Share News

‘సన్నాల’ వైపు మళ్లేనా?

ABN , Publish Date - May 23 , 2024 | 12:45 AM

యాసంగి సాగులో భూగర్భ జలాలు అడుగంటి ఇబ్బందిపడిన రైతులు వానాకాలం సాగు ఆశాజనకంగా ఉంటుందనే నమ్మకంతో సిద్ధమవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుదీర్ఘకాలంగా దొడ్డురకం వడ్లు సాగు చేస్తున్న రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు

       ‘సన్నాల’ వైపు మళ్లేనా?
జిల్లాలో వరి సాగు.

- రూ.500 బోనస్‌ ప్రకటించిన ప్రభుత్వం

- దొడ్డురకంపై అన్నదాతల మొగ్గు

- జిల్లాలో వానాకాలం సాగు 2.35 లక్షల ఎకరాలు

- వరి 1.83 లక్షల ఎకరాలు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

యాసంగి సాగులో భూగర్భ జలాలు అడుగంటి ఇబ్బందిపడిన రైతులు వానాకాలం సాగు ఆశాజనకంగా ఉంటుందనే నమ్మకంతో సిద్ధమవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుదీర్ఘకాలంగా దొడ్డురకం వడ్లు సాగు చేస్తున్న రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. వానాకాలం సీజన్‌ నుంచి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్నరకం వడ్లకే బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా రైతులు నిరాశకు గురవుతున్నారు. ఈ మేరకు దొడ్డురకం వడ్ల నుంచి సన్నరకం సాగుకు మారుతారా? బోనస్‌ వదులుకుంటారా? అనే సందిగ్ధం నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డు దారులతోపాటు హస్టళ్లకు, మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం ఇవ్వాలనే నిర్ణయానికి అనుగుణంగానే డిమాండ్‌కు తగ్గ సన్నబియ్యం అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. దీనిని అధిగమించేందుకు స్థానిక రైతులు సన్నాలు సాగువైపు మళ్లేందుకు రూ.500 బోనస్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో భూగర్భ జలాలు పెరగడం ద్వారా కాళేశ్వరం జలాలతో వరి సాగు పెరుగుతూ వచ్చింది. ఈ సారి మాత్రం వర్షాధారం పైనే ఆధారపడాల్సి వస్తుందని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు వానాకాలం, యాసంగి సీజన్‌లలో సుమారుగా 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు దొడ్డురకం వడ్లనే దిగుమతి చేస్తున్నారు. ఈపరిస్థితుల్లో సన్నరకం వడ్ల వైపు మొగ్గుచూపుతారా? అనేది చర్చనీయాంశంగానే మారింది.

దిగుబడి తగ్గినా రాబడి ఎక్కువే

దొడ్డురకాల సాగుతో పోలిస్తే వరి సన్నాల దిగుబడి తక్కువగా ఉంటుంది. దొడ్డురకాలు సగటున ఎకరానికి 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. అంతేకాకుండా కొంత ఇబ్బంది లేకుండా దిగుబడి ఉంటుంది. సన్నరకాల సాగులో ఎకరానికి 3 నుంచి 5 క్వింటాళ్ల వరకు దిగుబడి తక్కువగా ఉంటుంది. తెగుళ్ల బెడద ఎక్కువగానే ఉన్నా సన్న రకాలకు బహిరంగ మార్కెట్‌లోనూ ధర అధికంగానే ఉంటుంది. దొడ్డురకం క్వింటాల్‌కు రూ.1850 ఉండే సన్నరకాలు .2500వరకు మార్కెట్‌లో కొనుగోళ్లు జరుగుతాయి. అంతేకాకుండా నేరుగా రైతుల వద్దకే మిల్లర్లు వచ్చి కొనుగోళ్లు చేస్తారు. జిల్లాలో అనుకూలమైన సాగు పరిస్థితులు లేకపోవడం, కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండడంతో దొడ్డురకం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.

వానాకాలంలో 1.83 లక్షల ఎకరాల్లో వరి

జిల్లాలో వానాకాలంలో 2 లక్షల 35 వేల 866 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ఇందులో వరి లక్షా 83వేల 80 ఎకరాలు, పత్తి 49,215, పెసర 348, కందులు 1502, మొక్కజొన్న 1510, సోయా చిక్కుడు 5, ఎర్ర మిర్చి 180, మినుములు 10, జొన్నలు 10, ఆముదం ఆరు ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. ఇందుకోసం వరి 45,770 క్వింటాళ్ల విత్తనాలు, అవసరం అవుతాయని అంచనాలు వేయగా కందులు 45.06 క్వింటాళ్లు, మొక్కజొన్న 120 క్వింటాళ్లు, పత్తి 665 క్వింటాళ్లు, సోయాచిక్కుడు 1.50 క్వింటాళ్లు, మిర్చి విత్తనాలు 18 కిలోలు, పెసర్లు 27.84 క్వింటాళ్లు, మినుములు 80 కిలోలు, జొన్నలు 40 కిలోలు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. వానాకాలంలో ఎరువులు 49,441 మెట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని అంచనా వేశారు. యూరియా 22,484 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 4328 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 14,839 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 5936 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 1855 మెట్రిక్‌ టన్నులు అవసరమవుతాయని అంచనా వేశారు.

Updated Date - May 23 , 2024 | 12:45 AM