Share News

ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు తప్పిన నీటి గండం

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:19 AM

రామగుండం ఫెరిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)కు నీటి గండం తప్పింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో సరిపడా నిల్వలు లేవని, ఏప్రిల్‌లో ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు నీటి సరఫరా చేయలేమని ఇరిగేషన్‌శాఖ పేర్కొనడంతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ వర్గాలు ఆందోళనకు గురయ్యాయి.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు తప్పిన నీటి గండం
ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రాజెక్ట్‌

కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి జోక్యంతో నీటి సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం

ఎల్లంపల్లి డెడ్‌ స్టోరేజీ నుంచి హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ ద్వారా సరఫరా

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 4: రామగుండం ఫెరిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)కు నీటి గండం తప్పింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో సరిపడా నిల్వలు లేవని, ఏప్రిల్‌లో ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు నీటి సరఫరా చేయలేమని ఇరిగేషన్‌శాఖ పేర్కొనడంతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. ఏప్రిల్‌, మే నెలలో యూరియా ఉత్పత్తి జరిగితేనే రాబోయే వర్షాకాల సీజన్‌లో రైతాంగానికి యూరియా సరఫరాకు అవకాశం ఉంటుంది. పరిశ్రమకు ఎల్లంపల్లి నుంచి నీటి సరఫరా నిలిచిపోతే యూరియా ఉత్పత్తికి ఆటంకం కలుగనున్నది. ఈ పరిస్థితుల్లో ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ కార్యదర్శి రాష్ట్రప్రభుత్వ ప్రధనా కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సీఈవో కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాశారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటాదారుగా ఉంది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి అయ్యే యూరియాలో సగం తెలంగాణకే సరఫరా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కీలకంగా మారింది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తికి ఆటంకం కలుగకుండా నీటి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 138మీటర్లకు దిగువన నీరు ఉంటే సరఫరా జరిగే అవకాశం ఉండదు. కేవలం మంచినీటి అవసరాలు, ఎన్‌టీపీసీ విద్యుత్‌ ఉత్పత్తి అవసరాలకే వినియోగించే అవకాశం ఉంది. 134 నుంచి 138మీటర్ల మధ్య డెడ్‌ స్టోరేజీలో ఎల్లంపల్లిలో 2.35టీఎంసీల నీటి నిల్వలుంటాయి. ఈ నీటిని వినియోగించుకుని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఉత్పత్తికి ఆటంకం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మిషన్‌ భగీరథ స్కీమ్‌ నుంచి రోజుకు 18క్యూసెక్కుల నీటిని ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీకి చేరిన ప్రత్యేకంగా సబ్‌ మెర్సిబుల్‌ మోటార్లు బిగించి హైదరాబాద్‌ మెట్రో పాలిటిన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు ద్వారా నీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ అంగీకారం కూడా తెలిపింది. బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీ సుదర్శన్‌రెడ్డి ఈ మేరకు గురువారం మున్సిపల్‌శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీకి లేఖ రాశారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు రోజూ 18క్యూసెక్కుల నీటి సరఫరా బాధ్యత తాము తీసుకుంటామని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌ అవసరాలకు రోజూ 330క్యూసెక్కులు, మిషన్‌ భగీరథకు 58క్యూసెక్కులు, ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు 18క్యూసెక్కులు కలిసి రోజూ 406క్యూసెక్కులు నీటి సరఫరా చేయాల్సి ఉంది. ప్రాజెక్టు నీటి మట్టం 138మీటర్లకు దిగువన పడిపోయిన సందర్భంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌తో పాటు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కూడా సబ్‌ మెర్సిబుల్‌ మోటార్ల బిగింపు కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నది.

Updated Date - Apr 05 , 2024 | 12:19 AM