Share News

సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా చూడండి

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:42 AM

పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వేములవాడ శాసనసభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా చూడండి
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసిన విప్‌లు ఆది శ్రీనివాస్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

వేములవాడ/ధర్మారం/ధర్మపురి, మార్చి 23: పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వేములవాడ శాసనసభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం నాడు హైదరాబాద్‌లో ప్రభుత్వ విప్‌, ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి వెళ్లి సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. సాగునీటి కొరత కారణంగా వేములవాడ, ధర్మపురి నియోజక వర్గాల పరిధిలో పంటలు ఎండిపోయే పరిస్థితి తలెత్తిందని, ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందజేసి పంటలు ఎండిపోకుండా కాపాడాలని కోరారు. అదేవిధంగా, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతన్నలకు ప్రభుత్వం తరఫున చేయూతనందించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఆది శ్రీనివాస్‌ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి వెంటనే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి సాగునీటి సరఫరా కు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆది శ్రీనివాస్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని కలిసి స్థానిక పరిస్థితులను వివరిస్తూ రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు వెంటనే సాగునీరు అందించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకుఈ మేరకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలు వేములవాడ, ధర్మపురి నియోజకవర్గాలకు తక్షణమే అందేలా చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ను ఆదేశించారు. రైతుల సమస్యలను తెలియజేయగానే సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆది శ్రీనివాస్‌ ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Mar 24 , 2024 | 12:42 AM