Share News

ఆర్టీసీ ‘వడ్డన’

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:55 AM

ఆర్టీసీ సంస్థ రాజధాని ఏసీ, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో వాటర్‌ బాటిళ్లు, స్నాక్స్‌ పేరిట చార్జీ వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ఇష్టం లేని స్నాక్స్‌, నీళ్లు వద్దన్నా కూడా చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు నెలల క్రితం దీనిని ఆర్టీసీ అమల్లోకి తీసుకువచ్చింది. దీనిపై తీవ్రవ్యతిరేకత వస్తున్నా కూడా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఆర్టీసీ ‘వడ్డన’

- బస్సుల్లో వాటర్‌, స్నాక్స్‌ పేరిట అదనపు వసూలు

- సూపర్‌ లగ్జరీలో వాటర్‌ బాటిల్‌ రూ. 10

- రాజధాని, గరుడ బస్సుల్లో వాటర్‌ బాటిల్‌, స్నాక్స్‌ పేరిట రూ.40

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఆర్టీసీ సంస్థ రాజధాని ఏసీ, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో వాటర్‌ బాటిళ్లు, స్నాక్స్‌ పేరిట చార్జీ వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ఇష్టం లేని స్నాక్స్‌, నీళ్లు వద్దన్నా కూడా చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు నెలల క్రితం దీనిని ఆర్టీసీ అమల్లోకి తీసుకువచ్చింది. దీనిపై తీవ్రవ్యతిరేకత వస్తున్నా కూడా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగానే నీళ్ల బాటిళ్లు ఇస్తున్నారోమోనని కొందరు ప్రయాణికులు అనుకుంటున్నారు. జిల్లాలోని గోదావరిఖని, పెద్దపల్లి ప్రాంతానికి చెందిన అనేక మంది విద్యార్థులు కరీంనగర్‌ హైదరాబాద్‌ల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. అనేక మంది హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌, ఇతరత్రా ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసుకుని జీవిస్తున్నారు. సెలవు దినాల్లో సొంత ఇంటికి వచ్చి వెళ్లిపోతుంటారు. గోదావరిఖని నుంచి హైదరాబాద్‌ రూటులో ఆసిఫాబాద్‌, మంచిర్యాల, గోదావరిఖని ఆర్టీసీ డిపోల నుంచి హైదరాబాద్‌, జేబీఎస్‌ల వరకు నడిపిస్తున్నారు. నిత్యం అనేక మంది రాకపోకలు సాగిస్తున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు రాష్ట్రమంతటా ఉచితంగా ప్రయాణించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అవకాశం కల్పించడంతో అందులో సీట్లు దొరికే పరిస్థితి లేక చాలా మంది ప్రయాణికులు రాజధాని ఏసీ, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వాటి ఆక్యుపెన్సీ రేట్‌ కూడా నెల రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నది.

- నాలుగు నెలల నుంచి వసూలు..

నాలుగు నెలల నుంచి సూపర్‌ లగ్జరీ బస్సుల్లో టీఎస్‌ఆర్‌టీసి జీవా పేరిట అర లీటర్‌ వాటర్‌ బాటిళ్లను ప్రవేశపెట్టారు. ఈ బాటిళ్ల పేరిట టికెట్‌ తీసుకునేటప్పుడు 10 రూపాయలు అందులో కలిపే తీసుకుంటున్నారు. తక్కువ దూరం ప్రయాణించినా, ఎక్కువ దూరం ప్రయాణించినా కూడా బలవంతంగా 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంతకు ముందు రాజధాని, గరుడ వంటి బస్సుల్లో మాత్రమే బిస్లరీ వాటర్‌ బాటిళ్లను ఇచ్చే వాళ్లు. ఇప్పుడు జీవా బాటిళ్లను ఇస్తున్నారు. ఈ నీళ్లు ప్రయాణికులు ఎవరు కూడా తాగడానికి ఇష్ట పడడం లేదు. అంత రుచిగా లేకపోవడమే కారణమని తెలుస్తోంది. సగం సగం నీళ్లు తాగి బస్సుల్లోనే వదిలేస్తున్నారు. మొదట రాజధాని, గరుడ వంటి బస్సులకే పరిమితమైన వాటర్‌ బాటిళ్లను సూపర్‌ లగ్జరీల్లో ప్రవేశ పెట్టారు. అలాగే అక్టోబరు నుంచి రాజధాని, ఇతర ఏసీ బస్సుల్లో వాటర్‌ బాటిల్‌తో పాటు ట్రూ గుడ్‌ సంస్థ ఉత్పత్తి చేస్తున్న టీఎస్‌ఆర్‌టీసీ మిల్లెట్‌ స్నాక్‌ ప్యాకెట్లను ఇస్తున్నారు. ఈ రెండింటి పేరిట 40 రూపాయలు వసూలు చేస్తున్నారు. గోదావరిఖని నుంచి కరీంనగర్‌కు రాజధాని బస్సులో వెళ్లాలంటే 210 రూపాయలు చెల్లించాలి. సూపర్‌ లగ్జరీలో 140 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ రెండు సర్వీసుల మధ్య 70 రూపాయల వ్యత్యాసం ఉన్నది. స్నాక్స్‌ రెండింటిని ప్రయాణికులకు బలవంతంగా అంటగడుతున్నారు. ఈ విషయం చాలా మంది ప్రయాణికులకు తెలియదు. ఈ బస్సులను వన్‌ మెన్‌ సర్వీస్‌ కిందనే నడిపిస్తుండడం వల్ల డ్రైవర్లు ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే సమయంలోనే వాటర్‌ బాటిల్‌తో పాటు స్నాక్స్‌ ప్యాకెట్‌ ఇవ్వాల్సి ఉండగా ఇవ్వడం లేదు. ప్రయాణికులు అడిగితే తప్ప ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా వాటిని తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. అయితే వాటర్‌, స్నాక్స్‌ రుచిగా లేవని ప్రయాణికులు అంటున్నారు. సాధారణంగా లాంగ్‌ జర్నీ చేసే ప్రయాణికులు బస్టాండ్‌లో ఉండే షాపుల్లోనే బ్రాండెడ్‌ కంపెనీ వాటర్‌ బాటిళ్లతో పాటు తనకు నచ్చిన స్నాక్స్‌ను కొనుగోలు చేసి బస్సు ఎక్కుతుంటారు. దీనివల్ల నెలనెలకు వేలల్లో అద్దెలు చెల్లించి టెండర్లలో షాపులను దక్కించుకుంటున్న దుకాణదారులు తీవ్రంగా నష్ట పోతున్నారు. సాధారణంగా సూపర్‌ లగ్జరీ, రాజధాని వంటి బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులే ఎక్కువగా వాటర్‌ బాటిళ్లు, స్నాక్స్‌ కొనుగోలు చేస్తుంటారు. తమకు అవసరం లేకున్నా కూడా ఆర్టీసీ సంస్థ వాటర్‌ బాటిళ్లు, స్నాక్స్‌ పేరిట అదనంగా బాదుతుండడంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం మారినా కూడా వాటిని అలాగే కొనసాగిస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీ వెంటనే స్పందించి అదనపు బాదుడును ఎత్తివేయాలని, బలవంతంగా తమ నుంచి డబ్బులు వసూలు చేయవద్దంటూ ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:55 AM