Share News

రుణమాఫీ కాని వారికి భరోసా!

ABN , Publish Date - Aug 21 , 2024 | 01:06 AM

రుణమాఫీ కాలేదని ఆందోళన చెందుతున్న పలువురు రైతులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. వివిధ సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీకి నోచుకోని రైతులు ఈనెలాఖరులోగా నిర్ణీత దరఖాస్తు ఫారంలో వివరాలు నమోదు చేసిస్తే రుణమాఫీ వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈమేరకు కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రంలో, మండలాల్లో మండల వ్యవసాయ శాఖాధికారులు, మండల విస్తీర్ణాధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

రుణమాఫీ కాని వారికి భరోసా!

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రుణమాఫీ కాలేదని ఆందోళన చెందుతున్న పలువురు రైతులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. వివిధ సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీకి నోచుకోని రైతులు ఈనెలాఖరులోగా నిర్ణీత దరఖాస్తు ఫారంలో వివరాలు నమోదు చేసిస్తే రుణమాఫీ వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈమేరకు కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రంలో, మండలాల్లో మండల వ్యవసాయ శాఖాధికారులు, మండల విస్తీర్ణాధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి 2 లక్షల రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మూడు విడతల్లో రుణ మాఫీ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం 2018 డిసెంబరు 12వ తేదీనుంచి 2023 డిసెంబరు 9వ తేదీవరకు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఒక కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పంట రుణాలు తీసుకున్నా, 2 లక్షలు మాత్రమే రుణ మాఫీ చేస్తామని, కుటుంబ సభ్యుల వివరాలను రేషన్‌కార్డుల ఆధారంగా గుర్తించారు. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పోర్టల్‌లో ఉన్న వివరాల ఆధారంగా ఆదాయ పన్ను చెల్లించే రైతులను గుర్తించి వారికి రుణ మాఫీ చేయనట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా రుణ మాఫీ పథకం నుంచి తొలగించారు. కొన్ని నిబంధనల వల్ల నిర్ణీత కాల వ్యవధిలో రుణాలు తీసుకున్న రైతులకు పంట రుణాలు మాఫీ కాలేదు. గత ఏడాది పంట రుణాలు తీసుకుని రుణమాఫీ విషయం తెలియక ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాల్లో అప్పులు చెల్లించి కొత్తగా రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణ మాఫీ వర్తింపజేయకపోవడంతో సదరు రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. తాము తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడమే తాము చేసిన నేరమా అని సదరు రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఫ జిల్లాలో రూ. 375.58 కోట్ల రుణాల మాఫీ..

జిల్లాలో మూడు విడతల్లో కలిపి మొత్తం 51,393 మంది రైతులకు 375 కోట్ల 58 లక్షల 4 వేల 931 రూపాయలు మాఫీ చేశారు. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు 29,724 మంది రైతులకు 149 కోట్ల 42 లక్షల 22 వేల 297 రూపాయలు మాఫీ కాగా, రెండో విడతలో లక్షన్నర వరకు 13,401 మంది రైతులకు 124 కోట్ల 40 లక్షల 76 వేల 460 రూపాయలు, మూడో విడతలో రెండు లక్షల వరకు 8,268 మంది రైతులకు 101 కోట్ల 75 లక్షల 6 వేల 174 రూపాయలు, 2 లక్షలకు పైగా రుణాలు పొందిన రైతులు 2 లక్షల పైన ఉన్న మొత్తాన్ని బ్యాంకుల్లో చెల్లిస్తే వారి ఖాతాల్లో 2 లక్షల రుణ మాఫీ సొమ్మును జమ చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సోమవారం ప్రకటించారు. ఆధార్‌ వివరాలు సరిగా లేకపోవడం, రేషన్‌ కార్డులు లేని వారికి, వివిధ రకాల తప్పులు ఉన్న రైతులకు అర్హత కలిగి ఉన్నా కూడా రుణ మాఫీ కాలేదు. దీంతో సదరు రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అలాంటి రైతులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఈ నెలాఖరులోగా నిర్ణీత ఫారంలో అన్ని వివరాలతో దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి రుణ మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఫ రుణమాఫీ కాని వారు 17 వేల మంది..

ప్రభుత్వం జారీ చేసిన రుణ మాఫీ మార్గదర్శకాల ప్రకారం అన్ని అర్హతలు ఉండి వివిధ కారణాల వల్ల రుణ మాఫీ కాని వారు జిల్లాలో 17 వేల మంది వరకు రైతులు ఉండవచ్చని అంచనా. వారికి సంబంధించిన మేరకు 242 కోట్ల 85 లక్షల 30 వేల 317 రూపాయలు ఉంటుందని అంచనా. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు దాదాపు 3 వేల దరఖాస్తులు అందాయి. పెద్దపల్లి మండలంలో 3037 మంది, ఎలిగేడు మండలంలో 1030 మంది, జూలపల్లి మండలంలో 536 మంది, ఓదెల మండలంలో 958 మంది, కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 1060 మంది, సుల్తానాబాద్‌ మండలంలో 1942 మంది, కమాన్‌పూర్‌ మండలంలో 578 మంది, మంథని మండలంలో 3,104 మంది, ముత్తారం మండలంలో 477 మంది, రామగిరి మండలంలో 690 మంది, అంతర్గాం మండలంలో 134 మంది, పాలకుర్తి మండలంలో 718 మంది, రామగుండం మండలంలో 461 మంది రైతులు ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించినట్లు సమాచారం. సంబంధిత రైతులు త్వరగా వ్యవసాయ శాఖాధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి రుణమాఫీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Aug 21 , 2024 | 01:06 AM