Share News

పని కల్పించాలని రోడ్డెక్కిన పవర్‌లూం నేత కార్మికులు

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:38 AM

నేతన్నలకు పని కల్పించాలని, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించాలని, ప్రభుత్వ అర్డర్లు తక్షణమే ఇవ్వాలంటూ సిరిసిల్ల నేత కార్మికులు రోడ్డెక్కారు.

పని కల్పించాలని రోడ్డెక్కిన పవర్‌లూం నేత కార్మికులు
సిరిసిల్లలో పవర్‌లూం కార్మికుల ర్యాలీ

సిరిసిల్ల, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): నేతన్నలకు పని కల్పించాలని, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించాలని, ప్రభుత్వ అర్డర్లు తక్షణమే ఇవ్వాలంటూ సిరిసిల్ల నేత కార్మికులు రోడ్డెక్కారు. బుధవారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం నుంచి సీఐటీయూ, పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ అసాముల సమన్వయ కమిటీ, అనుంబంధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, మహాధర్నా నిర్వహించారు. చేనేత విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్‌ చౌరస్తాకు చేరుకోని మానవహారంగా ఏర్పడ్డారు. ధర్నా నిర్వహించి ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర సంక్షోభాన్ని నివారించడంతో పాటు తక్షణమే బతుకమ్మ చీరలు, ప్రభుత్వ అర్డర్లు ఇవ్వాలని పెండింగ్‌ బకాయిలను సబ్సిడీ డబ్బులు, విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌లు మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. ఉపాధి లేక పవర్‌లూం కార్మికులు, అసా ములు వైపని, వార్పిన్‌ కార్మికులు, గుమస్తాలు, జాపర్లు, అనుబంధ రంగాల కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయించిందని వాటికి సంబంధించిన బకాయిలు, యారన్‌ సబ్సిడీ బకాయిలు చెల్లించలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినా టెస్కొకు చెల్లించాల్సిన రూ 482 కోట్లు చెల్లించలేదన్నారు. సిరిసిల్లకు రూ.200 కోట్లు బకాయిలు వెంటనే విడుదల చేయాలని అన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ పోరాటాలకు కలిసి రావాలన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కార్మికుల కోసం పార్లమెంట్‌లో ఒక్కసారైనా నోరు మెదపలేదని అన్నారు. పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, అసాముల సంఘం అధ్యక్షుడు సిరిసిల్ల రవి తదితరులున్నారు.

Updated Date - Feb 29 , 2024 | 12:38 AM