Share News

భారీగా నగదు, మద్యం పట్టివేత

ABN , Publish Date - May 16 , 2024 | 12:14 AM

పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో కమిషనరేట్‌ వ్యాప్తంగా పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించి భారీగా నగదు, మద్యం, వెండి, ఇతర వస్తువులు పట్టుకున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన మార్చి 16 నుంచి తనిఖీల్లో సరైన ఆధారాలు చూపించని వ్యక్తుల వద్ద 8.96 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

భారీగా నగదు, మద్యం పట్టివేత

కరీంనగర్‌ క్రైం, మే 15: పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో కమిషనరేట్‌ వ్యాప్తంగా పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించి భారీగా నగదు, మద్యం, వెండి, ఇతర వస్తువులు పట్టుకున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన మార్చి 16 నుంచి తనిఖీల్లో సరైన ఆధారాలు చూపించని వ్యక్తుల వద్ద 8.96 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో తగిన రశౠదులు చూపిన వారికి 1.02 కోట్ల రూపాయలు తిరిగి అప్పగించారు. మిగతా డబ్బులు సంబంధిత ఎన్నికల విభాగం అధికారులకు స్వాధీనం చేశారు. పోలీసులు, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాల తనిఖీల్లో 1,609 లీటర్ల మద్యం పట్టుకుని, 216 కేసులు నమోదు చేశారు. ఈ మద్యం విలువ 11,27,775 రూపాయలుంటుంది. 1,09,550 రూపాయల విలువ కలిగిన 4.86 కిలోల గంజాయిని పట్టుకుని ఏడు కేసులు నమోదు చేశారు. మూడు లక్షల విలువైన నాలుగు కిలోల వెండి ఆభరణాలు, ఐదు లక్షల విలువైన చీరలు, ఇతర కానుకలు పట్టుకున్నారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా ఉన్న 89 లైసెన్స్‌డ్‌ ఆయుధాలను పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధాగారంలో డిపాజిట్‌ చేయించారు. 611 కేసులలో 1,874 మంది పాత నేరస్థులను బైండోవర్‌ చేశారు. బైండోవర్‌ నిబంధనలు ఉల్లంఘించిన నలుగరు వ్యక్తులకు జరిమానా విధించారు. బెల్ట్‌షాపులను మూయించివేశారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కింద నిబంధనలు ఉల్లంఘించినవారిపై 25 కేసులు నమోదు చేశారు. సైదాపూర్‌, హుజురాబాద్‌లో 2,130 కిలోల గన్‌పౌడర్‌, 10 డిటోనేటర్లు, 200 జిలెటిన్‌స్టిక్స్‌ను పట్టుకుని రెండు కేసులు నమోదు చేశారు.

ఫ ప్రశాంతంగా ఎన్నికలు

కమిషనరేట్‌ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పటిష్టమైన భద్రత చర్యలతో పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కమిషనరేట్‌ వ్యాప్తంగా ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా సీపీ అభిషేక్‌ మొహంతి ప్రత్యేక ప్రణాళికతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలోని సిబ్బందికి సూచనలు, ఆదేశాలు జారీ చేస్తూ శాంతిభద్రత సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. గొడవలు, అల్లర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఎన్నికల కేసుల్లో ఉన్న పాత నేరస్థులు, హిస్టరీ, రౌడీ షీటర్లను ముందుగానే పోలీస్‌ స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్‌ అనంతరం తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌ చేశారు. . ఈవీఎంలను భద్రపరిచిన ఎస్సారార్‌ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్‌రూం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి, రౌండ్‌ ద క్లాక్‌ సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్‌రూం పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. స్ట్రాంగ్‌రూంను ప్రతి రోజు కలెక్టర్‌, సీపీ పరిశీలిస్తున్నారు.

Updated Date - May 16 , 2024 | 12:14 AM