Share News

క్రమబద్ధీకరణ పేరిట కబ్జాల దందా..

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:08 AM

గోదావరిఖని నడిబొడ్డున, రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా కబ్జా చేశారు. ఇండ్లు లేకున్నా ఇంటి నంబర్లు సృష్టించి, జీవో నంబరు 76లో క్రమబద్ధీకరించుకుని ఆక్రమణలకు దిగుతున్నారు.

క్రమబద్ధీకరణ పేరిట కబ్జాల దందా..
ఇల్లు లేకుండానే పట్టా పొందిన స్థలం

జీవో నంబరు 76 పేరిట ఇళ్లు లేకుండానే క్రమబద్ధీకరణలు

ఖాళీ స్థలాలకు పట్టాలు ఇచ్చిన రామగుండం తహసీల్దార్‌

రద్దు చేయాలంటున్న ప్రశాంత్‌నగర్‌ వాసులు

కోల్‌సిటీ, జనవరి 7: గోదావరిఖని నడిబొడ్డున, రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా కబ్జా చేశారు. ఇండ్లు లేకున్నా ఇంటి నంబర్లు సృష్టించి, జీవో నంబరు 76లో క్రమబద్ధీకరించుకుని ఆక్రమణలకు దిగుతున్నారు. రామగుండం నగరపాలక సంస్థ అధికారులు కబ్జాదారులతో చేతులు కలిపి ఇల్లు లేకున్నా ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇస్తే పరిశీలన జరిపి పట్టాలు చేయాల్సిన రామగుండం రెవెన్యూ అధికారులు మిలాఖత్‌ అయి నేరుగా క్రమబద్ధీకరణకు సిఫార్సు చేయడమే కాకుండా రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలకు వెళ్లి కన్వేయన్స్‌ డీడ్‌లు చేశారు. రాజీవ్‌ రహదారి పక్కన ఉన్న స్థలం దర్జాగా కబ్జా అవుతుంటే ప్రజలు ఎదురుతిరిగారు. పట్టాలు రద్దు చేయాలంటూ కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరిఖని పట్టణం 5వ డివిజన్‌లోగల ప్రశాంత్‌నగర్‌ సింగరేణి ప్రభావిత, పునరావాస కాలనీ. 40ఏళ్ల క్రితం వెంకట్రావ్‌పల్లి, వీర్లపల్లి గ్రామాలకు చెందిన కుటుంబాలను ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు కోసం ఖాళీ చేయించారు. వారికి గోదావరిఖని పీజీ కళాశాల పక్కన మల్కాపూర్‌ శివారు సర్వే నంబరు 85లో ఇళ్ల నిర్మాణానికి సింగరేణి పట్టాలు ఇచ్చింది. రాజీవ్‌ రహదారి పక్కన కొంత స్థలంలో దేవాలయం నిర్మించగా సుమారు పది గుంటల స్థలాన్ని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ అవసరాలకు ఖాళీగా ఉంచారు. ఆ స్థలంలో కార్మిక సంఘాలకు చెందిన జెండాలు, చిరు వ్యాపారులు టేలాలు వేసుకుని ఉంటున్నారు. ప్రభుత్వం 2018లో సింగరేణి ప్రాంతంలోని స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం సింగరేణి పరిధిలోని గోదావరిఖని, యైుటింక్లయిన్‌కాలనీ ప్రాంతాల్లోని స్థలాలను రెవెన్యూ శాఖకు బదిలీ చేసింది. మల్కాపూర్‌ శివారు సర్వే నంబరు 85లో సింగరేణికి 5.39 ఎకరాల భూమి ఉండగా 4.18 ఎకరాలను క్రమబద్ధీకరణకు రెవెన్యూ శాఖకు అప్పగించింది. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన వారు, ఇతరులు పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వం సర్వేచేసింది. దీనిని కొనసాగింపుగా 2022లో జీవో నంబరు 76 జారీ చేశారు. మొదట 2014లో నిర్మాణాలనే క్రమద్ధీకరణ చేస్తామన్న ప్రభుత్వం తరువాత కట్‌ ఆఫ్‌ డేట్‌ను జూన్‌ 2020కు పొడిగించింది. ఈ ఖాళీ స్థలం ఒక ట్రేడ్‌ యూనియన్‌ పరిధిలో ఉందని కొన్ని బేరసారాలు కూడా జరిగినట్టు ప్రచారం జరిగింది.

ఫ ఖాళీ స్థలంపై కన్ను..

