Share News

గోదావరి శుద్ధికి కార్యాచరణ

ABN , Publish Date - May 26 , 2024 | 12:55 AM

వ్యర్థ జలాలతో కలుషితం అవుతున్న పవిత్ర గోదావరిని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. గోదావరి జలాలు పూర్తి స్థాయిలో కలుషితం అయ్యాయని, స్నానం చేసేందుకు కూడా పనికి రాకుండా ఉన్నాయని కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదికలతో వెంటనే ఎస్‌టీపీల నిర్మాణం చేపట్టాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

గోదావరి శుద్ధికి కార్యాచరణ
నాళాలో ప్రవహిస్తున్న మురికి నీరు

- రూ.256కోట్లతో రామగుండంలో ఎస్‌టీపీల నిర్మాణం

- ఆధునిక ఎస్‌బీఆర్‌ టెక్నాలజీతో ఏర్పాటు

- మూడేళ్ల పాటు నిర్వహణకు రూ.46కోట్ల నిధులు

- స్థలాలు సమకూర్చాలని సింగరేణికి ప్రజారోగ్యశాఖ లేఖలు

కోల్‌సిటీ, మే 25: వ్యర్థ జలాలతో కలుషితం అవుతున్న పవిత్ర గోదావరిని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. గోదావరి జలాలు పూర్తి స్థాయిలో కలుషితం అయ్యాయని, స్నానం చేసేందుకు కూడా పనికి రాకుండా ఉన్నాయని కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదికలతో వెంటనే ఎస్‌టీపీల నిర్మాణం చేపట్టాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీనికి రెండేళ్ల కాలపరిమితి పెట్టింది. గోదావరి కాలుష్య నివారణకు కేంద్ర ప్రభుత్వం అమృత్‌ పథకంలో నిధుల కేటాయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గోదావరి జలాల కాలుష్య నివారణ పథకాన్ని రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా గోదావరినదిలో పారిశ్రామిక వ్యర్థాలు కలిసే రామగుండంలో రూ.256కోట్లతో ఎస్‌టీపీలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు రామగుండం, పాములపేట, మల్కాపురం, జనగామ, అల్లురు వాగు ప్రాంతాల్లో ఎస్‌టీపీలను నిర్మించనున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమలు, నివాస ప్రాంతాతల నుంచి వెలుబడే వ్యర్థాలను శుద్ధి చేసి గోదావరినదిలోకి పంపించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. దీనికి గాను ఐదు చోట్ల ఆధునిక సీక్వెన్సీ బ్యాచ్‌ రియాక్టర్‌(ఎస్‌బీఆర్‌) పద్ధతిలో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను నిర్మించనున్నారు. 33.5ఎంఎల్‌డీ వ్యర్థ జలాలను శుద్ధిచేసే సామర్థ్యంతో ఈ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో పనులు మొదలవుతున్నాయి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. మల్కాపురం, రామగుండంలలో భూములు అందుబాటులో ఉన్నాయి. మల్కాపురంలో మొదటి దశలో 21ఎంఎల్‌డీల సీవరేట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. గతంలో గోదావరి జలాల కాలుష్య నివారణ పథకం కింద నిర్మించిన ఎస్‌టీపీలకు ప్రైవేట్‌ భూములను కొనుగోలు చేసి మున్సిపల్‌కు అప్పగించారు. ఇక్కడ భూములు అందుబాటులో ఉన్నాయి. రామగుండంలో నాలుగు ఎంఎల్‌డీల సామర్థ్యతో ఎస్‌టీపీని ఏర్పాటు చేస్తారు. రామగుండం దిగువన విలేజి రామగుండం ప్రాంతంలో పాముల పేటలో 1ఎంఎల్‌డీ సామర్థ్యంగల ఎస్‌టీపీని ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఎకరం స్థలం అవసరం అవుతుందని సింగరేణికి లేఖ రాశారు. అలాగే యైుటింక్లయిన్‌కాలనీలో జల్లారం వాగు సమీపంలో 6ఎంఎల్‌డీల సామర్థ్యంలో ఎస్‌టీపీలను నిర్మించనున్నారు. ఇక్కడ రెండు ఎకరాలు అవసరం అవుతుంది. ఇది సింగరేణి ప్రాంతం కావడంతో స్థలం కేటాయించాలని సింగరేణికి లేఖ రాశారు. గోదావరిఖనిలోని ఫైవింక్లయిన్‌, కూరగాయాల మార్కెట్‌ నాలాల నుంచి వెలువడే వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు 2ఏ గని సమీపంలో రూ.15కోట్లతో సింగరేణి సంస్థ 17ఎంఎల్‌డీ సామర్థ్యం గల ఎస్‌టీపీని నిర్మించింది. నీటిని శుద్ధిచేసి జనగామ చెరువులోకి పంపనున్నారు. మరో రెండు నెలల్లో ఈ ఎస్‌టీపీని ప్రారంభించనున్నారు. జనగామ చెరువులో నుంచి వెలువడే నీటిని సైతం శుద్ధి చేసేందుకు జనగామ చెరువు కింద 1.5ఎంఎల్‌డీల సామర్థ్యంతో ఒక ఎకరం స్థలంలో ఎస్‌టీపీని ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఒక ఎకరం స్థలం అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రైవేట్‌ పట్టాదారుల నుంచి భూసేకరణ చేయాల్సి ఉంది.

