Share News

రికార్డ్‌ బ్రేక్‌

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:24 AM

కరీంనగర్‌లో కమలం వికసించింది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ రెండోసారి ఎంపీగా విజయాన్ని నమోదు చేసుకున్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానంలో గెలుపొందిన పార్లమెంట్‌ సభ్యుల గత మెజార్టీ రికార్డులను బ్రేక్‌ చేస్తూ 2,25,209 ఓట్ల ఆధిక్యతతో బండి సంజయ్‌కుమార్‌ విజయం సాధించారు.

రికార్డ్‌ బ్రేక్‌

కరీంనగర్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌లో కమలం వికసించింది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ రెండోసారి ఎంపీగా విజయాన్ని నమోదు చేసుకున్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానంలో గెలుపొందిన పార్లమెంట్‌ సభ్యుల గత మెజార్టీ రికార్డులను బ్రేక్‌ చేస్తూ 2,25,209 ఓట్ల ఆధిక్యతతో బండి సంజయ్‌కుమార్‌ విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు రెండో స్థానంలో నిలవగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ మూడో స్థానానికి పరిమతమయ్యారు. 10,405 పోస్టల్‌ బ్యాలెట్స్‌తో కలుపుకుని 13,13,331 ఓట్లు పోల్‌ కాగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌కు 5,85,116 ఓట్లు వచ్చాయి. 3,59,907 ఓట్లు సాధించి కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు రెండో స్థానంలో నిలిచారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ 2,82,163 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థికి పోలైన ఓట్లలో 44.55 శాతం, కాంగ్రెస్‌ అభ్యర్థికి 27.4 శాతం, బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 21.48 శాతం, ఇతరులకు 6.57 శాతం ఓట్లు వచ్చాయి.

ఫ డిపాజిట్‌ కోల్పోయిన 25 మంది అభ్యర్థులు

నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, ఇండిపెండెంట్లతో కలిపి 25 మంది డిపాజిట్‌ కోల్పోయారు. ఐదుగురు అభ్యర్థులు మాత్రమే నోటాకు వచ్చిన 5,192 ఓట్లకు మించిన ఓట్లను సాధించారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో హుస్నాబాద్‌ నియోజకవర్గంలో మినహా అన్నింటిలోనూ బీజేపీ తన ఆధిక్యతను చాటుకున్నది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీ రామారావు, గంగుల కమలాకర్‌, పాడి కౌశిక్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల, కరీంనగర్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మానకొండూర్‌, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లోనూ బీజేపీ ఎక్కువ ఓట్లను సాధించింది.

ఫ అసెంబ్లీ ఎన్నికల కన్నా పెరిగిన ఓట్లు

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో బీజేపీకి కేవలం 2,50,279 ఓట్లు రాగా ప్రస్తుత ఎన్నికల్లో 5,85,116 ఓట్లను సాధించి తన బలాన్ని రెట్టింపు చేసుకున్నది. బండి సంజయ్‌కుమార్‌ గత పార్లమెంట్‌ ఎన్నికల్లో 89,508 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఆయనకు 2,25,209 ఓట్ల మెజార్టీ రావడం ఈ నియోజకవర్గ రికార్డుగా మారింది. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకు 2006లో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 2,01,581 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆ తర్వాత 2014లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బి.వినోద్‌కుమార్‌కు 2,05,007 ఓట్ల మెజార్టీ దక్కింది. ప్రస్తుతం ఈ రెండు రికార్డులను బద్దలుకొట్టి సంజయ్‌కుమార్‌ కొత్త రికార్డును సొంతం చేసుకున్నారు.

ఫ 14వ రౌండ్‌ మినహా ప్రతి రౌండ్‌లోనూ బీజేపీదే ఆధిక్యం

24 రౌండ్లుపాటు సాగిన ఓట్ల లెక్కింపులో 14వ రౌండ్‌ మినహా ప్రతి రౌండ్‌లోనూ బీజేపీ హవా కొనసాగింది. 14వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు, బీజేపీ కంటే 70 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఈరౌండ్‌లో బీజేపీకి 22,183 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 22,253 ఓట్లు పోలయ్యాయి. మిగతా అన్ని రౌండ్లలోనూ బీజేపీ తన ఆధిక్యాన్ని కొనసాగించగా రెండో స్థానంలో కాంగ్రెస్‌, మూడో స్థానంలో బీఆర్‌ఎస్‌ ఉంటూ వచ్చాయి. పోస్టల్‌ బ్యాలెట్లలోనూ బీజేపీ ఆధిక్యం కొనసాగింది. 10,425 పోస్టల్‌ బ్యాలెట్లలో బీజేపీకి 6,289 ఓట్లు దక్కగా, కాంగ్రెస్‌కు 2,461, బీఆర్‌ఎస్‌కు 1,296 ఓట్లు వచ్చాయి. నోటాకు 5,192 ఓట్లు పడ్డాయి.

ఫ వివిధ పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లు

బహుజన్‌ సమాజ్‌ పార్టీకి చెందిన మారపల్లి మొగిలయ్యకు 8,109, నేషనల్‌ నవక్రాంతి పార్టీ అభ్యర్థి అనిల్‌రెడ్డికి 2,754, అలయెన్స్‌ ఆఫ్‌ డెమాక్రటిక్‌ పార్టీ అభ్యర్థి తాళ్ళపల్లి అరుణకు 9,064, సోషల్‌ జస్టిస్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థి అశోక్‌ పంచికాకు 1924 ఓట్లు వచ్చాయి. పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థి చింత అనిల్‌కుమార్‌ు 830, ధర్మసమాజపార్టీ అభ్యర్థి చిలువేరు శ్రీకాంత్‌ 2586, తెలుగు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చీకోటి వరుణ్‌కుమార్‌ గుప్తాకు 790 ఓట్లు సాధించారు. బహుజన ముక్తిపార్టీ అభ్యర్థి ఒడిశెట్టి సమ్మయ్యకు 994 ఓట్లు, సోషలిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థి రాణాప్రతాప్‌గట్టుకు 1613, భారతీయ యువకుల పార్టీ అభ్యర్థి పెద్దపల్లి శ్రావణ్‌కు 3,074 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్‌ అభ్యర్థి బుచ్చిరెడ్డికి 11,612 ఓట్లు, అక్షయ్‌కుమార్‌కు 2224, కట్కూరి అనూస్‌కు 8,806, కోట శ్యాంకుమార్‌కు 8,856, గట్టయ్యయాదవ్‌ బరిగెకు 1,694, గడ్డ సతీష్‌కు 2,945, గవ్వ లక్ష్మికి 1,744, గుడిసె మోహన్‌కు 1,418, దేవునూరి శ్రీనివాస్‌కు 444, పేరాల మానసకు 1,081, కె రాజేందర్‌కు 3,130, రాపోలు రాంకుమార్‌ భరద్వాజ్‌కు 548, జర్నలిస్టు విక్రమ్‌రెడ్డికి 2,030, డేగల వెంకటనర్సయ్య 904, శివరాత్రి శ్రీనివాస్‌కు 870 ఓట్లు పోలయ్యాయి.

Updated Date - Jun 05 , 2024 | 12:24 AM