శంభో శివ శంభో
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:52 AM
బోళాశంకురుడి అనుగ్రహం పొందాలంటే భక్తితో శివలింగంపై చెంబు నీళ్లు అభిషేకిస్తే ఆదిదేవుడి అనుగ్రహం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
బోళాశంకురుడి అనుగ్రహం పొందాలంటే భక్తితో శివలింగంపై చెంబు నీళ్లు అభిషేకిస్తే ఆదిదేవుడి అనుగ్రహం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శివయ్యను అభిషేక ప్రియుడిగా కొలుస్తారు. అడిగినవారికి అడిగినంత ఇచ్చే బోళా శంకరుడు.. గరళాన్ని మింగి లోకాలకు అమృతాన్ని పంచిన నీలకంఠుడు పరమశివుడు. మాఘమాసం శుక్లపక్షం చతుర్ధశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఆ రోజు అర్ధరాత్రివేళను శివలింగోద్భవ కాలమని శాస్త్రం చెబుతోంది. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని మహదానందంగా జరుపుకోవడానికి రాజన్నసిరిసిల్ల జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం నుంచే బోలాశంకురుడి మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. దక్షిణకాశీగా పిలుచుకునే వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో జనజాతర మొదలకాగా జిల్లా కేంద్రంలోని పురాతన శివాలయాలతోపాటు మండలాల్లోని దేవాలయాల్లో శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు చేశారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం సాయంత్రం నుంచి వేడుకలు మొదలయ్యాయి. దేవస్థానం మైదానంలో శివార్చన కార్యక్రమాలతోపాటు రాత్రి తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమ్పపంచనున్నారు. రాత్రి 9 గంటల నుంచి నిశిపూజతోపాటు భక్తులకు లఘుదర్శనం, కోడెమొక్కులతో వేడుకల సందడి మొదలైంది. శుక్రవారం మహాశివరాత్రిని ఘనంగా జరుపుకోవడానికి భక్తకోటి సమాయత్తమైంది. వేములవాడలో ఉదయం 12 గంటల నుంచి 3 గంటల వరకు పురజనులకు సర్వదర్శనం, ఉదయం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు ఆలయశుద్ధి, మంగళవాయిద్యాలు, ఉదయం 4 గంటల నుంచి 4.25 వరకు సుప్రభాతం, 4.25 నుంచి 6 గంటల వరకు ప్రాతఃకాలపూజ, అనువంశిక అర్చకుల దర్శన కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 4 గంటలకు శివదీక్ష స్వాముల దర్శనం, సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారి కల్యాణ మండపంలో మహాలింగార్చన రాత్రి 11.35 నిమిషాలకు లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. జిల్లాలో ప్రజలందరూ హిందూ సంస్కృతీసంప్రదాయాల్లో అన్ని పండుగలు ఘనంగా జరుపుకుంటారు. రాత్రి సమయాల్లో జరుపుకునే ముఖ్య పండుగల్లో దీపావళి, శివరాత్రి మాత్రమే. శివరాత్రి పర్వదినాల్లో శివ దీక్ష పరుల్లో భక్తి ప్రవాహం పరవళ్లు తొక్కుతుంది. శివరాత్రి జాగరణ మానవ జీవితాలను కష్టాల నుంచి పరిహారం చేసి ముక్తి దాతగా వరాలు కురిపిస్తుందనే నమ్మకం. సప్త లోకాలకు ఆదిశక్తి పరాశక్తి అయిన పార్వతిదేవి, దుర్గగా, చండిగా, కాత్యాయినిగా, కాళీగా, సరస్వతిగా, త్రిపుర సుందరిగా వేర్వేరు రూపాలతో శక్తి ప్రభాసగా పూజలందుకుంటుంది. భక్త సులభుడు కనుకనే ఆ స్వామిని హృదయపు గుళ్లలోను బయట దేవాలయాల్లో ప్రతిష్టించుకున్నారు. విష్ణు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, మహా శివరాత్రి రోజు 18 పీఠాలలో మహా రుద్రాభి షేకాలు, పూజలు, దీక్షలు జరుగుతాయి. శివరాత్రి రోజు స్వామి లింగోద్భవుడై భక్తులను అనుగ్రహిస్తాడు. వేములవాడ, శ్రీకాళహస్తి, హన్మకొండ, ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, మహానంది, కీసరగుట్ట, ద్రాక్షారామం, భీమేశ్వరం, క్షీరారామం, కాళేశ్వరం వంటి అనేక శైవ క్షేత్రాల్లో శివనామం విన్నా దర్శించిన ముక్తి లభిస్తుందని భావిస్తారు. శివరాత్రి మహత్యం గురించి సంస్కృతంలో, తెలుగు కావ్యాలు ఎన్నో వచ్చాయి. కాల స్వారూపుడైన శివుడు వెలసిన దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకోని వారికి కాలదోషం కలుగుతుందని పెద్దలు భావిస్తారు.
గోగుపువ్వే శివరాత్రికి శ్రేష్ఠం
మంగళకరుడు... సకల శుభకరుడు... భోళాశంకరుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి. శివ భక్తులు ఉపవాస దీక్షతో శివుడిని కొలిచే క్రమంలో తెలంగాణలో ప్రధానంగా గోగుపువ్వును ఉపయోగించడం కనిపిస్తుంది. ఈసారి గోగుపువ్వు కనిపించడం లేదు. కొద్దిమేరకు ఉన్న గోగుపువ్వు మార్కెట్‌లో అఽధిక ధరలకు అమ్ముతున్నారు. రూ.10 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. గోగుపువ్వు లేకుండా గండదీపం ముట్టించరు. దీంతో ఎంత ధరైనా గోగుపువ్వు కొనుగోలు చేస్తున్నారు. మోదుగు చెట్టుకు పూసే పువ్వును ప్రత్యేకంగా ఉపయోగించడానికి గల నేపథ్యాన్ని పరిశీలిస్తే.. మహాశివరాత్రి రోజు పగలంతా ఉపవాసం, రాత్రి వేళ శివాభిషేకాలను, పూజలు, జాగరణ చేస్తారు. నాలుగు రకాలైన అభిషేకాలతో శివుడిని పూజిస్తారు. మొదటి జాములో శివుడిని పాలతో అభిషేకించి, పద్మాలతో పూజ చేస్తారు. రెండో జాములో పెరుగు, తులసీ దళాలతో, మూడో జాములో నెయ్యితో, మారేడు దళంతో, నాలుగో జాములో తేనెతో, పాలశపుష్పములతో పూజిస్తారు. అయితే శివుడిని పూజించే వారు సకల సౌఖ్యాలతో పుణ్య ఫలాలను పొందుతారని నమ్మకం. ఇందులో శివుడు తనను పూజించే భక్తులు సువాసన వెదజల్లని పాలశ పుష్పాలనే కోరాడని, భక్తులు శివరాత్రి పర్వదినాల్లో లభించే తొలి పుష్పాల్లో కేవలం సువాసన వెదజల్లని మోదుగుపూలు (గోగుపూలు) గుర్తించి శివుడికి పూజించారని పండితులు చెబుతున్నారు.