Share News

రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:39 AM

లోక్‌సభ ఎన్నికలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్‌, ఎన్నికల అధికారి అనురాగ్‌ జయంతి కోరారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్‌, ఎన్నికల అధికారి అనురాగ్‌ జయంతి కోరారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఓటరు నమోదు చేసుకోవాలంటే ఎవరూ అందోళన చెందవద్దని, ఏప్రిల్‌ 15వ తేదీ వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయనున్నట్లు చెప్పారు. మోడల్‌ కోడ్‌ను పాటించాలన్నారు. తుది ఓటరు జాబితాలో ఎవరిదైనా ఓటు హక్కు లేకపోతే బూత్‌ లెవల్‌ ఎలక్ర్టోరల్‌ ఏజెంట్‌, రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లాల న్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశామని, సీ విజిల్‌, 1950 నంబరు, ఎన్‌జీఎస్‌పీకి వచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించనున్నట్లు చెప్పారు. ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా చేస్తే సీ విజిల్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, వంద నిమిషాల్లో ఫిర్యాదును పరిశీలించి పరిష్కారం చూపిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా, సోషల్‌ మీడియాలో ప్రకటనలు ఇచ్చే విషయంలో డీపీఆర్వో ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎంసీఎంసీకి సమాచారం ఇవ్వాలన్నారు. దాని అనుమతితోనే పబ్లిష్‌ చేయించుకోవాలన్నారు. కరపత్రా లు, పోస్టర్లపై కచ్చితంగాముద్రించిన వారిపేరు ఫోన్‌ నంబరు ఉండాలని అన్నారు.

ఫ సోషల్‌ మీడియాలో జాగ్రత్త

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో రాజకీయ పార్టీల నాయకులు యువత సోషల్‌ మీడియా వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ అఖిల్‌మహాజన్‌ సూచించారు. విధ్వేషాలు రెచ్చగొట్టేలా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేయవద్దని, అనవసరపు మేసేజ్‌లతో ఇబ్బందులకు గురికావద్దని అన్నారు. యువత కేసులపాలై జీవితాలు నాశనం చేసుకోవద్దని, కేసులు నమోదైతే భవిష్యత్‌లో ఇబ్బంది అవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌లు పూజారి గౌతమి, ఖీమ్యానాయక్‌, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రాజేశ్వర్‌, రమేష్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

కన్నుల పండువగా పెద్దమ్మ- పెద్దిరాజుల కల్యాణం

ఎల్లారెడ్డిపేట, మార్చి 17: ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ- పెద్దిరాజుల కల్యాణ ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం ఆలయంలో పురోహితులు కుంభవృష్టి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. పెద్దమ్మ- పెద్దిరాజుల కల్యాణ వేడుకలను కన్నుల పండువగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి తిలకించారు. నాగవెల్లి పట్నం, సిద్ధులు తిరుగుట, గావు పట్టుట కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఒడి బియ్యం పోసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. చల్లంగా చూడాలని వేడుకున్నారు.

Updated Date - Mar 18 , 2024 | 12:39 AM