Share News

దేశానికి దశదిశ చూపేది ప్రధాని నరేంద్రమోదీ

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:20 AM

దేశానికి దశదిశ చూపే నాయకుడు నరేంద్ర మోదీ మాత్రమేనని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

దేశానికి దశదిశ చూపేది ప్రధాని నరేంద్రమోదీ

కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 6: దేశానికి దశదిశ చూపే నాయకుడు నరేంద్ర మోదీ మాత్రమేనని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం కరీంనగర్‌ 48, 58 డివిజన్లలో 30 లక్షల రూపాయల ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు సంజయ్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో హైదరాబాద్‌ సహా తెలంగాణాలోని 17 ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో లక్షలాది బోగస్‌ ఓట్లున్నట్లు ఆధారాలు సేకరించామన్నారు. పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని, ఓటర్లను సుదూర ప్రాంతాల్లోని పోలింగ్‌ బూత్‌లకు కేటాయించడంతో ఓటింగ్‌ శాతం తగ్గిందన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఒక నిర్ణయానికి వచ్చారన్నారు. అన్ని సర్వేలు, జాతీయ మీడియా సంస్థలు బీజేపీ తెలంగాణలో అత్యధిక సీట్లను గెలువబోతుందని నివేదికలు ఇచ్చాయని చెప్పారు. గావ్‌ చలో అభియాన్‌లో భాగంగా ప్రతి నాయకుడు ఒక్కో గ్రామానికి వెళ్లి పల్లె నిద్ర చేయాలని సూచించారు. నగరాల్లో బస్తీ నిద్ర చేయాలని, 24 గంటలపాటు ఆ గ్రామంలో బస్తీలో ఉండి ప్రజలతో, కార్యకర్తలతో మమేకం కావాలన్నారు. ఆ ప్రాంతంలో చారిత్రక కట్టడాలుంటే సందర్శించాలని, కొత్త ఓటర్లుంటే వారితో మమేకం కావాలని అన్నారు. ఇందులో భాగంగా హుజురాబాద్‌లోని రంగాపూర్‌లో మంగళవారం రాత్రి బస చేస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ రాపర్తి విజయ, నాయకులు రాపర్తి ప్రసాద్‌, బండ రమణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.

  • గ్యారెంటి లేని ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది

హుజూరాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 6: గ్యారెంటీ లేని ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు. మంగళవారం గావ్‌ చలో(పల్లె నిద్ర) అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్‌ మండలం రంగాపూర్‌ గ్రామానికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకున్న లబ్దిదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండోసారి అధికారంలోకి వచ్చే ముందు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎనిమిది లక్షల ఉద్యోగాలను కల్పించామన్నారు. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ది జరిగిందన్నారు. సాగు రంగంపై ఆధారపడి రైతులకు కిసాన్‌ సమ్మాన్‌తో చిన్న, సన్నకారు రైతులకు ఆదుకున్న ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన అయోధ్య రామాలయ నిర్మాణం నరేంద్రమోదీ హాయంలో జరిగిందన్నారు. మరోసారి నరేంద్రమోదీ ప్రభుత్వం అదికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అనంతరం మాజీ సర్పంచ్‌, బీజేపీ జిల్లా నాయకులు బింగి కరుణాకర్‌ మాట్లాడుతూ గ్రామంలో స్మశాన వాటిక నిర్మాణానికి 12.5 లక్షలు, డంపింగ్‌ యార్డుకు 2.5 లక్షలు, నర్సరీకి ఆరు లక్షలు, గ్రామీణ క్రీడా ప్రాంగణానికి లక్ష, ఉపాధి హామీ కింద ప్రతి ఏటా 20 లక్షలు, మరుగుదొడకు 14 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేశారన్నారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులతో ట్రాక్టర్‌ కొనుగోలు చేశామని, రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. అనంతరం దళిత బస్తీలో సహపంక్తి భోజనం చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పట్టణ అద్యక్షుడు గంగిశెట్టి రాజు, మండలాధ్యక్షుడు రాముల కుమార్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి వొడ్నాల విజయ్‌ చంద్రిక, నాయకులు పల్నేని దేవేందర్‌రావు, వినయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 12:20 AM