Share News

మిగిలింది నాలుగు రోజులే

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:48 AM

రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్న నేపథ్యంలో పారదర్శకత పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందు కోసం రేషన్‌ షాపుల్లో ఎలక్ర్టానిక్‌ నో యువర్‌ కస్టమర్‌ (ఈ కేవైసీ) నమోదు ప్రక్రియను ప్రారంభించింది.

 మిగిలింది నాలుగు రోజులే

- 31తో ముగియనున్న రేషన్‌ లబ్ధిదారుల ఈకేవైసీ గడువు

- జిల్లాలో ఇప్పటి వరకు 77.10 శాతం పూర్తి

- గడువులోగా పూర్తి కాకుంటే రేషన్‌తొలగిస్తారా?

- జిల్లాలో 1,73,768 కార్డులు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్న నేపథ్యంలో పారదర్శకత పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందు కోసం రేషన్‌ షాపుల్లో ఎలక్ర్టానిక్‌ నో యువర్‌ కస్టమర్‌ (ఈ కేవైసీ) నమోదు ప్రక్రియను ప్రారంభించింది. ఆహారభద్రత కార్డుల్లోని కుటుంబసభ్యుల వివరాలను ఈ కేవైసీ ద్వారా అనుసంధానం చేసుకోవాలి. ఇప్పటికే రేషన్‌ కార్డుల్లో పేర్లు ఉన్న కుటుంబసభ్యుల నుంచి రేషన్‌ షాపుల్లో బయో మెట్రిక్‌ ద్వారా ఈ కేవైసీ చేస్తున్నారు. దీంతో విదేశాల్లో ఉన్నవారితో పాటు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారి వివరాలు వెల్లడి కానున్నాయి. వారిని అనర్హులుగా గుర్తించి రేషన్‌ బియ్యం నిలిపివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జిల్లాలో ఈ కేవైసీ ప్రక్రియ నత్తనడకనే సాగుతోంది. గడువు ఈనెల 31తో ముగియనుండడంతో ఉండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో 77.10 శాతం పూర్తి

జిల్లాలో 13 మండలాల్లో ఇప్పటి వరకు 77.10 శాతం మాత్రమే రేషన్‌ లబ్ధిదారులు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. 345 రేషన్‌ దుకాణాల ఉండగా 1,73,768 కార్డులు, 4,97,566 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో 13,685 అంత్యోదయ కార్డులకు 36,546 మంది లబ్ధిదారులు, 15,98,76 అహార భద్రత కార్డులకు 4,60,810 మంది లబ్ధిదారులు, 207 అన్నపూర్ణ కార్డులకు 210 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 1.73 లక్షల కార్డుల్లోని లబ్ధిదారుల్లో 3,83,622 మంది కేవైసీ చేయించుకున్నారు. జాతీయ ఆహారభద్రత కార్డుల లబ్ధిదారులు 2,81,731 మంది, రాష్ట్ర ఆహార భద్రత కార్డులకు సంబంధించి లబ్ధిదారులు 1,01,891 మంది ఈ కేవైసీ చేయించుకున్నారు.

ఆధార్‌ అప్‌డేట్‌తో ఇబ్బందులు

జిల్లాలో రేషన్‌ లబ్ధిదారులకు ఆధార్‌ అప్‌డేట్‌ ఇబ్బందిగా మారింది. రేషన్‌ కార్డు, ఈ కేవైసీ పూర్తి కావాలంటే ఆధార్‌ అప్‌డేట్‌ లేకపోవడంతో మీ సేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. కొందరి వేలిముద్రలు రాకపోవడం, ఐరిస్‌ తదితర వివరాలు నమోదు లేకపోవడం, పుట్టిన తేదీలు, చిరునామాల మార్పులు, ఫోన్‌ నంబర్లు లింక్‌ కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదార్‌ అప్‌డేట్‌తో కూడా ఈ కేవైసీ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ-కేవైసీ నమోదు ఇలా

జిల్లాలో రేషన్‌ కార్డు కలిగిన కుటుంబ యజమానితో పాటు కార్డులో ఉన్న సభ్యులందరూ తమకు సమీపంలోని రేషన్‌ డీలర్‌ వద్దకు వెళ్లి ఈ-పాస్‌ యంత్రం ద్వారా వేలిముద్రలు వేయాలి. వేలిముద్ర వేయడంతోనే రేషన్‌ కార్డు నంబరుతోపాటు సభ్యుల ఆధార్‌ నంబరు చూపిస్తుంది. వీరిని సరిచూసిన తరువాత ఆకుపచ్చ రంగు లైట్‌ వచ్చి సభ్యుల కేవైసీ పునరుద్ధరణ పూర్తవుతుంది. ఈ-పాస్‌ యంత్రంలో ఎరుపు రంగు లైట్‌ వెలిగితే రేషన్‌ కార్డు, ఆధార్‌ సరిగా పోల్చుకోలేక పోవడంతో రిజెక్ట్‌ చూపిస్తుంది. దీంతో ఒక యూనిట్‌ రేషన్‌ కార్డు నుంచి తొలగిస్తారు. వేలిముద్రలు వేయని వారి యూ నిట్లు తొలగిపోతాయి.

Updated Date - Jan 28 , 2024 | 12:48 AM