Share News

ఆటపాటలతో బోధన

ABN , Publish Date - Jul 08 , 2024 | 01:02 AM

పోషకాహార కేంద్రాలుగా సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ సెంటర్‌ల బలోపేతంపై సర్కారు దృష్టి సారించింది. బుడిబుడి అడుగులు వేసే చిన్నారులకు ఆటాపాటలతో ఆకట్టుకునే విధంగా పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలుగా అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తోంది.

ఆటపాటలతో బోధన

- అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం

- ముగిసిన అంగన్‌వాడీ టీచర్ల శిక్షణ

- చిన్నారులకు స్కూల్‌ యూనిఫాం, పుస్తకాలు

- ఆకట్టుకునే విధంగా విద్యాబోధన

- పర్యవేక్షించిన జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం

- జిల్లాలోని 587 అంగన్‌వాడీ కేంద్రాల్లో భారీ మార్పులు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పోషకాహార కేంద్రాలుగా సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ సెంటర్‌ల బలోపేతంపై సర్కారు దృష్టి సారించింది. బుడిబుడి అడుగులు వేసే చిన్నారులకు ఆటాపాటలతో ఆకట్టుకునే విధంగా పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలుగా అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 587 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం విధుల్లో ఉన్న 568 మంది అంగన్‌వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్యను అందించే విధంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లాలోని ప్రతీ టీచర్‌, పిల్లల సమగ్రాభివృద్ధిలో భాగంగా శారీరక, కండర, చలన అభివృద్ధి, భాషా, అక్షరాస్యత, సాంఘీక, భావోద్వేగ, నైతిక అభివృద్ధి, సాంస్కృతిక, రసాస్వాదన అభివృద్ధి, మేధో అభివృద్ధిని మెరుగుపర్చడానికి శిక్షణ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని 16 బ్యాచ్‌లుగా విభజించి శిక్షణను అందించారు. ఆదివారం శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి పర్యవేక్షణలో రాష్ట్ర శిక్షణ సంస్థలో శిక్షణ పొందిన మాస్టర్‌ ట్రెయినర్లు పూర్తి స్థాయిలో శిక్షణను అందించారు. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ విద్యను అందిస్తున్నా మెరుగైన విద్యాబోదన, వినూత్న పద్ధతిలో చిన్నారులకు విద్యను అందించే దిశగా మార్పులు చేశారు. అంగన్‌వాడీ టీచర్లకు అందించిన శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నారు.

చిన్నారులకు యూనిఫాం, పుస్తకాలు

జిల్లాలో 587 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అనుబంధ పోషకాహారంతోపాటు చిన్నారులకు శిక్షణ అందిస్తున్నారు. ఫ్రీస్కూల్‌లో భాగంగా జిల్లాలోని 17 వేల 138 మంది చిన్నారులకు యూనిఫాం, రంగు రంగుల బొమ్మలతో కూడిన పుస్తకాలను కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఫ్రీస్కూల్‌లో భాగంగా చిన్నారులకు కార్పొరేట్‌ ప్లేస్కూల్‌ తరహాలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు ఎక్కువగా పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పోషక కేంద్రాలుగా..

జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలు పోషక కేంద్రాలుగా సేవలు అందిస్తున్నాయి. అంగన్‌వాడీల ద్వారా నిత్యం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 40 వేల మంది లబ్ధి పొందుతున్నారు. ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా 17138 మంది, ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు 2.5 కిలోల బాలామృతం ప్యాకెట్‌, 16 కోడిగుడ్లు టేక్‌ హోం రేషన్‌గా అందిస్తున్నారు. 4133 మంది గర్భిణులు, 2644 బాలింతలు, 3 నుంచి 6 సంవత్సరాల 15,195 పిల్లలకు ఒకపూట సంపూర్ణ భోజనం ప్రతీ రోజు కోడి గుడ్డు, పాలు, పప్పు కూరగాయలతోపాటు కుర్‌కురే వంటి స్నాక్స్‌ అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, ఎదిగే పిల్లలకు పోషకాహార కేంద్రాలుగా మారాయి.

అద్దె భవనాల్లో ఇబ్బందులు

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు ఆదర్శ ప్రాయంగా కొనసాగుతున్నా అద్దె భవనాల్లో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 587 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 257 సొంత భవనాలు మాత్రమే ఉన్నాయి. 158 అద్దె భవనాల్లో కొనసాగుతుండగా 172 ప్రాథమిక పాఠశాల గదుల్లో నిర్వహిస్తున్నారు. సిరిసిల్ల ప్రాజెక్ట్‌ పరిధిలో 362 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 135 సొంత భవనాలు, 106 అద్దె భవనాలు, 121 ప్రాథమిక పాఠశాల గదుల్లో కొనసాగుతున్నాయి. వేములవాడ ప్రాజెక్ట్‌ పరిఽధిలో 225 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 122 సొంత భవనాలు, 52 అద్దె భవనాల్లో ఉన్నాయి. 51 ప్రభుత్వ పాఠశాల గదుల్లో కొనసాగుతున్నాయి. గతంలో సొంత భవన నిర్మాణాలు చేపట్టినా మధ్యలోనే నిలిచిపోయాయి.

రిటైర్మెంట్‌పై అయోమయం

అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రక్షాళన చేసే దిశగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మరోవైపు ఏప్రిల్‌ 30 నాటికి 65 సంవత్సరాలు నిండిన వారిని విధుల్లో నుంచి తొలగిస్తూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి మెమో జారీ చేశారు. ఇప్పటికే 65 సంవత్సరాలు నిండినవారిలో 122 మందిని తొలగిస్తూ ఉత్తర్వులు వచ్చినా ఇతర అంగన్‌వాడీ కేంద్రాల్లోని వారికి కేటాయింపులు జరగలేదు. జిల్లాలో పదవీ విరమణలో 27 మంది టీచర్లు, 95 మంది ఆయాలు ఉన్నారు. ప్రభుత్వం కేవలం టీచరుకు రూ. లక్ష, సహాయకురాలికు రూ.50 వేల చొప్పున మాత్రమే పదవీ విరమణ బెనిఫిట్‌ను ప్రకటించడంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు బలోపేతం జరుగుతున్నా క్రమంలో అంగన్‌వాడీల ఆందోళన కేంద్రాల నిర్వహణపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

జిల్లాలో శిక్షణ పూర్తి

- పి.లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమ అఽధికారి

జిల్లాలో 587 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 528 మంది టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్యపై శిక్షణ ఇచ్చాం. ప్రియదర్శిని, పూర్వ ప్రాథమిక విద్యాకర దీపిక పుస్తకాలను వెలువరించాం. వీటిపై ప్రతీ టీచరుకు మూడు రోజుల శిక్షణ అందించాం. అధునాతన డిజిటల్‌ సౌండ్‌ సిస్టమ్‌, రంగుల రంగుల చార్ట్‌లు అందించి ప్రకృతి సహాయంగా దొరికే వస్తువుల ద్వారా పిల్లలకు అభ్యాసన సామగ్రిని ఎలా అందించాలనే దానిపై శిక్షణ ఇచ్చాం. అంగన్‌వాడీ టీచర్లు శిక్షణపై సంతృప్తి చెందారు.

Updated Date - Jul 08 , 2024 | 01:02 AM