Share News

శివారు ప్రాంతాలు, విలీన డివిజన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:03 AM

నగర శివారు ప్రాంతాలు, విలీన డివిజన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించి దశలవారీగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని నగర మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు.

శివారు ప్రాంతాలు, విలీన డివిజన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 15: నగర శివారు ప్రాంతాలు, విలీన డివిజన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించి దశలవారీగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని నగర మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు. శుక్రవారం నగరంలోని 1,10 డివిజన్లలో మేయర్‌ సునీల్‌రావు పర్యటించి దాదాపు రూ. 42 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఒకటి, పది డివిజన్లలో 30 లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను కార్పొరేటర్‌ కొలగాని శ్రీనివాస్‌తో, 12 లక్షల నిధులతో చేపట్టనున్న పనులను కాసర్ల ఆనంద్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మేయర్‌ సునీల్‌రావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలోని తీగలగుట్టపల్లి గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఇప్పటికే తీగలగుట్టపల్లి ప్రాంతంలోని అనేక సమస్యలను పరిష్కరించామని అన్నారు. విలీన డివిజన్లను సమాం తరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఐదు మాసాల్లోగా విలీన గ్రామాల డివిజన్లలో పూర్తిస్థాయిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అన్నారు. భవిష్యత్‌లో ఈ ప్రాంతాలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా తొలగిస్తామని అన్నారు. పెద్ద ఎత్తున నిధులు కేటాయించి నూతన మంచినీటి పైపులైను పనులు చేయడం జరుగుతుందని తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం లాంటి అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే స్ట్రీట్‌ లైట్ల సమస్యను పరిష్కరించి పలు కాలనీల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించామని అన్నారు. విలీన గ్రామాల డివిజన్లలో మౌలిక వసతులను మెరుగుపరిచి స్థానిక ప్రజల మెప్పు పొందుతామని అన్నారు. వేసవి ముగిసేలోగా టెండర్లు పూర్తై ప్రారంభం చేసిన అన్ని అభివృద్ధి పనులను పూర్తిచేసి వర్షకాలం వచ్చే వరకు ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తామని అన్నారు. గత వర్షాకాలంలో చాలా ప్రాంతాల్లో సమస్యలు తలెత్తినా కరీంనగర్‌లో మాత్రం ఎలాంటి సమస్యలు రాలేవన్నారు. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు దృష్టికి వస్తే వాటిని కూడా పరిష్క రిస్తామని అన్నారు. తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులు కూడా కొనసాగుతున్నాయని, వాటి పనులను కూడా త్వరలోనే పూర్తిచేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో రైల్వే ట్రాక్‌ వెంబడి కూడా పెద్ద డ్రైనేజీ నిర్మాణం చేస్తామని అన్నారు. కట్టరాంపూర్‌ ప్రాంతానికి కోట్ల రూపాయలను కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. రూ. 30 కోట్లతో గణేశ్‌నగర్‌ బైపాస్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టామని అన్నారు. కోతిరాంపూర్‌ నుంచి శ్రీగిద్దెపెరుమాండ్ల దేవాలయం వరకు స్మార్ట్‌సిటీ పనులు జరుగుతున్నాయని అన్నారు. మంచినీటి సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, ఆయా డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 12:03 AM