Share News

నేటి నుంచి గ్రామాల్లో ‘ప్రత్యేక’ పాలన

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:57 AM

గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానున్నది.

నేటి నుంచి గ్రామాల్లో ‘ప్రత్యేక’ పాలన

కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 1: గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానున్నది. గ్రామ పంచాయతీల పాలకవర్గ పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ పాలన బాధ్యతలను జిల్లా, మండల స్థాయి అధికారులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాలో 313 గ్రామ పంచాయతీలు

జిల్లాలో 313 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో పెద్ద గ్రామ పంచాయతీలకు, మండల కేంద్ర పంచాయతీలకు జిల్లా స్థాయి అధికారులను, చిన్న గ్రామపంచాయతీలకు తహసీల్దార్లు, సూపరింటెండెంట్‌ స్థాయి అధికారులను నియమించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ఇసుక, గ్రానైట్‌, మట్టి, ఇతర సీనరేజీ ఆదాయ వనరులు, స్టాంపు డ్యూటీతో ఎక్కువగా ఆదాయం వచ్చే గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియమాకాల్లో జోరుగా పైరవీలు జరిగాయని విమర్శలు వస్తున్నాయి. ఆదాయం అధికంగా ఉన్న పంచాయతీల బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించారనే ప్రచారం జరుగుతోంది. శుక్రవారం వరకు ప్రత్యేకాధికారులను నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల ముందు వరకు ప్రత్యేక అధికారుల తుదిజాబితాను విడుదల చేయక పోవడం పైరవీల కోసమేనని పలువురు విమర్శిస్తున్నారు. గ్రామసర్పంచులు, ఇతర పాలకవర్గ పదవీకాలం ఈనెల 1తో ముగియడంతో ఇప్పటికే చాలా గ్రామాల్లో కార్యదర్శులు సర్పంచుల నుంచి పంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచులకు వీడ్కోలు సమావేశాలు ఏర్పాటు చేశారు.

పెండింగ్‌ బిల్లులపై ఆందోళన

సర్పంచులే గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాల కల్పన, వీధిదీపాల ఏర్పాటు, తెలంగాణకు హరితహారంలో పల్లెప్రగతి వనాలు, వైకుంఠదామాలు, క్రీడాప్రాంగణాల ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలను, పారిశుధ్య నిర్వహణ బాధ్యత చేపట్టారు. దీంతో రాష్ట్రం స్వచ్ఛతతోపాటు పలు రంగాల్లో రాష్ర్టానికి దేశస్థాయిలో గుర్తింపు వచ్చే అవార్డులు వచ్చాయి. సర్పంచులకు మాత్రం బిల్లులు చెల్లించక పోవడంతో పలువురు సర్పంచులు ఇబ్బందిపడ్డారు. ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతూ వేసారి కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరికొందరు సర్పంచులు ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. ప్రభుత్వం తమకు రావలసిన బిల్లులను వెంటనే చెల్లించాలని పలుమార్లు సర్పంచులు కోరినప్పటికీ వారికి బిల్లులు ఇవ్వలేదు. మరోవైపు 2020, 2021 సంవత్సరాల్లో కొవిడ్‌తో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేక పోయామని, తమ పదవీకాలాన్ని రెండేళ్లు పెంచాలని లేదా పర్సన్‌ ఇన్‌చార్జీలుగా తమకే బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. ఎన్నికలను నిర్వహించాలని, తమకు రావలసిన బిల్లులను వెంటనే ఇప్పించాలని రాష్ట్ర, జిల్లా సర్పంచుల సంఘాలతోపాటు సర్పంచులు కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే ఆలోచనలో భాగంగానే సర్పంచుల పదవీకాలం ముగిసిన వెంటనే ప్రత్యేకాధికారుల పాలనను అమలులోకి తెచ్చిందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

అసంపూర్తిగా అభివృద్ధి పనులు

గత నవంబరు 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి అంతకుముందు అర్ధాంతరంగా వదిలిపెట్టిన అభివృద్ధి పనులు ముందుకు సాగలేదు. సర్పంచుల పదవీకాలం ముగియనుండడంతో వారు సమస్యలపైగానీ, అభివృద్ధిపైకానీ పెద్దగా దృష్టిపెట్టక పోవడంతో అనేక గ్రామాల్లో ప్రజలు పలుసమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారుల పాలనలోనైనా తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పల్లె ప్రజలు ఆశిస్తుండగా, తమ పెండింగ్‌ బిల్లులను ఇవ్వాలని సర్పంచులు, కాంట్రాక్టర్లు కోరుతున్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:57 AM