ఫ సుందిళ్ల బ్యారేజీలో నీరంతా కలుషితం..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిళ్ల బ్యారేజీలో నిల్వ ఉంచిన నీరు కలుషితమవుతోంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి ప్రతి రోజు 50ఎంఎల్‌డీల వ్యర్థ జలాలు సుందిళ్ల బ్యారేజీలో కలుస్తున్నాయి. దీంతో నీరు నిల్వ ఉండి ప్రవాహం లేక జలాలు దుర్గంధభరితమవుతున్నాయి. పంపింగ్‌ సమయంలో ఈ వ్యర్థ జలాలనే ఎల్లంపల్లికి రివర్స్‌ పంపింగ్‌ చేస్తున్నారు. తద్వారా ఎల్లంపల్లి నుంచి మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు మిషన్‌ భగీరథతో పాటు హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ వర్క్స్‌కు సరఫరా అయ్యే జలాల్లో సూక్ష్మమైన బ్యాక్టీరియా ఉంటున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.

ఫ నదిలోకి శుద్ధ జలాలను వదిలేందుకు..

గోదావరినదిలోకి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని కాలనీలతో పాటు ఆర్‌ఎఫ్‌సీఎల్‌, సింగరేణి, ఎన్‌టీపీసీ, జెన్‌కో పరిశ్రమల నుంచి వ్వర్థ జలాలు నదిలో కలుస్తున్నాయి. ప్రస్తుతం రోజూ 40ఎంఎల్‌డీల వ్యర్థ జలాలు కలుస్తున్నట్టు లెక్కలు కడుతున్నారు. 50ఎంఎల్‌డీల సామర్థ్యంతో ఎస్‌టీపీలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే సింగరేణి సంస్థ 17ఎంఎల్‌డీల సామర్థ్యంతో ఎస్‌టీపీని నిర్మించింది. అమృత్‌ పథకంలో ప్రభుత్వం 33.5ఎంఎల్‌డీల సామర్థ్యంగల ఐదు ఎస్‌టీపీలను నిర్మించి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు అప్పగించనున్నది. గోదావరిలో కలుషిత జలాలు కలువకుండా కేవలం శుద్ధి చేసిన జలాలు మాత్రమే కలిసేలా కార్యాచరణను సిద్ధం చేశారు.

ఫ మూడేళ్ల పాటు నిర్వహణ

ప్రభుత్వం రామగుండంలో 255.82కోట్లతో చేపట్టిన ఎస్‌టీపీల నిర్మాణాలకు సంబంధించి నిర్వహణను పరిగణనలోకి తీసుకున్నారు. గతంలో ఎస్‌టీపీలు నిర్మించి నిర్వహణ లేకపోవడంతో ప్రయోజనాలు నెరవేరలేదు. ఈసారి ఎస్‌టీపీల నిర్మాణంతో పాటు మూడేళ్ల పాటు సదరు కాంట్రాక్టు సంస్థనే నిర్వహణ చేసేలా ప్రణాళికలు చేశారు. అంతేకాకుండా కోటి రూపాయలతో సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ విద్యుత్‌ను ఎస్‌టీపీ అవసరాలకు వినియోగించనున్నారు.

Updated Date - May 26 , 2024 | 12:55 AM