Share News

కరీంనగర్‌-జగిత్యాల రోడ్డు పనులకు 15 రోజుల్లో టెండర్లు

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:36 AM

కరీంనగర్‌-జగిత్యాల రోడ్డ విస్తరణ పనులకు 15 రోజుల్లో టెండర్లు పూర్తవుతాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం నగరంలోని ఎంపీ కార్యాలయంలో జాతీయ రహదారులు ఎన్‌హెచ్‌ 563 విస్తరణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కరీంనగర్‌-జగిత్యాల రోడ్డు పనులకు 15 రోజుల్లో టెండర్లు

కరీంనగర్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): కరీంనగర్‌-జగిత్యాల రోడ్డ విస్తరణ పనులకు 15 రోజుల్లో టెండర్లు పూర్తవుతాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం నగరంలోని ఎంపీ కార్యాలయంలో జాతీయ రహదారులు ఎన్‌హెచ్‌ 563 విస్తరణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపొందించిన వంద రోజుల ప్రణాళికలో కరీంనగర్‌-జగిత్యాల రోడ్డు విస్తరణ ఉందన్నారు. కరీంనగర్‌-జగిత్యాల రోడ్డు విస్తరణకు త్వరలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మూడు ప్రాంతాల్లో బైపాస్‌ రోడ్లను నిర్మిస్తున్నట్లు, 2,227 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 58 కిలోమీటర్ల మేర చేపట్టే విస్తరణ పనుల్లో ఆరు మేజర్‌, 18 మైనర్‌ బ్రిడ్జిలు, 195 కల్వర్టులను నిర్మించనున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం జూలై నాటికి పనులు పూర్తవుతాయన్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణలో ఎదురయ్యే సమస్యలను కలెక్టర్‌, ఇతర శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల పురోగతిపై మాట్లాడుతూ ఇప్పటికే 37 శాతం పూర్తయిందన్నారు. కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వరకు 68.015 కిలోమీటర్ల మేర జరుగుతున్న పనుల్లో మానకొండూర్‌, తాడికల్‌, హూజూరాబాద్‌, ఎల్కతుర్తి, హసన్‌పర్తి వద్ద బైపాస్‌లను నిర్మించనున్నట్లు తెలిపారు. 29 మైనర్‌ జంక్షన్లను నిర్మించనున్నామన్నారు. గట్టుదుద్దెనపల్లి, చెంజర్లలో భూసేకరణలో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయని అధికారులు తెలుపగా వెంటనే కలెక్టర్‌ పమేలా సత్పతితో ఫోన్‌లో మాట్లాడారు. కరీంనగర్‌ ఆర్డీవోను పిలిపించి భూసేకరణ సమస్యను పరిష్కరించాలని సూచించారు. ప్రజల విజ్ఞప్తుల మేరకు సర్వీస్‌, స్ట్రక్చరల్‌ రోడ్ల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ మాధవి, అధికారులు క్రిష్ణారెడ్డి, నిర్మాణ సంస్థ ప్రతినిధులు రమేష్‌ త్రిపాఠి కమలేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:36 AM