ప్రచారానికి తెర.. ప్రలోభాల ఎర
ABN , Publish Date - May 12 , 2024 | 01:44 AM
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఓటర్లు స్తబ్ధంగా ఉండడంతో వారి నాడీ అంతు చిక్కడం లేదు. వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు పలువురు అభ్యర్థులు ప్రలోభాలతో ఎర వేస్తున్నట్లు తెలుస్తున్నది. ట్రెండ్ ఎక్కడ ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు అభ్యర్థులు, పార్టీల నాయకులతో తెలుసుకుంటూ అప్రమత్తం అవుతున్నారు.

- అంతు చిక్కని ఓటరు నాడీ
- ట్రెండ్ గురించి పార్టీ నేతలతో అభ్యర్థుల ఆరా
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఓటర్లు స్తబ్ధంగా ఉండడంతో వారి నాడీ అంతు చిక్కడం లేదు. వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు పలువురు అభ్యర్థులు ప్రలోభాలతో ఎర వేస్తున్నట్లు తెలుస్తున్నది. ట్రెండ్ ఎక్కడ ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు అభ్యర్థులు, పార్టీల నాయకులతో తెలుసుకుంటూ అప్రమత్తం అవుతున్నారు. ఈ నెల 13వ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానున్నది. పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుండగా, మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనున్నది. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, మంథని నియోజకవర్గాలు సమస్యాత్మక నియోజకవర్గాలు కావడంతో అక్కడ పోలింగ్ సమయాన్ని తగ్గించారు. మిగతా నియోజకవర్గాల్లో ఎండలు దంచి కొడుతుండడంతో అదనంగా ఒక గంట సమయాన్ని ఆరు గంటల వరకు పెంచారు. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ గొమాసే తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. తమ పార్టీలు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించడంతో పాటు తాము గెలిస్తే ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నారు. పార్టీల నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉన్నంత జోష్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కనబడలేదు. ఓటర్లు కూడా స్తబ్ధంగా ఉన్నారు. అభ్యర్థులు, పార్టీల నాయకులతో ఎప్పటికప్పుడు గెలుపోటముల గురించి చర్చిస్తూ ఉన్నారు. ఎక్కడ బలంగా ఉన్నాం, ఎక్కడ బలహీనంగా ఉన్నామనే విషయమై ఆరా తీస్తు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. బలహీనంగా ఉన్న చోట పోల్ మేనేజ్‌మెంట్‌తో పాటు మద్యం పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. బూత్ స్థాయిలో బలంగా ప్రచారం చేసేందుకు క్యాడర్‌ను అప్రమత్తం చేస్తున్నారు. ప్రలోభాలను అరికట్టేందుకు అధికారులు ఒకవైపు పోలింగ్ ఏర్పాట్లు చేస్తుండడంతో పాటు పార్టీల అభ్యర్థులపై నిఘా పెట్టారు.
ఓటు వేసేందుకు ప్రత్యామ్నాయంగా 12 గుర్తింపు కార్డులు
- కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) లేకుంటే 12 రకాల ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపెట్టి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్ కల్పించిందని పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎపిక్ కార్డు లేని వాళ్లు ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన పాస్ పుస్తకాలు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డైవ్రింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఎన్‌పీఆర్ కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు, పాస్‌పోర్ట్, ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పీఎస్‌యూలు, పబ్లిక్ లిమిటెడ్ సంస్థల ఉద్యోగులకు ఫొటోతో జారీ చేసిన ఐడీ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన ఐడీ కార్డు, ప్రత్యేక వైకల్యం ఐడీ కార్డు (యుడీఐడీ)లలో ఏదో ఒకదానితో ఓటు వేయవచ్చని తెలిపారు. అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును ఎన్ని పనులు ఉన్నా పోలింగ్ రోజు మే 13న సమయం కేటాయించి తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.