Share News

సింగరేణి సంస్థ పరిరక్షణకు ఎంతటి త్యాగానికైనా సిద్ధం

ABN , Publish Date - Mar 25 , 2024 | 12:21 AM

సింగరేణి సంస్థ పరిరక్షణకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు.

సింగరేణి సంస్థ పరిరక్షణకు ఎంతటి త్యాగానికైనా సిద్ధం
సమావేశంలో మాట్లాడుతున్న మిర్యాల రాజిరెడ్డి

- టీబీజేకేఎస్‌ స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ మిర్యాల రాజిరెడ్డి

గోదావరిఖని, మార్చి 24: సింగరేణి సంస్థ పరిరక్షణకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక టీబీజీకేఎస్‌ కేంద్ర కార్యాలయంలో ఆయ న కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కార్మిక హక్కుల సాధన కోసం దశలవారీగా ఉద్యమ కార్యాచరణను అమలు చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. వర్కింగ్‌ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 30మంది సభ్యులతో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసినట్టు వివరించారు. చర్చల కమిటీ ప్రతినిధులు, కేంద్ర కమిటీ కార్యవర్గ సభ్యులు, వివిధ డివిజన్ల ఉపాధ్యక్షులు, సీనియర్‌ నాయకులు ఉంటారని వెల్లడించారు. కార్మిక సంఘం నిబంధనల మేరకు యూనియన్‌ కార్యకలాపాలు కొనసాగిస్తూ, కార్మికవర్గ సంక్షేమం, కార్మిక కుటుంబాల సంక్షేమానికి కృషి చేస్తామని రాజిరెడ్డి వివరించారు. రాబోయే కాలంలో గని స్థాయి నుంచి కేంద్ర కమిటీ వరకు నూతన నాయకత్వాన్ని ఎన్నుకుంటామని తెలిపారు. ఏప్రిల్‌ మాసంలో యూనియన్‌ జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించను న్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం గోదావరిఖనిలో జరిగిన టీబీజీకే ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ చేసిన తీర్మానాలను ఆయన వెల్లడించారు. సింగరేణి సంస్థలో కొత్తగా ఉద్యోగాలు కల్పించడానికి అనుగుణంగా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోనే కొత్త గనులు ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే విధంగా పోరాట కార్యక్రమాలను చేపట్టాలని తీర్మానించారు. కార్మికులకు మరియు వారి కుటుంబ సభ్యుల కు మెరుగైన వైద్యం అందించడంలో యజమాన్యం వైఫల్యానికి నిరసన గా పోరాట కార్యక్రమాలు చేపట్టాలని, ఇటీవల కాలంలో సింగరేణి సంస్థ లు గని ప్రమాదాలు పెరిగి పోతుండడంపై సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు మెరుగైన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. సింగరేణిలో నూతన ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వ రంగంలో కొత్తగనులు సింగరేణి ఆధ్వర్యంలో ప్రారంభించే విధంగా యజమాన్యం కార్యాచరణ ప్రారంభించాలని, బొగ్గు బ్లాకుల పైవ్రేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని తీర్మానించారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు జీతాలు పెంచాలని, జీవో ఎం.ఎస్‌ నంబర్‌ 22ను అమలు చేయాలని, సింగరేణిలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని తీర్మాణించారు. సింగరేణిలోని ఖాళీలను అర్హులైన అంతర్గత అభ్యర్థులకు 80 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని, అర్హత నిబంధనలను సడలించాలని, సింగరేణి వ్యాప్తంగా కార్మిక కుటుంబాలకు రక్షిత మంచినీరు సరఫరా చేయాలని, కార్మికవాడలలో పారిశుధ్యం మెరుగుపరచాలని, సింగరేణి వ్యాప్తంగా సిబిఎస్‌ఈ స్కూళ్లను ప్రారంభించి, పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని తీర్మానించారు. సమావేశంలో స్టీరింగ్‌ కమిటీ నాయకులు నూనె కొమురయ్య, మాదాసి రామమూర్తి, పర్లపెల్ల్లి రవి, ఎల్‌ వెంకటేష్‌, వడ్డేపల్లి శంకర్‌, చెల్పూరి సతీష్‌, చెలుకలపల్లి శ్రీనివాస్‌, పల్లె సురేందర్‌, సర్వోత్తమ్‌రెడ్డి, పులిపాక శంకర్‌, బొగ్గుల సాయి, ఉప్పులేటి తిరుపతి, గడ్డి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2024 | 12:21 AM