Share News

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దాలి

ABN , Publish Date - Jun 24 , 2024 | 01:07 AM

ధార్మిక క్షేత్రంగా వీరాజిల్లుతున్న వేములవాడను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సూచించారు.

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దాలి
వసతి గదుల నిర్మాణానికి స్థల పరిశీలన చేస్తున్న విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ టౌన్‌, జూన్‌ 23 : ధార్మిక క్షేత్రంగా వీరాజిల్లుతున్న వేములవాడను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సూచించారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఆలయ ఈవో రామకృష్ణ, సంబంధిత అధికారులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వేములవాడలో చేపట్టిన అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన పనులపై కలెక్టర్‌కు ప్రభుత్వ విప్‌ వివరించారు. అనంతరం ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాజరాజేశ్వరస్వామి ఆలయంతోపాటు వేములవాడ పట్టణ అభివృద్ధిని సమాంతరంగా చేపట్టాలన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడం, ఇబ్బందులు తలెత్తకుండా చూడడం వంటి అంశాలను ప్రధానంగా తీసుకోవాలన్నారు. కోడెల సంరక్షణకు గోశాల షెడ్ల నిర్మాణాన్ని అత్యాధునిక టెక్నాలజీతో చేపట్టాలన్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల మురుగు నీరు గుడి చెరువులో కలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మూలవాగులోకి వస్తున్న మురుగునీరు సైతం మళ్లించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అర్ధంతరంగా నిలిచిన బ్రిడ్జి, బద్దిపోచమ్మ ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. రాజన్న ఆలయ పార్కింగ్‌ స్థలంలో 100 గదులతో భక్తుల సౌకర్యార్థం వసతి గదుల నిర్మాణం చేపట్టాలన్నారు. మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనుల కోసం స్థల పరిశీలన చేయాలని, విస్తరణ పనులను ముందుకు సాగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించామని, రాజన్న ఆలయానికి రావాల్సిన రూ. 20 కోట్ల నిధులను తిరిగి తీసుకొచ్చామని అన్నారు. వాటితోపాటు రాజన్న ఆలయ అభివృద్ధితోపాటు పట్టణంలో కావాల్సిన అభివృద్ధి పనుల నివేదికను తయారు చేయాలని, వీటీడీఏ వైస్‌ చైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌ ద్వారా పంపించాలని సమావేశం నిర్వహించామన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్‌, కలెక్టర్‌

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి వచ్చిన ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సమావేశం అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వచనం, ఈవో రామకృష్ణ ప్రసాదాన్ని అందజేశారు.

అభివృద్ధి పనుల పరిశీలన

రాజన్న దర్శనం అనంతరం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా రాజన్న ఆలయ పార్కింగ్‌ స్థలంలో వసతి గదుల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. భక్తులు దర్శనం చేసుకునే క్యూలైన్‌లో తిరుగుతూ ఇబ్బందులను తెలుసుకున్నారు. స్వామివారి దర్శనం త్వరితగతిన అయ్యేందకు క్యూలైన్‌లను సుందరీకరించాలని, బ్రేక్‌ దర్శనం వెసులుబాటును అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గుడి చెరువు, మూలవాగులో కలిసే మురుగు కాలువను పరిశీలించారు. రెండో బైపాస్‌లోని మూలవాగును ఆనుకొని రోడ్డు పక్కన ఉన్న కూరగాయాల మార్కెట్‌ను క్షేత్రసాయిలో సందర్శించి ఆధునాతన 60 స్టాల్స్‌ నిర్మాణం చేపట్టాలని, రాజన్న ఆలయ గోశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రాజన్న ఆలయానికి వచ్చే గోవులకు సంరక్షణ కోసం సీసీతో ప్లోరింగ్‌ చేయించి అత్యాధునాతన షెడ్లను నిర్మాణం చేయాలని అన్నారు. ఆర్డీవో రాజేశ్వర్‌, ఈవో రామకృష్ణ, ఆలయ ఈఈ రాజేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌, తహసీల్దార్‌ మహేష్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Jun 24 , 2024 | 01:07 AM