నామమాత్రంగా కార్పొరేషన్‌లో ఆస్తి పన్నుల రీ అసెస్‌మెంట్
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:45 AM
నగరపాలక సంస్థ ఆదాయంలో ఆస్తిపన్నులే కీలకం.

కరీంనగర్ టౌన్, జూలై 4: నగరపాలక సంస్థ ఆదాయంలో ఆస్తిపన్నులే కీలకం. ఆస్తి పన్నులను సక్రమంగా వసూలు చేస్తే ప్రతి యేడాది ఆదాయం పెరుగుతుంది. ఆన్‌లైన్ ద్వారా ఆస్తిపన్నులను నిర్ధారిస్తుండడంతో కొంత మేరకు లోపాలు తగ్గినప్పటికి ప్రతి యేటా రీ అసెస్‌మెంట్ సరిగా చేయక పోవడంతో బల్దియా ఖజానాకు కోట్లలో గండి పడుతోంది. పదేళ్లుగా శరవేగంగా విసరిస్తున్న కరీంనగర్‌లో ఎటు చూసినా పెద్దపెద్ద భవనాలు, అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలు దర్శనమిస్తున్నప్పటికీ ఆ మేరకు వాటి ద్వారా ఆస్తిపన్నులు వసూలు కావడం లేదనే విమర్శలున్నాయి. నగరపాలక సంస్థ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారంగా 82,732 నివాస, వాణిజ్య గృహాలు, గృహ సముదాయాలున్నాయి. ఇవి కాకుండా అసెస్‌మెంట్ కానీ భవనాలు, ఇళ్లు ఉన్నాయి. పాత ఇళ్లను కూల్చివేసి కొత్తగా బహుళ అంతస్తు భవనాలను నిర్మించుకుని పాత ఇంటి పన్నులను చెల్లించేవారు ఎంతో మంది ఉన్నారు. నగరపాలక సంస్థకు ఆస్తిపన్నుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 31 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. గత బకాయిలతో కలిపి మరో కోటి వరకు రావచ్చు. అదనపు ఆదాయ వనరులపై దృష్టిసారించాలని, ప్రతియేటా రీ అసెస్‌మెంట్‌ను సక్రమంగా చేపట్టి పన్నుల ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం, ఉన్నతాధికారులు సూచిస్తుండడంతో నామమాత్రంగా కొన్ని ఇళ్లను రీ అసెస్‌మెంట్ చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హౌసింగ్ బోర్డులోనే రూ. కోటికిపైగా పెరిగిన ఆస్తిపన్ను
ఇటీవల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ నగరపాలక సంస్థపై ప్రత్యేక దృష్టిసారించి అదనపు ఆదాయ వనరుల్లో ప్రధానమైన ఆస్తిపన్నులను రీ అసెస్‌మెంట్ చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో బిల్ కలెక్టర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగితో కలిసి వెళ్లి వారి దృష్టికి వచ్చిన ఇళ్లు వాణిజ్య భవనాలను కొలతలు తీసుకొని రీ అసెస్‌మెంట్ చేస్తున్నారు. హౌసింగ్‌బోర్డుకాలనీలోనే రీ అసెస్‌మెంట్‌తో కోటి రూపాయలకు పైగా ఆస్తిపన్ను పెరిగింది. దశాబ్దాల క్రితం ఆనాటి ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా హెచ్‌ఐజీ, ఎంఐజీ, ఎల్‌ఐజీ-2 కేటగిరీలుగా వెయ్యికి పైగా ఇళ్లతో హౌసింగ్ బోర్డుకాలనీని ఏర్పాటు చేసింది. ఆ కాలనీలో సరైన మౌలిక వసతులు లేక పోవడంతో అభివృద్ధికి నోచుకోలేదు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో హౌసింగ్‌బోర్డుకాలనీని మోడల్ కాలనీగా ఎంపిక చేసి అభివృద్ధి చేశారు. దీంతో గతంలో నిర్మించిన ఇళ్ళను కూల్చివేసుకొని వాటి స్థానంలో కొత్త ఇళ్లను, బహుళ అంతస్తుభవనాలను, వాణిజ్య భవనాలను నిర్మించుకున్నారు. కొంత మంది ఇంటి యజమానులు మినహా మిగతావారందరూ పాత ఇంటి నంబర్‌తో అప్పటి ఆస్తిపన్నులనే చెల్లిస్తూ వస్తున్నారు. రీ అసెస్‌మెంట్ చేసి కొత్తగా నిర్మించిన ఇంటి పరిమాణాన్ని బట్టి పన్నులను నిర్ధారించక పోవడంతో బల్దియా ఆదాయం కోల్పోయింది. ప్రస్తుతం చేపడుతున్న రీ అసెస్‌మెంట్‌లో ప్రతి ఇంటిని అనుమతి ప్రకారం పరిశీలిస్తూ కొలతలు తీసుకొని ఆస్తిపన్నులను నిర్ధారించడంతో కోటికిపైగా అదనంగా ఆదాయం వచ్చింది. ఇలాగే నగరంలోని అనేక ప్రాంతాల్లో పాత ఇళ్లను కూల్చివేసి కొత్త ఇళ్ళను నిర్మించుకొని పాత పన్నులనే చెల్లిస్తున్నారు. కొందరైతే నివాస గృహాలుగా పన్నులు చెల్లిస్తూ వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. మరికొందరు బహుళ అంతస్తు భవనాలను నిర్మించుకుని ఒకటి రెండు ఫ్లోర్‌లకే పన్నులు చెల్లిస్తున్నారు. దీంతో నగరపాలక సంస్థ భారీగా ఆదాయం కోల్పోతోంది. హౌసింగ్‌బోర్డుకాలనీతోపాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ రీ అసెస్‌మెంట్ చేయడంతో 2.2 కోట్ల రూపాయల మేరకు ఆస్తిపన్నులు పెరిగాయి. రీ అసెస్‌మెట్ పూర్తి చేస్తే మరో కోటి రూపాయల వరకు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. విలీన డివిజన్లు, కొత్తగా ఏర్పడుతున్న శివారుకాలనీలతోపాటు వాణిజ్య ప్రాంతాల్లోనూ ఇలా నగరంలోని ప్రతి ఇంటిని రీ అసెస్‌మెంట్ చేస్తే ప్రస్తుతం వసూలవుతున్న ఆస్తిపన్నులు రెట్టింపు అవుతుందని, దాదాపు ఏడాది 50 కోట్లకు పైగానే ఆస్తిపన్ను వస్తుందని చెబుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా ఆస్తిపన్నులు చెల్లిస్తుండడంతో క్షేత్రస్థాయిలో ఏమైనా ఫిర్యాదులు వస్తే తప్ప రీ అసెస్‌మెంట్ అనేది సరిగా చేయడం లేదు.