Share News

పంచాయతీలకు నిధుల కొరత

ABN , Publish Date - May 23 , 2024 | 12:51 AM

గ్రామ పంచాయతీలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వారికి నిధులు విధుల కెటాయింపుల విషయంలో స్పష్టత లేక పోవడంతో పల్లెలో పాలన పడకేసింది.

పంచాయతీలకు నిధుల కొరత

- సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో గ్రామ పంచాయతీలు

- పడకేసిన పల్లె పాలన...కార్యదర్శులకు తప్పని తిప్పలు

కరీంనగర్‌ రూరల్‌/హుజూరాబాద్‌ రూరల్‌, మే 22: గ్రామ పంచాయతీలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వారికి నిధులు విధుల కెటాయింపుల విషయంలో స్పష్టత లేక పోవడంతో పల్లెలో పాలన పడకేసింది. దీంతో కనీసం గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడంలో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో పనిభారం మొత్తం పంచాయతీ కార్యదర్శులపై పడుతోంది. కరీంనగర్‌ రూరల్‌ మండలంలో 17గ్రామ పంచాయతీలు ఉండగా ప్రతీ గ్రామానికి ఒక కార్యదర్శిని నియమించింది. ఈ యేడాది ఫిబ్రవరి 1వ తేది నుంచి సర్పంచ్‌ల పదవి కాలం ముగియడంతో స్పెషల్‌ ఆఫీసర్ల పాలన మొదలైంది. మండలంలో క్లస్టర్‌ గ్రామాలుగా ఎంపిక చేసి 10 మంది ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం , స్టేట్‌ పైనాన్స్‌ ఇచ్చే నిధులు ముఖ్యమైన ఆర్థిక ఆదారాలు కాగా 2022 ఆగస్టు నుంచి ఎస్‌ఎఫ్‌సీ నిధులు రావడం లేదు. జనాభాకు అనుగుణంగా ఒక్కొక్కరికి 812 రూపాయల చొప్పున 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయాల్సి ఉండగా అవికూడా రాకపోవడంతో పాలన సాగడం లేదు. దీంతో మేజ ర్‌ గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నులు వసూలు కావడంతో జీతాలు సమకూరుతున్నాయి. చిన్న గ్రామ పంచాయతీలకు తిప్పలు తప్పడం లేదు. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. మండలంలో 17 గ్రామ పంచాయతీల్లో 103 మంది సిబ్బంది పని చేస్తున్నారు. బొమ్మకల్‌లో ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో 38 మంది పని చేస్తున్నారు. బొమ్మకల్‌, నగునూర్‌, దుర్శేడ్‌, గోపాల్‌పూర్‌, చామనపల్లి వంటి గ్రామాల్లో సమకూరిన నిధులతో జీతాలు ఇస్తున్నారు. మిగతా తొమ్మిది గ్రామాల్లో జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. పంచాయతీ సాధారణ నిధులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీఎఫ్‌సీ, ఎస్‌ఎఫ్‌సీ, పీఎంఎస్‌ నిధులు జనాభా ప్రతిపాదికన ప్రతి నెల రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు మంజూరయ్యేవి. గ్రామాల్లో వసూలైన ఇంటి పన్నుతో కొన్ని గ్రామాల్లో జీతాలు ఇస్తున్నారు. చిన్న గ్రామ పంచాయతీల్లో మాత్రం జీతాలు ఇవ్వడం కష్టతరంగా మారింది.

ఫ మూడు ఖాతాలు ఖాళీ

గ్రామ పంచాయతీల్లో మూడు రకాల ఖాతాలు ఉంటాయి. ఒకటి ఆస్తి పన్నులు జమ చేసుకునే ఖాతా.. గ్రామాల్లో ఆస్తి పన్ను అంతంత మాత్రంగానే వసూలు అవుతున్నాయి. ఖర్చు నాలుగింతలు ఉండడంతో అవి ఎప్పుడూ ఖాళీగానే ఉంటాయి. రెండోది ఎస్‌ఎఫ్‌సీ (స్టేట్‌ పైనాన్స్‌ కార్పొరేషన్‌) ఖాతా.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక గ్రాంట్లు జమ చేస్తారు. ఈ రెండు ఖాతాల్లో జమయ్యే మొత్తం ట్రేజరీ ద్వారా డ్రా చేయాల్సి ఉంటుంది. మూడోది 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబందించినది. కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు గ్రామ జనాభా ఆధారంగా నిధులు అందజేస్తుంది. ప్రతి నాలుగు నెలలకు ఓసారి ఈ నిఽధలు విడుదల చేస్తుంది. ఈ నిధులు మాత్రమే పంచాయతీలకు అందుతుండగా వాటిని ప్రత్యేక సూచనల మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. స్టేట్‌ పైనాన్స్‌ నిధులు రెండేళ్లుగా అందడం లేదు. నిబంధనల మేరకు ఖర్చు చేయని నిధులు ఆయా ఖాతాల్లో మిగిలిపోగా, మార్చిలో వాటిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

ఫ ఖర్చులకు ఇబ్బందులు

గ్రామపంచాయతీల్లో ట్రాక్టర్‌ కిస్తీల చెల్లింపు, కార్మికుల వేతనాలు, తాగునీటి సరఫరా నిర్వహణ, విద్యుత్‌ చార్జీల చెల్లింపు, పారిశుధ్యం తదితర పనుల కోసం నిధులు అందకపోవడంతో గ్రామపంచాయతీల నిర్వహణ ఇబ్బందిగా మారుతుండడంతో గ్రామపంచాయతీ కార్యదర్శులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సమస్యలను ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. మేం తాత్కాలికం, నిధులు ఎలా సమకూర్చుకోవాలో మీకే తెలియాలి. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే ముందు మీరే తీసుకోవచ్చు. గ్రామంలోనే ఎవరితోనై సర్దుబాటు చేయండి అంటూ సలహాలు ఇస్తూ తప్పించుకుంటున్నారని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల్లో నాలుగు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఆందోళనకు సిద్దమవుతున్నారు.

ఫ ప్రజలకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నాం

- టి సునీత, ఎంపీడీవో, హుజూరాబాద్‌

గ్రామాల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా స్థాయి, మండల స్థాయిలో అధికారులకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రత్యేక అధికారులకు అవగాహన కల్పించాం. తాగునీటి సరఫరా విభాగం అధికారులు సైతం దృష్టి సారిస్తున్నారు. కలెక్టర్‌ ద్వారా విడుదలయ్యే నిధుల ద్వారా కొన్ని నిధులను గ్రామపంచాయతీలకు వినియోగిస్తుండగా, పంచాయతీలకు వచ్చే ప్రత్యేక నిధుల ద్వారా పనులు చేపడుతున్నాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.

ఫ పంచాయతీలపై భారం పడుతోంది..

- సీహెచ్‌ జగన్మోహన్‌రెడ్డి, కరీంనగర్‌ రూరల్‌ ఎంపీవో

గ్రామ పంచాయతీల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు సమకూరక పోవడం, 15వ ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో గ్రామ పంచాయతీలపై ఆర్థిక బారం పడుతోంది. దీంతో జీతాలు ఇవ్వలేకపోతున్నాం. గ్రామ పంచాయతీల్లో ఉన్న నిధులను మొదటి ప్రాధాన్యంగా జీతాలు చెల్లిస్తున్నాము. ఎనిమిది పెద్ద పంచాయతీల్లో జీతాల సమస్యలేదు. తొమ్మిది చిన్న గ్రామ పంచాయతీల్లో నిధుల్లేక కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదు.

Updated Date - May 23 , 2024 | 08:53 AM