Share News

దేవుళ్ల పేరిట రాజకీయాలా?

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:45 PM

దేవుళ్లను అడ్డుపెట్టుకొని బీజేపీ, కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తున్నాయని, బండి సంజయ్‌ కరీంనగర్‌ అభివృద్ధికి ఒక్క పైసా తేలేదని, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కే ఢిల్లీలో కొట్లాడే సత్తా ఉందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు.

దేవుళ్ల పేరిట రాజకీయాలా?
కోనరావుపేట రోడ్‌షోలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేటీఆర్‌

కోనరావుపేట, ఏప్రిల్‌ 25: దేవుళ్లను అడ్డుపెట్టుకొని బీజేపీ, కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తున్నాయని, బండి సంజయ్‌ కరీంనగర్‌ అభివృద్ధికి ఒక్క పైసా తేలేదని, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కే ఢిల్లీలో కొట్లాడే సత్తా ఉందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి గురువారం రాత్రి రోడ్‌షోలో మాట్లాడారు. 15 ఆగస్టు వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్టు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తానని భార్యాపిల్లలపై ఒట్టు వేయాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు. మహిళలకు రూ.2500, కల్యాణలక్ష్మితో తులం బంగారం, రూ.2 లక్షల రుణమాఫీ, పెన్షన్‌ రూ.4 వేలు వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పటికే పెన్షన్‌ ఒక నెల ఎగ్గొట్టారన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో 24 గంటల ఉచిత కరెంట్‌ అందజేశామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కరెంట్‌ పోవడం, ప్రాజెక్టులను ఎండబెట్టడం, సాగునీరు ఇవ్వకపోవడం వంటివి చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పాలిచ్చె బర్రెను అమ్ముకొని దున్నపోతును తెచ్చుకున్నట్లయ్యిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 150 రోజులు గడిచినా ఏ ఒక్క పథకం అమలు కావడం లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన రైతుబంధును ఇవ్వనోడు రూ.2 లక్షల రుణమాఫీ ఎలా చేస్తారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారని, ప్రజల ఆదాయం డబుల్‌ చేస్తానని ఏం చేశారని అన్నారు. బుల్లెట్‌ రైళ్లు తెస్తానన్నాడని, ఏమైందని ప్రశ్నించారు. కరీంనగర్‌ ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌ కరీంనగర్‌కు ఏం తెచ్చారో చెప్పాలన్నారు. బండి సంజయ్‌ చేసిన అభివృద్ధి చెప్పమంటే జైశ్రీరాం అంటారన్నారు. ఢిల్లీలో పెద్దోడు మోదీ, చిన్నోడు బండి సంజయ్‌ దేవుళ్లను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాదగిరి గుట్టను అభివృద్ధి చేశారని, దేవుళ్లను అడ్డుపెట్టుకొని తాము ఓట్లు అడగబోమని అన్నారు. మళ్లీ కేసీఆర్‌ రావాలంటే 12 ఎంపీ సీట్లు గెలిపించాలన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ మళ్లీ ఏడాదిలో అధికారంలోకి వస్తుందన్నారు. చీకటి ఉన్నప్పుడే వెలుగు విలువ తెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌ వచ్చింది నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన దొంగ హామీలకు ప్రజలు మోసపోయారని, రైతులకు క్వింటాల్‌ ధాన్యానికి రూ.500 బోనస్‌ ఎప్పుడిస్తారన్నారు. ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి వినోదన్నను గెలిపించాలని, కరీంనగర్‌ సత్తాను చాటాలని కోరారు.

అనంతరం ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ 2014లో హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట వరకు రైలు మార్గాన్ని తీసుకొచ్చా మన్నారు. త్వరలోనే సిరిసిల్ల, వేములవాడకు పూర్తవుతుందన్నారు. తన హయాంలో కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీగా మార్చామన్నారు. బండి సంజయ్‌ ధర్మం.. ధర్మం అంటూ అభివృద్ధిని విస్మరించారన్నారు. ఎంపీగా ఐదేళ్ల కాలంలో రూ.5 కూడా తీసుకురాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఉపాధి హామీ నిధులు తమవేనని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కోనరావుపేట మండలం మల్కపేటలో ప్రాజెక్టును నిర్మించి మూడు టీఎంసీల నీటిని తీసుకొచ్చినట్లు చెప్పారు. రోడ్లకు వంతెనల కోసం నిధులు తెచ్చామన్నారు. మల్కపేటలో చల్మెడ కుటుంబసభ్యులు రూ.6 కోట్లతో రామాలయాన్ని, రూ.2కోట్ల సొంత నిధులతో పాఠశాలను నిర్మించడం అభినందనీయమన్నారు. బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ ఎంపీగా పనిచేసిన వినోద్‌ కుమార్‌, బండి సంజయ్‌ పాలనలో ఎవరు ఎంత అభివృద్ధి చేశారన్నది ప్రజలు గ్రహించాలన్నారు. ఎంపీ బండి సంజయ్‌ ఐదేళ్ల పాలనలో ఎలాంటి నిధులూ తీసుకురాలేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, సెస్‌ వైస్‌ చైర్మన్‌ తిరుపతి, ప్యాక్స్‌ చైర్మన్లు బండ నర్సయ్య, రామ్మోహన్‌రావు, రాఘవరెడ్డి, రమణారెడ్డి, మంతెన సంతోష్‌, గోపు పర్శరాములు, అవురం శరత్‌, గెంటే శ్రీనివాస్‌, కాశవేణి మహేష్‌, తాళ్లపెళ్లి సతీష్‌, వంగపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:45 PM