Share News

గడువు మూడు రోజులే

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:27 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువు సమీపిస్తుండడంతో జనం బారులు తీరుతున్నారు.

గడువు మూడు రోజులే

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 2: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువు సమీపిస్తుండడంతో జనం బారులు తీరుతున్నారు. డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఆరు గ్యారెంటీలకోసం దరఖాస్తుల స్వీకరణ చేపడుతుండడంతో నగరాలు, పట్టణాల్లోనే మొదట స్పందన కనిపించింది. దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అంటూ ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజాపాలన సభలకు స్పందన అంతగా కనిపించలేదు. అయితే దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 6తో ముగియనుండడంతో ఆ తర్వాత దరఖాస్తులను స్వీకరిస్తారో లేదోనన్న అనుమానాలతో మంగళవారం ప్రజాపాలన సభల వద్ద బారులు తీరి దరఖాస్తులు సమర్పించారు. జిల్లాలో కరీంనగర్‌, మానకొండూర్‌, హుజురాబాద్‌, చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గాలకు ప్రత్యేక అధికారులను, మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థతోపాటు హుజురాబాద్‌, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీలు, 16 మండలాలోని 313 గ్రామ పంచాయతీ వీటి పరిధిలో 170 బృందాల ద్వారా 146 వార్డులలో ప్రజా పాలన కార్యక్రమాలను నిర్వహించి ప్రజ లకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో ప్రతి వార్డులు, కార్పొరేషన్‌లో ప్రతి డివిజన్‌లో ఎక్కడికక్కడ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఒక్కో కేంద్రంలో ఐదు కౌంటర్ల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షెడ్యూల్లో గ్రామసభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరి స్తున్నారు. అలాగే అవసరమైన వారికి అక్కడే దరఖాస్తు ఫారాలను కూడా ఉచితంగా అందజేస్తున్నారు.

దరఖాస్తుదారు ఫొటో, ఆధారుకార్డు, రేషన్‌కార్డు, ఫోన్‌నెంబర్‌, కుటుంబసభ్యుల ఆధార్‌ నెంబర్లు, గ్యాస్‌ కనెక్షన్‌ నెంబర్‌, గ్యాస్‌ ఏజెన్సీ పేరు, పట్టాదారుపుస్తకం నెంబర్‌, సర్వే సంఖ్య, విస్తీర్ణం, వ్యవసాయ కూలీ అయితే జాబ్‌ కార్డు నెంబర్‌, గృహ విద్యుత్‌ మీటర్‌ కనెక్షన్‌ నెంబర్‌, దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్‌లను జతచేస్తూ దరఖాస్తు చేసుకోవాలి. మహాలక్ష్మి, రైతుభరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత పథకం కోసం ముందుగా దరఖాస్తుల ను స్వీకరించే విధంగా దరఖాస్తు నమూనాను తయారు చేశారు. అయితే రేషన్‌కార్డు కోసం ఈ దరఖాస్తు ఫారంలో అంశం చేర్చకపోవడంతో అనేక మంది రేషన్‌కార్డు దరఖాస్తులను జతచేసి ఇస్తున్నారు.

Updated Date - Jan 03 , 2024 | 12:27 AM