Share News

నేటి నుంచి నామినేషన్లు

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:47 PM

లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. దీని కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఏప్రిల్‌ 18 నుంచి 25వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు.

నేటి నుంచి నామినేషన్లు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. దీని కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఏప్రిల్‌ 18 నుంచి 25వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఉపసంహరణ అనంతరం తుది జాబితాను అదే రోజు వెల్లడిస్తారు. మే 13న పోలింగ్‌ జరుగుతుంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నామినేషన్ల స్వీకరణకు కలెక్టరేట్‌లో జిల్లా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాలన్నిఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి స్వీకరిస్తారు. పోటీచేసే అభ్యర్థులు జనరల్‌ కేటగిరీ అయితే 25,000, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అయితే 12,000 రూపాయల డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. రిటర్నింగ్‌ కార్యాలయం వద్ద 100 మీటర్ల దూరం వరకు మూడు వాహనాలు, అభ్యర్థి వెంట నలుగురికే అనుమతి ఇస్తారు. ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లను అందజేయవచ్చు. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులను సంబంధిత నియోజకవర్గం నుంచి ఒక ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. పోటీచేసే అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసే ముందు ఎన్నికల వ్యయాలను చూపించేందుకు కొత్తగా బ్యాంకు ఖాతాను తెరచి, ఆ ఖాతా నంబర్‌ను పొందుపరచాల్సి ఉంటుంది. అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఉంటే నామినేషన్‌ పత్రంలో తప్పనిసరిగా పొందుపరచాలి. నామినేషన్‌ దాఖలు చేసేందుకు అభ్యర్థి, ప్రతిపాదించిన వారే స్వయంగా పత్రాలు అందజేయాల్సి ఉండగా, అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారి సమక్షంలో ఈసీ నిర్దేశించిన మేరకు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. నామినేషన్లలో ఖాళీలు పూర్తిచేసేందుకు ఆర్వో కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు. ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలకు ముందుగానే ‘సువిధ’ ద్వారా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

ఫ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 17,89,353 మంది ఓటర్లు

కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కరీంనగర్‌, హుజూరాబాద్‌, మానకొండూర్‌, చొప్పదండి, హుస్నాబాద్‌, సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 17,89,353 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8,74,884 మంది పురుషులు, 9,14,367 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 102 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు.

- కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 3,62,440 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,81,025 మంది పురుషులు, 1,81,372 మంది మహిళలు, 43 మంది థర్ట్‌జెండర్లు ఉన్నారు. - చొప్పదండి నియోజకవర్గంలో 1,13,599 మంది పురుషులు, 1,21,523 మంది మహిళలు, ఆరుగురు థర్ట్‌జెండర్లతో కలిపి 2,35,128 మంది ఓటర్లు ఉన్నారు.

- వేములవాడలో 1,07,768 పురుషులు, 1,17,506 మంది మహిళలు, 32 మంది థర్ఢ్‌ జెండర్లతో కలిపి మొత్తం 2,25,306 మంది ఓటర్లు ఉన్నారు.

- సిరిసిల్ల నియోజకవర్గంలో 1,19,124 మంది పురుషులు, 1,25,965 మంది మహిళలు, 8 మంది థర్డ్‌ జెండర్లు, మొత్తం 2,45,097 మంది ఓటర్లు ఉన్నారు.

- మానకొండూర్‌ నియోజకవర్గంలో 1,09,943 మంది పురుషులు, 1,14,902 మంది మహిళలు, ఒక థర్ట్‌ జెండర్‌తో కలిపి 2,24,846 మంది ఓటర్లు ఉన్నారు.

- హుజూరాబాద్‌లో 1,21,282 మంది పురుషులు, 1,27,963 మంది మహిళలు, ఏడుగురు థర్డ్‌జెండర్లతో కలిపి మొత్తం 2,49,252 మంది ఓటర్లు ఉన్నారు.

- హుస్నాబాద్‌ నియోజకవర్గంలో 1,21,069 మంది పురుషులు, 1,25,075 మంది మహిళలు, ఐదుగురు థర్డ్‌జెండర్లతో కలిపి 2,46,149 మంది ఓటర్లు ఉన్నారు.

- 174 మంది ఓవరసీస్‌ ఓటర్ల్లు, 961 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 11:47 PM