స్వామియే.. శరణం అయ్యప్ప
ABN , Publish Date - Oct 20 , 2024 | 01:05 AM
ఎన్నెన్ని నామాలో.... అయ్యప్ప స్వామి... ఎన్నెన్ని నియమాలో. శరణం అయ్యప్ప, కన్నిమూల గణపతిని వేడుకొని స్వామి కార్తీక మాసంలో మాలలు వేసుకుంటిమి. హరిహరసుతునే శరణం అయ్యప్ప.. అంటూ మాలధారులు అయ్యప్పస్వామిని కొలవనున్నారు.
- నవంబరు 15న మకర విళక్కుతో మండల పూజలు ప్రారంభం
- మహాపాదయాత్రగా బయల్దేరుతున్న దీక్షాపరులు
- జిల్లాలో మొదలైన అయ్యప్పల సందడి
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల )
ఎన్నెన్ని నామాలో.... అయ్యప్ప స్వామి... ఎన్నెన్ని నియమాలో. శరణం అయ్యప్ప, కన్నిమూల గణపతిని వేడుకొని స్వామి కార్తీక మాసంలో మాలలు వేసుకుంటిమి. హరిహరసుతునే శరణం అయ్యప్ప.. అంటూ మాలధారులు అయ్యప్పస్వామిని కొలవనున్నారు. తలపై ఇరుముడితో, మండల దీక్షతో శబరిమలకు లక్షలాది మంది భక్తులు సాగిపోయే కాలం మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మహాపాదయాత్రలు మొదలయ్యాయి. సిరిసిల్ల నుంచి ఇప్పటికే 50 మంది అయ్యప్ప స్వాములు ఇరుముడులతో పాదయాత్రగా బయల్దేరి వెళ్లారు. దట్టమైన అరణ్యంలో... అంబరాన్ని చుంబించే పర్వతాల మీదుగా సాగే ఆ యాత్ర ఓ ఆధ్యాత్మిక ఘట్టం. జిల్లా నుంచి అయ్యప్ప స్వాములు కాలినడకన 1400 కిలోమీర్ల దూరం ఇరుముడితో ఏటా పాదయాత్ర చేస్తున్నారు. అయ్యప్పల సందడి సంక్రాంతి రోజున శబరి మలలో జ్యోతి దర్శనం వరకు కనిపిస్తుంది.
15న మకరవిలక్కుతో మండల పూజలు ప్రారంభం
శరీరాన్ని, మనస్సును అదుపులో ఉంచుకొని సన్మార్గంలో పయనింపజేసేదే అయ్యప్ప మండల దీక్షగా భావిస్తారు. 41 రోజుల పాటు అయ్యప్పకు ఆత్మనివేదన చేసుకుంటూ నిత్య శరణు ఘోషతో పూజిస్తారు. రోజులో ఒకసారి భిక్ష, మరోసారి అల్పహరం, రెండు సార్లు చన్నీటి స్నానం, నేలపై నిద్రించాలనే కఠిన నియమాలు పాటిస్తారు. నవంబరు 15 నుంచి అయ్యప్ప దేవాలయాల్లో మండల పూజ ప్రారంభమవుతున్న క్రమంలో దీక్షలు పొందడానికి భక్తులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో అయ్యప్ప మాల దీక్ష స్వీకరిస్తున్న భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్నారు. ఇప్పటికే మాలలు స్వీకరించిన భక్తులు శరణుఘోష వినిపిస్తుండగా కార్తీక పౌర్ణమి రోజు వేలాది మంది భక్తులు మాలధారణకు పొందుతారు. నవంబరు 15వ తేదీన సన్నిధానంలో శబరిమల అయ్యప్పస్వామి ఆలయాన్ని తెరుస్తారు. అప్పటి నుంచి డిసెంబరు 26వ తే దీ వరకు మండల పూజ మహోత్సవాలు నిర్వహిస్తారు. 30వ తేదీన మకరవిలక్కు నిర్వహిస్తే, జనవరి 14న మకరవిలక్కు, 19న అయ్యప్ప దేవాలయాన్ని మూసి వేస్తారు. మకరవిలక్కు దర్శనానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వెళ్తారు.