ఈ ఖాళీ స్థలంపై కన్నేసిన కొందరు రామగుండం నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది సహకారంతో ఖాళీ స్థలానికి ఇంటి నంబర్లు పొందారు. ఇ.నెం. 6-1-83/128/1 పేర రశీదులతో పట్టా కోసం సర్వే నంబరు85ను సూచిస్తూ 444చదరపు గజాలు తమ ఆధీనంలో ఉందని, ఇందులో 300చదరపు అడుగుల్లో రేకుల షెడ్డు ఉందంటూ ఇతర ప్రాంతాలకు చెందిన ఒక ఇంటి ఫోటో, మున్సిపల్‌ రశీదుతో పట్టాకు దరఖాస్తు చేసుకున్నారు. పట్టాలు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక టీముతో సర్వే చేయించింది. దీనికి హద్దులుగా దక్షిణానికి రాజీవ్‌ రహదారి, ఉత్తరం, తూర్పు, పడమర రహదారులుగా చూపారు. 25ఏళ్లుగా ఇల్లు ఉన్నట్టు పేర్కొన్నారు. ఎలాంటి నిర్మాణం లేకున్నా ఖాళీ స్థలానికి రెవెన్యూ బృందం పట్టాకు సిఫార్సు చేసింది. మే 20, 2023న అప్పటి రామగుండం తహసీల్దార్‌ జీవో నంబరు 76 కింద చిలుముల రవికుమార్‌ పేర ఇ.నెం.6-1-83/128/1 పేర మల్కాపూర్‌ శివారు సర్వే నంబరు 85లో 444చదరపు గజాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరిస్తూ కన్వేయన్స్‌ డీడ్‌ డాక్యుమెంట్‌ నంబరు 1272/2023 ద్వారా జారీ చేశారు. ఇందుకు రూ.11,100లను లబ్ధిదారుడు చెల్లించినట్టు ఈ డీడ్‌లో పేర్కొన్నారు. మే 20న కన్వేయన్స్‌ డీడ్‌ జారీ అయితే నాలుగు నెలల తరువాత చిలుముల రవికుమార్‌ నుంచి ఈ స్థలం, ఇంటిని రూ.53.31లక్షల మార్కెట్‌ విలువపై ఒక మహిళకు విక్రయించినట్టు సేల్‌ డీడ్‌ ఉంది. అంతేకాకుండా నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇ.నెం.6-1-83/128/1/ఏ/1 కింద మ్యుటేషన్‌ అయ్యింది. ఈ ఖాళీ స్థలంలో నిర్మాణాలకు ప్రయత్నించడంతో అసలు గొడవ మొదలైంది. మొదట ఒక ట్రేడ్‌ యూనియన్‌ పేర నిర్మాణం జరిపేందుకు ప్రయత్నించగా కాలనీవాసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో జీవో నంబరు 76 కింద జారీచేసిన పట్టాలు, సేల్‌ డీడ్‌లు ముందుకు వచ్చాయి. పోలీస్‌ స్టేషన్‌లలో సైతం ఫిర్యాదు చేసుకున్నారు. ప్రశాంత్‌నగర్‌ వాసులు దీనిపై ఆందోళనకు దిగారు. ఈ ఇంటి నంబరు 6-1-83/128/1/ఏ/1ను రద్దు చేయాలంటూ రేండ్ల కనకయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరపాలక సంస్థ కమిషనర్‌ విచారణ జరిపించారు. నగరపాలక సంస్థ మ్యుటేషన్‌ చేసిన ప్రాంతంలో అసలు నిర్మాణమే లేదు కనుక దీనిని రద్దు చేస్తూ నగరపాలక కమిషనర్‌ నాగేశ్వర్‌ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పట్టాలు కూడా రద్దు చేయాలంటూ కాలనీవాసులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఫ మరిన్ని ఖాళీ స్థలాలకు పట్టాలు..

జీవో నంబరు 76ను అడ్డుపెట్టుకుని రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ప్రధాన రహదారుల పక్కన సింగరేణి సంస్థ రెవెన్యూకు అప్పగించిన ఖాళీ స్థలాలకు అప్పటి తహసీల్దార్‌ పట్టాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే గోదావరిఖని ఉదయ్‌నగర్‌లో కూడా వివాదం సాగుతోంది. మరో మూడు చోట్ల ఇలా పట్టాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. రామగుండం నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న ఒక అధికారి, రామగుండం తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు, ఇద్దరు కింది స్థాయి అధికారులు ఈ దందాలో భాగస్వామ్యులైనట్టు తెలుస్తోంది. రామగుండం నగర పాలక సంస్థ రెవెన్యూ అధికారి ఒకరు ఈ కుంభకోణంలో సూత్రదారిగా వ్యవహరించినట్టు ఆరోపణలున్నాయి. సింగరేణి స్థలాల్లో జీవో నంబరు 76 ద్వారా క్రమబద్ధీకరణకు ప్రజలు పెద్దఎత్తున దరఖాస్తులు చేశారు. చాలా సర్వే నంబర్లలో నిర్మాణాలు ఉన్న స్థలాల్లో పది శాతం కూడా సింగరేణి రెవెన్యూకు అప్పగించలేదు. అప్పగించిన స్థలాల్లో అసలు నిర్మాణాలకు పట్టాలు ఇవ్వకుండా కబ్జాదారులతో కుమ్మక్కై కేవలం ఖాళీస్థలాలకు పట్టాలు ఇవ్వడం, కోట్ల రూపాయల విలువైన భూముల కబ్జాకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఫిర్యాదులు రావడంతో ఇంటి నంబర్‌ రద్దు చేశాం...

- నాగేశ్వర్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌

రామగుండం నగరపాలక సంస్థ ప్రశాంత్‌నగర్‌లోని ఇ.నెం.6-1-83/128/1/ఏ/1 ఇంటి నంబర్‌పై ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ జరిపించగా అక్కడ ఇల్లు లేదని తేలడంతో రద్దు చేశాం. ఈ నంబర్‌ జారీలో ప్రమేయంపై విచారణ జరపాల్సి ఉంది.

Updated Date - Jan 08 , 2024 | 01:08 AM