Share News

పకడ్బందీగా తాగునీటి సరఫరా చేయాలి

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:36 PM

గ్రామాల్లో తాగునీటి సరఫరాను పకడ్బందీగా చేయాలని, ఎలాంటి అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌దేశాయ్‌ అధికారులను ఆదేశించారు.

పకడ్బందీగా తాగునీటి సరఫరా చేయాలి

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 2: గ్రామాల్లో తాగునీటి సరఫరాను పకడ్బందీగా చేయాలని, ఎలాంటి అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌దేశాయ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎంపీవో, ఆర్‌డబ్ల్యూఎస్‌, మిషన్‌ భగీరథ ఏఈలు, డీఈలతో గ్రామాల్లో తాగునీటి సరఫరా, నీటి ఎద్దడి నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట మంచినీటి బావులు తవ్వించాలని, వారం రోజుల్లో పనులు చేపట్టాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో బోర్లు వేయించాలని, పైపులైన్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీటి సరఫరా సక్రమంగా జరుగుతుందా లేదా అని క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. దీనిపై నివేదికను సిద్ధం చేసి అందించాలని అన్నారు. పైపులైన్ల లీకేజీలతో మురుగునీరు తాగునీటి కలిస్తే వ్యాధులు ప్రబలే అవకాశముంటుందని, లీకేజీలను గుర్తించి వెంటవెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులను ప్రతి పది రోజులకొకసారి శుభ్రం చేయడంతోపాటు క్లోరినేషన్‌ సక్రమంగా జరిగేలా చూడాలని అన్నారు. అధికారులంతా ప్రతిరోజు తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని, ఏదైనా సమస్య వస్తే త్వరగా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఈసమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి రవీందర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ అంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 11:36 PM