Share News

కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తి

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:26 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతుందని బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ ఆరోపించారు.

కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తి

మంథని, ఏప్రిల్‌ 16: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతుందని బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ ఆరోపించారు. స్థానిక ఎస్‌ఎల్‌బీ గార్డెన్స్‌లో జడ్పీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్ట మధు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహాక సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలు చేసిన అధికారంలోకి వచ్చాక హామీలను అమలుచేయక మోసం చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 15వ తేదీ వరకు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ ప్రజలను మోసం చేసేలా ప్రకటిస్తోందన్నారు. సింగరేణి కార్మికుడిగా, ఉద్యమనేతగా ఈ ప్రాంతం.. ఈ మట్టితో ఎంతో అనుబంధం ఉన్న వ్యక్తి తాను అని అన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవలందించానన్నారు. మీ కష్టాలు తెలిసిన వ్యక్తిగా మీ ముందుకు వస్తున్న ఓటుతో ఆశీర్వదించండి అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. ఈ నెల 19వ తేదీన తాను పెద్దపల్లిలో నామినేషన్‌ వేస్తున్నానని, నామినేషన్‌ దాఖలు ప్రకియకు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరవుతున్నారన్నారు. జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జక్కు రాకేష్‌, తగరం సుమలత, శంకర్‌లాల్‌, రాచకొండ లక్ష్మి, ఏగోలపు శంకర్‌గౌడ్‌, నాగెల్లి సాంబయ్య, పొతిపెద్ది కిషన్‌రెడ్డి, రాజిరెడ్డి, గీతాబాయి, మబ్బు ఓదెమ్మ, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 12:26 AM