మున్సిపల్ దుకాణాలపై అధికారుల కొరఢా
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:52 PM
నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాల్లో అద్దె బకాయిలను చెల్లించకుండా, లీజు అగ్రిమెంట్ దాటినా కూడా మడిగెలను ఖాళీ చేయకుండా తిష్టవేసిన దుకాణదారులపై ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు కొరఢా ఝళిపిం చారు.

కరీంనగర్ టౌన్, జూలై 5: నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాల్లో అద్దె బకాయిలను చెల్లించకుండా, లీజు అగ్రిమెంట్ దాటినా కూడా మడిగెలను ఖాళీ చేయకుండా తిష్టవేసిన దుకాణదారులపై ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు కొరఢా ఝళిపిం చారు. మున్సిపల్ నిధులతో నగరంలోని కూరగాయల మార్కెట్, మున్సిపల్ కార్యాలయం, రూరల్ పోలీసుస్టేషన్ సమీపంలో వాణిజ్య సముదాయాలను నిర్మించి బహిరంగ వేలంలో ఆయా దుకాణాలను అద్దెకు ఇచ్చారు. అయితే రాజీవ్‌గాంధీ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్సు, కూరగాయల మార్కెట్‌లోని దుకాణాల 30 సంవత్సరాల లీజు అగ్రిమెంట్ పూర్తికావడంతో మూడు నెలల క్రితం టెండర్లు నిర్వహించారు. టెండర్లలో దుణాకాలను దక్కించుకున్న వారికి మడిగెలను ఖాళీ చేయించి ఇవ్వాల్సిన బాధ్యత నగరపాలక సంస్థకు ఉంటుంది. దీనితో టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే లీజు అగ్రిమెంట్ పూర్తయి నందున తిరిగి టెండర్లను నిర్వహించామని, అద్దె బకాయిలేమైనా ఉంటే వాటిని వెంటనే చెల్లించి దుకాణాలను ఖాళీ చేయాలంటూ లీజు దుకాణదారులకు నోటీసులు జారీ చేశారు. దాదాపు 60 లక్షల మేరకు అద్దె బకాయిలుండడంతో వారిపై బకాయిలను చెల్లించాలంటూ చట్టప్రకారంగా ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రావడం, అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు. నోటీసులు ఇవ్వడంతో ఒకరిద్దరు అద్దె బకాయిలు చెల్లించగా మిగిలిన వారు అద్దె బకాయిలు ఇవ్వకపోగా దుకాణాలను నడిపించుకుంటున్నారు. మరోవైపు టెండర్లలో మడిగెలను దక్కించుకున్న వారికి మడిగెలను అప్పగించాలని అధికారులను కోరుతున్నారు. ఇటీవల మున్సిపల్ ఇంచార్జి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ నగరపాలక సంస్థలో ఒక్కో విభాగంపై ప్రత్యేక దృష్టిసా రించారు. పెరుగుతున్న ఖర్చులకు అనుణుగుణంగా అదనపు ఆదాయాలపై, బకాయిలపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో శుక్రవారం డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి వాణిజ్య సముదాయాలకు సంబంధించిన అద్దెబకాయిల వివరాలను తెలుసుకొని వెంటనే వారిపై చర్య తీసుకోవాలని ఆదేశించారు. దీనితో మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ సిహెచ్.ఆంజనేయులు ఆధ్వర్యంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఎండి.రషీద్, ఎస్.శ్రీకాంత్, ఎండి.ఖలీల్, ఆర్.బాబు, డీఆర్‌ఎస్ సిబ్బం దితో కలిసి లీజు అగ్రిమెంట్ పూర్తయినందున బకాయిలు చెల్లించి వెంటనే ఖాళీ చేయాలని దుకాణదారులకు సూ చించారు. రాజీవ్‌గాంధీ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్సులో ఆరు దుకాణాలు, కూరగాయల మార్కెట్ సమీపంలోని 14 దుకాణాలకు తాళాలు వేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఆఫీసర్ ఆంజనేయులు మాట్లాడుతూ ముగ్గురు దుకాణ దారులు దాదాపు 30 లక్షల మేరకు అద్దెబకాయిలు చెల్లించాల్సి ఉందని, మొత్తం 20 దుకాణాలకు సంబంధించి 60 లక్షల అద్దె బకాయిలు నగరపాలక సంస్థకు చెల్లించాల్సి ఉందని అన్నారు. అద్దెబకాయిలను చెల్లించాలంటూ పలుమార్లు నోటీసులు అందించినా వారు చెల్లించకపోవడం, లీజు అగ్రిమెంట్ 30 ఏళ్లు పూర్తయినవారు దుకాణాలను ఖాళీ చేయకపోవడంతో కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు 20 దుకాణాలకు తాళం వేసి సీజ్ చేశామని చెప్పారు. మున్సిపల్‌కు చెల్లించాల్సిన పన్ను బకాయిలన్నిటినీ వసూలు చేస్తున్నామని, లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.