Share News

రేపు కమిషనరేట్‌ వ్యాప్తంగా 144 సెక్షన్‌

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:24 AM

లోకసభ ఎన్నికల లెక్కింపు జూన్‌ 4వ తేదీ మంగళవారం జరగనున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కమిషనరేట్‌ వ్యాప్తంగా 144 సెక్షన్‌ ఆఫ్‌ సీఆర్‌పీసీ అమలు చేస్తూ సీపీ అభిషేక్‌ మొహంతి ఆదివారంు ఉత్తర్వులు జారీచేశారు.

రేపు  కమిషనరేట్‌ వ్యాప్తంగా 144 సెక్షన్‌

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 2: లోకసభ ఎన్నికల లెక్కింపు జూన్‌ 4వ తేదీ మంగళవారం జరగనున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కమిషనరేట్‌ వ్యాప్తంగా 144 సెక్షన్‌ ఆఫ్‌ సీఆర్‌పీసీ అమలు చేస్తూ సీపీ అభిషేక్‌ మొహంతి ఆదివారంు ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు జూన్‌ 4వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 5వ తేది బుధవారం ఉదయం 6 గంటల వరకు ఉంటాయని తెలిపారు. రీ-కౌంటిగ్‌ జరిగితే అది ముగిసేవరకు అమలులో ఉంటాయని చెప్పారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఐదుగురికి మించి గుమికూడరాదని తెలిపారు. ఏదైనా చట్టపరిధిలోని కారణంచేత సమావేశం కావాల్సిన అవసరం ఏర్పడితే ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. 144 సెక్షన్‌ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు,

ఫ కౌటింగ్‌ సందర్భంగా దారి మళ్లింపు

ఓట్ల లెక్కింపు సందర్భంగా జూన్‌ 4న కరీంనగర్‌లో దారి మల్లింపు చర్యలు చేపట్టామని సీపీ అభిషేక్‌ మొహంతి ఒక ప్రకటలో తెలిపారు. ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్కింపు నిర్వహిస్తారన్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్‌ ముగిసే వరకు ఎస్సారార్‌ కళాశాల రోడ్డుపై నుంచి ఎటువంటి వాహనాలను అనుమతించబోమని తెలిపారు. జగిత్యాల నుంచి కరీంనగర్‌ వచ్చే వాహనాలు రేకుర్తి చౌరస్తా నుంచి శాతవాహన యూనివర్సిటీ, పద్మ నగర్‌ మీదుగా రావాలన్నారు. కరీంనగర్‌ నుంచి జగిత్యాలకు వెళ్లవలసిన వాహనాలు కోర్ట్‌ కాంప్లెక్స్‌ దాటగానే జ్యోతినగర్‌, కెమిస్ట్‌ భవన్‌, శాతవాహన యూనివర్సిటీ, రేకుర్తి చౌరస్తా వద్ద జగిత్యాల రోడ్‌ వైపు వెళ్లాలని సూచించారు. బ్యాంక్‌కాలనీలో డీ మార్ట్‌ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు బ్యాంక్‌కాలనీ రోడ్డు నంబర్‌ 1 మీదుగా స్పెన్సర్స్‌ వద్ద నుంచి నగరంలోకి వెళ్లాలని సూచించారు. స్పెన్సర్‌ నుంచి ఆర్టీసీ వర్కషాప్‌, డీ మార్ట్‌ వరకు స్టెరైల్‌ జోన్‌గా నిర్ణయించామన్నారు. ఈ ప్రాంతంలో ఎటువంటి వాహనాలు తిరగడానికి అనుమతి లేదని సీపీ తెలిపారు. దారి మళ్లింపు విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.

Updated Date - Jun 03 , 2024 | 12:24 AM