను వివరించాలని, నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో విరక్తి పెరిగిందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాజీ మంత్రి కే తారకరామారావు అన్నారు.

కేసీఆర్‌, కాంగ్రెస్‌ పాలనకు మధ్య తేడాను వివరించాలి
మాట్లాడుతున్న కేటీఆర్‌

సిరిసిల్ల, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతీ ఓటరును కలిసి కేసీఆర్‌ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు మధ్య ఉన్న తేడాను వివరించాలని, నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో విరక్తి పెరిగిందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాజీ మంత్రి కే తారకరామారావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ తెలంగాణ భవన్‌లో ముస్తాబాద్‌, గంభీరావుపేట, తంగళ్లపల్లి మండలాల వారీగా క్లస్టర్‌ స్థాయి సమావేశాలు నిర్వహించారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కొట్లాడి నిధులు సాధించే బోయినపల్లి వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. ఎంపీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చే నెల 10న సిరిసిల్లకు కేసీఆర్‌ వస్తున్నారని, మండలాల వారీగా పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. విధ్వేషం పేరుతో రాజకీయం చేసే వారికి ఓటు వేస్తే అభివృద్ధి స్థానంలో విధ్వంసం జరుగుతుందన్నారు. ప్రజలు చైతన్యవంతులని, కాంగ్రెస్‌, బీజేపీ చేస్తున్న మిలాఖత్‌ రాజకీయాలను గమనిస్తున్నారని అన్నారు. కరీంనగర్‌లో వినోద్‌కుమార్‌ వంటి సీనియర్‌ నేతను గెలిపించుకోవాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని, విధ్వేష రాజకీయాలకు మనవద్ద చోటు లేదని అన్నారు. నాలుగు నెలలు గడవక ముందే కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో విరక్తి పెరిగిందని, కరెంట్‌ కోతలతో రైతులు ఆగమై పోతున్నారని అన్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, రైతుల గురించి అడిగితే ఒక్కో మంత్రి ఒక్కో మాట మాట్లాడుతున్నారని అన్నారు. రైతుల పక్షాన బాధ్యత తీసుకునే వారే లేరన్నారు. ఈ సమావేశంలో నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:43 PM