Share News

కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాజేందర్‌రావు

ABN , Publish Date - Apr 17 , 2024 | 01:05 AM

కరీంనగర్‌ లోక్‌సభ నియోజక వర్గ అభ్యర్థిత్వం వెలిచాల రాజేందర్‌రావుకే దక్కింది. రెడ్డి, వెలమ, బీసీ అభ్యర్థుల్లో ఎవరికి అవకాశం కల్పించాలో తేల్చుకోలేక పదికిపైగా సమావేశాల్లో చర్చోపచర్చలు చేసిన కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ చివరకు రాజేందర్‌రావు అభ్యర్థిత్వం వైపే మొగ్గుచూపింది. దీంతో నెల రోజులుగా ప్రయత్నించినా కొద్ది బిగుసుకు పోయిన చిక్కుముడి ఎట్టకేలకు వీడిపోయింది.

కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాజేందర్‌రావు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరీంనగర్‌ లోక్‌సభ నియోజక వర్గ అభ్యర్థిత్వం వెలిచాల రాజేందర్‌రావుకే దక్కింది. రెడ్డి, వెలమ, బీసీ అభ్యర్థుల్లో ఎవరికి అవకాశం కల్పించాలో తేల్చుకోలేక పదికిపైగా సమావేశాల్లో చర్చోపచర్చలు చేసిన కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ చివరకు రాజేందర్‌రావు అభ్యర్థిత్వం వైపే మొగ్గుచూపింది. దీంతో నెల రోజులుగా ప్రయత్నించినా కొద్ది బిగుసుకు పోయిన చిక్కుముడి ఎట్టకేలకు వీడిపోయింది. కేరళ పర్యటనలో ఉన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఢిల్లీకి రాగానే మంగళవారం రాత్రి కానీ బుధవారం ఉదయం కానీ అభ్యర్థిని ఖరారు చేసిన ప్రకటన విడుదల చేస్తారని పార్టీవర్గాల సమాచారం. అధిష్ఠానం పెద్దలు అభ్యర్థిత్వం ఖరారు చేసిన విషయాన్ని రాజేందర్‌రావుకు, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఫోన్‌ చేసి తెలిపారని తెలిసింది. అభ్యర్థిగా ఎంపికైన వెలిచాల రాజేందర్‌రావు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మీదుగా పలు గ్రామాల్లో పర్యటించి కరీంనగర్‌కు రానున్నారు. ఈనెల 18 నుంచి కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో నాయకులు, కార్యకర్తలతో సమన్వయ సమావేశాలు నిర్వహించేందుకు మంత్రి పొన్నం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ ఆ రోజు ఇక్కడే ఉన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌మున్షి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల కమిటీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర సభ్యులతో సమావేశమై చర్చించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు.

ఫ రాజకీయ నేపథ్యం

వెలిచాల రాజేందర్‌రావు తండ్రి వెలిచాల జగపతిరావు కరీంనగర్‌ శాసన సభ్యుడిగా పనిచేశారు. రాజేందర్‌రావు కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించడమే కాకుండా పార్టీలో వివిధ పదవుల్లో సేవలందించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత రాజేందర్‌రావు ఆ పార్టీలో చేరి 2004లో చొప్పదండి నియోజక వర్గ టికెట్‌ ఆశించారు. ఆయనకు పార్టీ పోటీ చేయడానికి వీలుగా బీ ఫారం అందించింది. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీఆర్‌ఎస్‌ రాజేందర్‌రావును పోటీ చేయవద్దని కోరింది. ఆయన పోటీ నుంచి తప్పుకోవడానికి నిరాకరించారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి సినినటుడు చిరంజీవి నాయకత్వానికి మద్దతు తెలిపారు. ఆ పార్టీని జిల్లాలో విస్తరింపజేసి 2009లో ఆపార్టీ అభ్యర్థిగా కరీంనగర్‌ లోక్‌ సభ స్థానం నుంచి పోటి చేశారు. 1.75 లక్షల ఓట్లను సాధించి ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత రాజేందర్‌రావు జిల్లాలో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నా ఆయన తండ్రి జగపతిరావుతో కలిసి ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లాలోని నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు.

ఫ జిల్లా నాయకుల మద్దతుతో..

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటటీ చేయడానికి ఆసక్తి చూపించి టికెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, పార్టీ నాయకుడు రుద్ర సంతోష్‌కుమార్‌, తీన్మార్‌ మల్లన్నతో పోటీపడ్డారు. ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు మారుతూ వస్తూ అభ్యర్థిత్వం పెండింగ్‌లో పడుతూ వస్తున్నా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నం కొనసాగించారు. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి కరీంనగర్‌ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం పొందారు. ఈ ప్రయత్నంలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్‌, పార్లమెంట్‌ నియోజక వర్గ పరిధిలోని నియోజక వర్గ ఇన్‌చార్జిలు వొడితెల ప్రణవ్‌, పురమల్ల శ్రీనివాస్‌, కేకే మహేందర్‌రెడ్డి ఆయనకు అండగా నిలిచారు. రాజేందర్‌రావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించడంలో వారు కూడా కీలక పాత్ర వహించారు.

ఫ రేపటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశాలు

కరీంనగర్‌ అర్బన్‌: లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు కరీంనగర్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. 18న కొత్తపల్లి సాయిగార్డెన్‌లో ఉదయం 10 గంటలకు మానకొండూర్‌ నియోజకవర్గంస్థాయి సమావేశం, మద్యాహ్నం 2 గంటలకు హుజురాబాద్‌ వెంకట సాయి గార్డెన్‌లో హుజురాబాద్‌ నియోజకవర్గస్థాయి సమావేం ఉంటుంది. 19న ఉదయం 11 గంటలకు హుస్నాబాద్‌ శుభం గార్డెన్‌లో హుస్నాబాద్‌ నియోజకవర్గస్థాయి, మద్యాహ్నం 2 గంటలకు సిరిసిల్ల నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించున్నారు. 20న ఉదయం 10 గంటలకు వేములవాడ నియోజకవర్గస్థాయి, మద్యాహ్నం 2 గంటలకు చొప్పదండి నియోజకవర్గస్థాయి సమావేశాలు ఉంటాయి. 21న ఉదయం 10 గంటలకు కరీంనగర్‌ డీసీసీ కార్యాలయంలో కరీంనగర్‌ నియోజకవర్గ స్థాయి సమావేశం ఉంటుందని ప్రభుత్వ విప్‌, రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యే, కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాలకు బ్లాక్‌, మండల, పట్టణ, కాంగ్రెస్‌ అధ్యక్షులు, కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విభాగాల, సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.

Updated Date - Apr 17 , 2024 | 01:05 AM