Share News

శ్రీకరం.. మనోహరం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:07 AM

సీతారాముల కల్యాణం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బుధవారం కన్నుల పండువగా జరిగింది. జిల్లాలోని వివిధ దేవాలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీకరం.. మనోహరం
కొండగట్టులో కళ్యాణం జరుపుతున్న అర్చకులు

కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

భక్తులతో పోటెత్తిన ఆలయాలు

పట్టువస్త్రాలు సమర్పించిన మున్సిపల్‌ చైర్మన్‌, కమిషనర్‌ దంపతులు

పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

జగిత్యాల టౌన్‌, ఏప్రిల్‌ 17: సీతారాముల కల్యాణం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బుధవారం కన్నుల పండువగా జరిగింది. జిల్లాలోని వివిధ దేవాలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో ఆలయాలు జనంతో పోటెత్తాయి. ఆలయాల్లో భక్తులకు అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్‌ క్యాంప్‌లోని కోదండ రామచంద్రస్వామి ఆలయంలో 45వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సీతారాముల విగ్రహాలను ఉంచి వేద పండితులు చంద్రశేఖర్‌ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా వివాహ వేడుకలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి మున్సిపల్‌ కమిషనర్‌ అనీల్‌ బాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉత్సవమూర్తులైన స్వామివారలను వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. 45వ బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకుని వీహెచ్‌పీ అధ్వర్యంలో 45 కిలోల లడ్డూను స్వామి వారలకు బహుకరించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అడువాల జ్యోతి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారి పల్లకి సేవలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కోలాటాలు వేస్తూ సందడి చేశారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఫ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో..

జగిత్యాలలోని విద్యానగర్‌ సీతారామాంజనేయస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్థానిక సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి సీతారామచంద్రుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. మహిళలు కోలాటాలతో, డప్పు చప్పుళ్లతో భారీ ఊరేగింపు నిర్వహించారు. అర్చకుడు సింహాచలం శ్రీనివాసా చార్య, రంజిత్‌ కుమారా చార్యల పర్యవేక్షణలో కిరణ్‌, భాను ఆచార్యలు కల్యాణ మహోత్సవం జరిపించారు. అనంతరం సీతాదేవికి ఒడి బియ్యం పోసి మహిళలు సాంప్రదాయం చాటుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్‌ ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు సమర్పించారు. చిన్నారులు వివిధ వేశాదారణలతో భక్తులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల కోర్టు న్యాయమూర్తులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మార్కండేయ ఆలయంలో...

జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయ ఆలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. మేళతాళాల మధ్య ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు తీసుకువచ్చారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అడువాల జ్యోతి లక్ష్మణ్‌ దంపతులతో పాటు పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు ఆకుబత్తిని శ్రీనివాస్‌ తదితరులతోపాటు ఆలయ కమిటీ సభ్యులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం వేదపండితులు విషు శర్మ, మేడిపల్లి శ్రీనివాస్‌శర్మ ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం సభ్యులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

ఫబంజరుదొడ్డి ఆంజనేయస్వామి ఆలయంలో...

పట్టణంలోని నిజామాబాద్‌ రోడ్డులో ఉన్న బంజరుదొడ్డి ఆంజనేయ స్వామి ఆలయంలో పెరంబుదూరు కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. మహిళలు సీతా దేవికి ఒడి బియ్యం సమర్పించారు. ఆంజనేయ మాలధారణ భక్తులు స్వామివారి ఊరేగింపు నిర్వహించగా, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే జిల్లా కేంద్రంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించారు. బ్రహ్మణవాడలోని శ్రీరామ మందిరం, హరిహర ఆలయం, అరవింద్‌నగర్‌లోని అభయాంజనేయస్వామి ఆలయం, పోచమ్మవాడలోని ఆంజనేయస్వామి ఆలయం, గోవిందు పల్లి, టవర్‌సర్కిల్‌లో ఉన్న శివాలయం, హరిహరాలయాల్లోతో పాటు అన్నివార్డుల్లో దేవాలయాల్లో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానంతో పాటు మినరల్‌ వాటర్‌, మజ్జిగ ప్యాకెటు అందజేశారు.

కొండగట్టులో వైభవంగా సీతారాముల కళ్యాణ ం

మల్యాల, ఏప్రిల్‌ 17: కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి సన్నిధిలో శ్రీరామ నవమి పురస్కరించుకోని బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణ ం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు, వేదపండితులు కళ్యాణంను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు అభిషేకాలు, పట్టువస్త్రాలంకరణ చేసి కళ్యాణంను నిర్వహించి హోమం చేశారు. ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో వైరాగ్యం అంజయ్య, స్థానాచార్యులు కపీంధర్‌, ప్రధానర్చకులు రామకృష్ణ, జితేంద్రప్రసాద్‌, రఘు, ఆలయ అధికారులు చంద్రశేఖర్‌, సునీల్‌, ఉమామహేశ్వర్‌రావు, సంపత్‌, దర్మెంధర్‌, రాజేంధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొనగా వందలాదిగా భక్తులు కళ్యాణంను తిలకించారు.

Updated Date - Apr 18 , 2024 | 12:07 AM