Share News

స్వశక్తి మహిళలకు ఊరట

ABN , Publish Date - Mar 24 , 2024 | 01:07 AM

స్వశక్తి సంఘాల మహిళలకు ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో మూడేళ్లుగా వడ్డీలేని రుణాలపై ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులు పెండింగులో ఉన్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నాలుగు మాసాలకు సంబంధించిన వడ్డీ సొమ్మును విడుదల చేయడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్వశక్తి మహిళలకు ఊరట

- నాలుగు మాసాల వడ్డీ డబ్బులు విడుదల

- 7554 సంఘాలకు రూ.6.07 కోట్లు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

స్వశక్తి సంఘాల మహిళలకు ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో మూడేళ్లుగా వడ్డీలేని రుణాలపై ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులు పెండింగులో ఉన్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నాలుగు మాసాలకు సంబంధించిన వడ్డీ సొమ్మును విడుదల చేయడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోగల 7,554 స్వశక్తి సంఘాల మహిళలకు 6 కోట్ల 6 లక్షల 99 వేల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా పెండింగులో 68 కోట్ల 66లక్షల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది. ఈనెల రెండవ వారంలో సీఎం రేవంత్‌రెడ్డి స్వశక్తి సంఘాల మహిళా సదస్సును సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలను కోటీశ్వరులను చేస్తామని, కోటి రూపాయల వరకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. పెండింగులో ఉన్న వడ్డీ లేని రుణాల డబ్బులను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. ఆ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన డిసెంబర్‌ నుంచి మార్చి నెల వరకు నాలుగు మాసాల వడ్డీ సొమ్మును విడుదల చేసింది. ఆ డబ్బులు మహిళా సంఘాల ఖాతాల్లో టి సెర్ప్‌ విభాగం అధికారులు జమచేస్తున్నారు.

జిల్లాలో 11,383 సంఘాలు ఉండగా, వీటి పరిధిలో 1,19,088 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. తమ కాళ్లపై తాము నిలబడేందుకు 10 నుంచి 15 మంది సభ్యులు కలిసి సంఘంగా ఏర్పాటు చేసుకున్నారు. నెలకు 100 నుంచి 200 రూపాయల వరకు బ్యాంకులో పొదుపు చేస్తున్నారు. పొదుపు చేసిన సొమ్మును తమ అవసరాల కోసం వాడుకుంటారు. రెండేళ్లు క్రమం తప్పకుండా పొదుపు చేసే సంఘాలకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా లింకేజీ రుణాలను ఇప్పిస్తున్నది. 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు బ్యాంకు అధికారులు మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నారు. ఆ సొమ్ముతో కొన్ని సంఘాలకు చెందిన మహిళలు మూకుమ్మడిగా చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోగా, అత్యధిక మంది రుణంగా వచ్చిన సొమ్మును సమానంగా పంపిణీ చేసుకుని స్వయం ఉపాధి పనులు చేసుకుంటున్నారు. ఈ రుణాలను పావలా వడ్డీకే ఇవ్వగా, 2013 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జీరో వడ్డీకే రుణాలు ఇవ్వడం ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వం సంఘాలను నిర్వీర్యం చేసింది. సకాలంలో సంఘాలకు వడ్డీ సొమ్ము విడుదల చేయలేదు. మహిళా సంఘాలే నెలనెలా వడ్డీ సొమ్మును చెల్లించి ప్రభుత్వం విడుదల చేసే సొమ్ము కోసం ఎదురుచూస్తూ వచ్చారు. జిల్లాలో ఉన్న సంఘాలకు గడిచిన మూడేళ్లకు సంబంధించి 2023 మార్చి వరకు 65 కోట్ల 51 లక్షల రూపాయలు వడ్డీ రుణాల సొమ్ము మహిళకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. గత ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 9393 మహిళా సంఘాల ఖాతాల్లో 15కోట్ల 99లక్షల 58 వేల రూపాయలు విడుదల చేసింది. ఇందులో 2018-19 సంవత్సరంలో 9124 సంఘాలకు 4 కోట్ల 34 లక్షల 69 వేల రూపాయలు, 2019-20 సంవత్సరంలో 9064 సంఘాలకు 11 కోట్ల 64 లక్షల 89 రూపాయలు మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేశారు. ఈ రెండేళ్లకు సంబంధించి ఇంకా 3 కోట్ల 15 లక్షలు, అన్ని కలిపి 68 కోట్ల 66 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలపై మహిళలు చెల్లించిన సొమ్మును ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుతం నాలుగు మాసాలకు సంబంధించిన సొమ్ము విడుదల చేయగా, పెండింగులో ఉన్న సొమ్మును కూడా విడుదల చేయాలని మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - Mar 24 , 2024 | 01:07 AM