మోక్ష మార్గానికి 18మెట్లు
అయ్యప్ప స్వామి హరిహరసుతుడు, మణికంఠుడిగా పిలుస్తారు. అయ్యప్ప పూజా సంప్రదాయం అధికంగా దక్షిణ భారత దేశంలో కనబడుతుంది. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు ఈ పేర్ల సంగమమంతోనే అయ్యప్ప నామం పుట్టిందని తెలుస్తుంది. మహిషీ అనే రాక్షసుడిన్ని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడని చెప్పుకుంటారు. కేరళలోని శబరిమలై హిందువుల యాత్ర స్థలాల్లో ఒకటి. ఏటా ఐదు కోట్ల మంది భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునే వారు 18మెట్లు ఎక్కడమే భాగ్యంగా భావిస్తారు. అయ్యప్పస్వామి ఎత్తైన ప్రదేశానికి ఎక్కడానికి ప్రయత్నించగా నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అష్ట దిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానము, అజ్ఞానానికి రూపమైన దేవాతా మూర్తులు 18మెట్లుగా ఏర్పడి ఆ ప్రదేశానికి అయ్యప్ప చేరుకోవడానికి దోహద పడ్డారని చెప్పకుంటారు. మెట్లకు సంఖ్యాపరంగా కూడా ప్రధాన్యం ఉంది. శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వా, ఘ్రాణం ఇవి ఐదు జ్ఞానేదింద్రియాలు, వాక్, పాణి, ఉపస్త, పాల, పాయువులు కర్మేంద్రియాలు ఐదు, అన్నమయ, ప్రాణమయ, మనోమాయ, విజ్ఞాన మాయ, ఆనందమాయ ఈ ఐదు పంచకోశాలు, సత్యం, రజస్సు, తపస్సు ఈ మూడు త్రిగుణాలు ఇవన్ని కలిపితే 18 వీటనన్నింటిని అదుపులో ఉంచగలిగిన వారికే పరబ్రహ్మ సాక్షాత్కారం మోక్షస్థితి లభిస్తుంది.
శబరి యాత్ర
దీక్షను స్వీకరించి నియమాలతో గడిపిన భక్తులు శబరిమలై యాత్ర చేస్తారు. దీక్ష స్వామి సన్నిదాన దర్శనంతో ముగుస్తుంది. శబరిమల కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రిపర్వత శ్రేణుల ప్రాంతం కిందకు వస్తుంది. శబరిమలై యాత్ర ఎరుమెలితో మొదలవుతుంది. ఎరుమెలిలో వావరు స్వామిని భక్తులు దర్శించుకుంటారు. ఈ వావరు స్వామి ఒక ముస్లిం కులస్తుడు. ఇక్కడ మసీద్‌లోనే కొలువై ఉన్నాడు. వావరు స్వామి చుట్టు రకరకాల వేషాధారణలతో నాట్యం చేస్తారు. ఎరుమెలి వద్ద ఉన్న ధర్మశాస్త్ర ఆలయంలో వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. కన్నెమూల గణపతిగా పిలుస్తారు. ఇక్కడి నుండి పాదయాత్ర మొదలైవుతుంది. రెండు మార్గాలు ఉన్నాయి. పెద్ద పాదం అనేది కొండల మధ్య దట్టమైన ఆరణ్యంలో ఉన్న కాలిబాట. ఇది 80కిలోమీటర్ల దారి ఈ దారిలోనే పెరుర్‌తోడు, కాలైకట్టి అనే స్థలాలు ఉన్నాయి. అళదానది కూడా వస్తుంది. ఈ నదిలో స్నానాలు చేస్తారు. తరువాత యాత్రలో పంబా అనే గ్రామం ఉంటుంది. పంబానదిలో స్నానం చేసి ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేసి అయ్యప్ప వద్దకు చేరుకుంటారు. ఇరుముడి తలపై పెట్టుకొని నీలిమలై కొండ మార్గం ద్వారా అయ్యప్ప సన్నిధికి చేరుకుంటారు.
ఇరుముడి పరమ పవిత్రం
అయ్యప్ప భక్తులు శబరిమలై వెళ్లే ముందు ఇరుముడితో బయలు దేరుతారు. ఇరుముడిలో నేతితో నింపిన కొబ్బరికాయ, రెండు కొబ్బరి కాయలు, వక్కలు, తమల పాకులు, నాణాలు, పసుపు, గందం పొడి, విభూది, పన్నీరు. బియ్యం, అటుకులు, మరమరాలు, బెల్లం లేదా అరటిపండ్లు, కలకండ, అగరవత్తులు, కర్పూరం, మిర్యాలు, తెనే, ఎండు ద్రాక్ష, తువ్వాలలు పెట్టుకుంటారు. దీన్ని ఇరుముడిగా కట్టుకునే ఉత్సవాన్ని కెట్టు నీర లేదా పల్లికెట్టు అంటారు.