Share News

ఎన్నికల వేళ రైతురాగం

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:14 AM

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయపక్షాలు రైతు రాగం వినిపిస్తున్నాయి. ఎండలు మండిపోతూ జలవనరులన్నీ అడుగంటుతున్నాయి. మెట్టప్రాంతాల్లో పంటలకు సాగునీటి కొరత తీవ్రంగా ఉంది. ఐదెకరాల రైతులకు కూడా రైతుబంధు అందకపోవడం, రెండు లక్షల రుణ మాఫీ, అకాలవర్షాలతో నష్టపోయిన పంటకు ఇంకా పరిహారం రాక పోవడాన్ని రాజకీయపక్షాలు తమ అస్త్రాలుగా అందిపుచ్చుకొని అధికార పక్షంపై సంధిస్తున్నాయి.

ఎన్నికల వేళ రైతురాగం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయపక్షాలు రైతు రాగం వినిపిస్తున్నాయి. ఎండలు మండిపోతూ జలవనరులన్నీ అడుగంటుతున్నాయి. మెట్టప్రాంతాల్లో పంటలకు సాగునీటి కొరత తీవ్రంగా ఉంది. ఐదెకరాల రైతులకు కూడా రైతుబంధు అందకపోవడం, రెండు లక్షల రుణ మాఫీ, అకాలవర్షాలతో నష్టపోయిన పంటకు ఇంకా పరిహారం రాక పోవడాన్ని రాజకీయపక్షాలు తమ అస్త్రాలుగా అందిపుచ్చుకొని అధికార పక్షంపై సంధిస్తున్నాయి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు... కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ పొలంబాట పట్టారు. పంట పొలాలకు సాగునీరు అందకుండా పోవడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించని ప్రభుత్వ తీరే కారణమని బీజేపీ ఆరోపిస్తున్నది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ రైతుల సమస్యలపై రైతు దీక్ష చేపట్టగా కేసీఆర్‌ ఈనెల 5న జిల్లాలో పొలం బాట కార్యక్రమానికి హాజరుకానున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలతో రైతుల సమస్యలు తెరపైకి వచ్చి చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. జిల్లాలో నెలకొన్న రైతుల సమస్యలపై కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ రైతు దీక్ష చేపట్టాలని నిర్ణయించగా ఎన్నికల కోడ్‌ కారణంగా అందుకు నిరాకరించారు. దీంతో ఆయన తన పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యాలయంలో రైతు దీక్ష చేపట్టగా జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి జిల్లా పరిధి నుంచి పలువురు రైతులు, రైతు నాయకులు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. అకాలవర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని, రైతుబంధు సహాయం ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమకాలేదని, రెండు లక్షల రూపాయల రుణ మాఫీని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట తప్పి అమలునుంచి తప్పించుకుంటున్నదని బండి సంజయ్‌కుమార్‌ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై పెద్ద ఎత్తున సబ్సిడి ఇవ్వడమే కాకుండా 6,350 కోట్లు వెచ్చించి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తిరిగి తెరిపించిందని సంజయ్‌ రైతుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించారు. రైతులు ఏమి కోరుకుంటున్నారో చెబితే రానున్న లోక్‌సభ ఎన్నికల మెనిఫెస్టోలో ఆ అంశాలను పొందుపరుస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు.

ఫ రైతులను పరామర్శించనున్న మాజీ సీఎం కేసీఆర్‌

బీజేపీ ఇలా రైతురాగాన్ని ఆలాపిస్తుంటే అధికారం కోల్పోయి విపక్షంలో నిలిచిన బీఆర్‌ఎస్‌ కూడా అదే రాగాన్ని అందుకుంటున్నది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పొలంబాట కార్యక్రమానికి సూర్యాపేట, జనగాం, పర్యటనతో శ్రీకారం చుట్టి రెండో పర్యటనగా కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈనెల 5న పర్యటించాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలోని చర్లబూత్కూర్‌, గంగాధర, రామడుగు ప్రాంతాల్లో సాగునీరందక ఎండిన పంట పొలాలను సందర్శించాలని, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లోనూ సాగునీటి కరువును పరిశీలించి రైతులతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్టీ మాజీ మంత్రి, పెద్దపల్లి ఎంపీ అభ్యరి కొప్పుల ఈశ్వర్‌, పెద్దపల్లిలో 36 గంటల రైతు నిరసన దీక్షను చేపట్టారు. ఈ కరువు కాలం కారణంగా వచ్చింది కాదని కాంగ్రెస్‌ పార్టీ తెచ్చిన కరువని అధికారపార్టీపై బీఆర్‌ఎస్‌ ఎదురుదాడి ప్రారంభించింది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ప్రతిష్టను తగ్గించడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగిన అంశాన్ని వాడుకుంటున్నదని, వాటికి మరమ్మతులు చేయించకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని దిగువకు వదిలి ఈ సీజన్‌లో పంట పొలాలకు నీరందకుండా చేశారని విమర్శించారు. రైతుబంధు కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉంచిన 7,500 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమచేయకుండా కాంటాక్టర్లకు కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిందని, పంటలు ఎండి పోయి రైతులు ఇబ్బందుల్లో ఉంటే మంత్రులు, ముఖ్యమంత్రి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్నది. రైతుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తూ రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తున్న కాంగ్రెస్‌ను ఎండగట్టేందుకు కేసీఆర్‌ కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల పర్యటనను తలపెట్టారు. బీఆర్‌ఎస్‌ ఇప్పటికే రైతుల సమస్యలపై ఆందోళనలు చేపడుతూ వారి మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నది.

ఫ విమర్శలను తిప్పికొడుతున్న కాంగ్రెస్‌

అధికారపక్షమైన కాంగ్రెస్‌ వంద రోజుల్లో తాము చేసిన పనులను వివరిస్తూ ప్రస్తుత కరువు పరిస్థితికి బీఆర్‌ఎస్సే కారణమని ఎదురుదాడి ప్రారంభించింది. ఐదెకరాల వరకు రైతుబంధు నిధులు విడుదల చేశామని, రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని చెబుతూ మంత్రులు విపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రైతుల మద్దతు కూడగట్టుకోవడానికి అన్ని రాజకీయపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తున్న రైతులు ఎవరి పక్షం ఉంటారో అన్నది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Apr 03 , 2024 | 01:14 AM