Share News

అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి

ABN , Publish Date - May 08 , 2024 | 12:13 AM

తాను చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించి ఎంపీగా గెలిపించాలని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ కోరారు. మంగళవారం నగరంలోని భాగ్యనగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం డివిజన్‌ ప్రముఖులు, ముఖ్యనాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వినోద్‌కుమార్‌ మాట్లాడారు.

అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి

కరీంనగర్‌ టౌన్‌, మే 7: తాను చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించి ఎంపీగా గెలిపించాలని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ కోరారు. మంగళవారం నగరంలోని భాగ్యనగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం డివిజన్‌ ప్రముఖులు, ముఖ్యనాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వినోద్‌కుమార్‌ మాట్లాడారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గంగుల కమలాకర్‌ చేతిలో ఓటమిపాలైన బండి సంజయ్‌కుమార్‌ 2019లో ఎంపీగా పోటీచేసి సానుభూతి, మత విద్వేషాలను రెచ్చగొట్టి గెలిచారని విమర్శించారు. ఐదేళ్ళు ఎంపీగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. తాను మంజూరీ చేయించిన జాతీయ రహదారులను అతడే తీసుకువచ్చానని చెప్పుకుంటున్నాడని విమర్శించారు. కనీసం జడ్పీ, మండల, మున్సిపల్‌ సమావేశాలకు కూడా హాజరుకాలేదన్నారు. అసెంబ్లీకి పోటీ చేసి ఓడి పోయి మళ్లీ ఎంపీగా పోటీ చేస్తున్నాడని తెలిపారు. ప్రజాసమస్యలు పట్టించుకోకుండా, అభివృద్ధికి ఎలాంటి నిధులు తేకుండా సానుభూతి, దేవుడి పేరు చెప్పి గెలువాలనుకుంటున్న సంజయ్‌కి ఓట్లుఅడిగే హక్కు లేదన్నారు. ప్రచారానికి వచ్చే ఆయనను ఈ విషయంపై నిలదీసి అడుగాలని కోరారు. మరోసారి తనను గెలిపిస్తే సింగాపూర్‌ తరహాలో కరీంనగర్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను తీసుకువచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ట్రిపుల్‌ ఐటీ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ ప్రదాత వినోద్‌కుమార్‌ను మళ్లీ ఎంపీగా గెలిపించాలని కోరారు. ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నా పార్లమెంట్‌లో గళమెత్తి నిధులు తెస్తారన్నారు. ఎంపీగా వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేగా తాను జోడెద్దుల్లా పని చేసి కరీంనగర్‌లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ టి భానుప్రసాద్‌రావు, మేయర్‌ యాదగిరి సునీల్‌రావు. కార్పొరేటర్లు, వంగపల్లి రాజేందర్‌రావు, దిండిగాల మహేశ్‌, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, సీహెచ్‌ అజిత్‌రావు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 12:13 AM