Share News

పొన్నం వ్యాఖ్యలు ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:39 PM

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోర్టులపై చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

పొన్నం వ్యాఖ్యలు ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే

కరీంనగర్‌, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోర్టులపై చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం కరీంనగర్‌ ఎంపీ కార్యాలయంలో హుస్నాబాద్‌ నియోజక వర్గంలోని అక్కన్నపేట మండలంలోని పలువురు మాజీ సర్పంచులు, బీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి 500 కోట్ల ఎలకో్ట్రరల్‌ బాండ్లు ఇస్తే శరత్‌చంద్రారెడ్డికి బెయిల్‌ వచ్చిందంటూ పొన్నం చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్నారు. న్యాయ స్థానాలపై, చట్టాలపై నమ్మకం లేకుండా మంత్రి హోదాలో కోర్టును కించపరచడంపై న్యాయపరంగా ముందకు వెళ్తామన్నారు. ఈ విషయమై జాతీయ పార్టీ దృష్టికి తీసుకు వెళుతామన్నారు. కోర్టుకు సైతం అవినీతిని అపాదించడం క్షమించరాని నేరమన్నారు. కోర్టులపై, చట్టాలపై వాళ్లకు గౌరవం లేదన్నారు. ఎంతో మంది కాంగ్రెస్‌ నాయకులు జైలుకు వెళ్లి బెయిల్‌ తెచ్చుకున్నారన్నారు. అంత మాత్రాన కోర్టుపై అబాంఢాలు వేస్తారా అని ప్రశ్నించారు. జాతీయ పార్టీకి దృష్టికి తీసుకువెళ్లి న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్వింటాలుకు వరికి 500 బోనస్‌ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ హామీ ఏమైందన్నారు. క్వింటాలుకు 500 బోనస్‌ ఇస్తే ఎకరాకు 14 వేల రూపాయలు బోనస్‌ ఇవ్వాలన్నారు. తాలు, తరుగు, తేమతో పనిలేకుండా వడ్లు కొంటామని చెప్పి క్వింటాలుకు 8 కిలోల తరుగు తీస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. రైతలుకు 2 లక్షల రుణమాఫీ అగస్టులో చేస్త్తామంటే నమ్మేదెవరన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో సర్పంచుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆత్మహత్యలకు సిద్ధమయ్యారన్నారు. బిల్లులు రాక సర్పంచుల ఆవేదనను గమనించి వారి పక్షాన పోరాటం చేశామన్నారు. సర్పంచులు సమస్యలపై అప్పటి సీఎం, ప్రస్తుత సీఎంలకు లేఖలు రాశామన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి విషయంలో బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌కు ఏమీ తేడా లేదన్నారు. మోదీ ప్రభుత్వం పంచాయతీలకు నిధులివ్వడం వల్లే పంచాయతీ సిబ్బందికి జీతాలివ్వగలుగుతున్నారన్నారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధిని చూసి తాజా మాజీ సర్పంచులు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశానికి అతి పెద్ద పండుగ పార్లమెంట్‌ ఎన్నికలే అన్నారు. పోలింగ్‌ సరళి పరిశీలిస్తే బీజేపీ ఊహించినదానికంటే ఎక్కువ స్థానాల్లో గెలువబోతున్నామని తేలిపోయిందన్నారు. దేశమంతా నరేంద్ర మోడి గాలి వీస్తుందని, బీజేపీకి 370కి పైగా సీట్లు రావడం ఖాయమైపోయిందని, ఎన్డీఏ కూటమికి 400 స్థానాలకంటే ఎక్కువ రావడం తథ్యమన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చాలా చోట్ల డిపాజిట్లు గల్లంతు కాబోతున్నాయన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 20 మంది టచ్‌లో ఉన్నారని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్‌ అంటున్నారని, బీఆర్‌ఎస్‌ నుండి 25 మందికిపైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని బీఆర్‌ఎస్‌ దుకాణం మూతపడటం ఖాయమని సీఎం అంటున్నాడన్నారు. ఈ రెండు పార్టీలు కూల్చడమే పనిగా పెట్టుకున్నారన్నారు. రైతుల కోసం బీఆర్‌ఎస్‌ పార్టీపై నిరంతరం బీజేపీ పోరాటం చేసిందన్నారు.

ఫ హుస్నాబాద్‌లో పిచ్చాసుపత్రిని ఏర్పాటు చేయాలి

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని ఈ ప్రాంతంలో ఒక పిచ్చాసుపత్రి ఏర్పాటు చేయాలని బండి సంజయ్‌కు తాజా మాజీ సర్పంచులు వినతిపత్రం అందించారు. మంత్రి మాదిరిగానే కాంగ్రెస్‌ నాయకులు మితిమీరి మాట్లాడుతున్నారని, హుస్నాబాద్‌లో ప్రాంతంలో ఒక పిచ్చి ఆసుపత్రి ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని వినతిపత్రంలో కోరారు. హుస్నాబాద్‌ నియోజక వర్గంలోని అక్కన్నపేట మండలానికి చెందిన తాజా మాజీ సర్పంచులు, బీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. బీజేపీలో చేరుతున్న నాయకులకు బండి సంజయ్‌కుమార్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - Apr 19 , 2024 | 11:39 PM