పోలీసు బదిలీలకు రంగం సిద్ధం
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:58 PM
కమిషనరేట్ వ్యాప్తంగా ఎస్‌ఐ, సీఐ, ఏసీపీల బదిలీలకు రంగం సిద్ధమవుతున్నది. 2023లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కమిషనరేట్ వ్యాప్తంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఎస్‌ఐ, సీఐ, ఏసీపీల బదిలీలు భారీగా జరిగాయి. ఆ బదిలీల్లో స్థానిక ప్రజాప్రతినిధులు వారికి నచ్చిన, అనుకూలంగా మెదిలే అధికారులు పైరవీలతో పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారు. ఇలాంటి పోస్టింగ్‌లలో భారీగా డబ్బులు చేతులు మారాయని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

కరీంనగర్ క్రైం, జూన్ 7: కమిషనరేట్ వ్యాప్తంగా ఎస్‌ఐ, సీఐ, ఏసీపీల బదిలీలకు రంగం సిద్ధమవుతున్నది. 2023లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కమిషనరేట్ వ్యాప్తంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఎస్‌ఐ, సీఐ, ఏసీపీల బదిలీలు భారీగా జరిగాయి. ఆ బదిలీల్లో స్థానిక ప్రజాప్రతినిధులు వారికి నచ్చిన, అనుకూలంగా మెదిలే అధికారులు పైరవీలతో పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారు. ఇలాంటి పోస్టింగ్‌లలో భారీగా డబ్బులు చేతులు మారాయని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ విధంగా పోస్టింగ్‌లు పొందిన పోలీసు అధికారులు కొందరు ఎన్నికల సమయంలో ఆ ఆమాత్యులకు అనుకూలంగా పనిచేసినట్లు ఎన్నికల సమయంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇందులో కొందరు అధికారులపై కొత్త ప్రభుత్వం వచ్చిన అనంతరం వేటుపడింది.
ఫ రెండేళ్ల గడువు ముగిసిన వారికి..
కరీంనగర్ పోలీస్‌కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం రెండేళ్ళ గడువు ముగిసిన మానకొండూర్, హుజురాబాద్, జమ్మికుంట రూరల్ ఎస్‌హెచ్‌ఓలతో పాటు పలువును సీఐ, ఏసీపీల బదిలీలు జరుగనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కరీంనగర్ అడిషనల్ డీసీపీ, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ, కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ పోస్ట్‌లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ఈ పోస్టులను భర్తీ చేయడంతోపాటు పలువురు పోలీసు అధికకారులు బదిలీలు జరుగనున్నట్లు తెలుస్తోంది. కమిషనరేట్‌లో 18 స్టేషన్లుండగా, ఇందులో 12 స్టేషన్లకు ఎస్‌ఐలు స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌లుగా, మరో 6 ఠాణాలకు సీఐలు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్నారు. కమిషనరేట్‌లో కరీంనగర్ టౌన్, కరీంనగర్ రూరల్, హుజూరాబాద్ పోలీస్ సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటికితోడుగా కరీంనగర్ ట్రాఫ్రిక్, సీసీఎస్, స్పెషల్‌బ్రాంచి, సీసీఆర్‌బీ, ఫంక్షనల్ వర్టికల్ విభాగానికి ఏసీపీలు అధికారులుగా ఉన్నారు. కమిషనరేట్‌లోని చాలా మంది సీఐ, ఏసీపీల సర్వీసు కాలం రెండేళ్లు పూర్తి కాలేదు. అయినా కొత్త ప్రభుత్వం పెద్ద ఎత్తున బదిలీలు చేసే అవకాశాలున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది.
ఫ సమర్థతకు ప్రాధాన్యం దక్కేనా?
ప్రభుత్వాలు మారినా సమర్థతకు ప్రాధాన్యం లేకుండా పోతున్నదని పోలీసుశాఖలోని కొందరు సీనియర్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా ప్రాధాన్యం కలిగిన పోస్టింగ్ లభిస్తుందని ఆశిస్తున్న అధికారులకు మళ్ళీ నిరాశే ఎదురవుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గత ప్రభుత్వ హయాంలో పైరవీలు లేకుంటే లూప్‌లైన్ పోస్టులకే పరిమితం అయిన పలువురు పోలీసు అధికారులు కొత్త ప్రభుత్వంలోనైనా తమకు ప్రాధాన్యం దక్కుతుందనే ఆశతో ఉన్నారు.
ఫ సీపీని బదిలీ చేయొద్దు..
- భూబాధితుల సంఘం నాయకులు
కరీంనగర్‌లో చాలా కాలంగా భూకబ్జాలు, దౌర్జన్యాలు, మోసాలు, బెదిరింపులకు పాల్పడుతున్న అక్రమార్కుల భరతం పడుతూ బాధితులకు న్యాయం చేస్తున్న సీపీని అభిషేక్ మొహంతిని ప్రభుత్వం బదిలీ చేయవద్దని, ఇక్కడే రెండేళ్లపాటు కొనసాగించాలని భూబాధితుల సంఘం నాయకులు కొత్త రాజిరెడ్డి ప్రభుత్వానికి, డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సామాన్యులకు న్యాయం చేస్తున్న సీపీని కొనసాగించి బాధితులకు న్యాయం చేయాలని సీఎం, డీజీపీలకు వినతిపత్రం అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ బదిలీల్లో భాగంగా కరీంనగర్ సీపీని కూడా బదిలీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో తాము డీజీపీ, సీఎంలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.