ధరల నియంత్రణ ఏదీ...
ABN , Publish Date - Jul 06 , 2024 | 12:56 AM
నిత్యావసర వస్తువుల ధరల నియం త్రించడానికి ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీ పత్తా లేకుండా పోయింది. ఒక వైపు నిత్యావసరాల రేట్లు పెరుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు.
పత్తాలేని పర్యవేక్షణ కమిటీ
- నిత్యావసరాల రేట్లు పెరుగుతున్నా కరువైన పట్టింపు
- లబోదిబోమంటున్న పేద, మద్య తరగతి ప్రజలు
జగిత్యాల, జూలై 5 (ఆంధ్రజ్యోతి): నిత్యావసర వస్తువుల ధరల నియం త్రించడానికి ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీ పత్తా లేకుండా పోయింది. ఒక వైపు నిత్యావసరాల రేట్లు పెరుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు చూసి నిరుపేద, మద్య తరగతి ప్రజ లు లబోదిబో మంటున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటితే వాటిని నియంత్రిచడంతో పాటు ప్రభుత్వ పరంగా విక్రయిస్తూ ప్రజలను ఆదు కోవాలి. ఇందుకు ధరల పర్యవేక్షణ కమిటీ ఉన్నా ప్రస్తుతం ఆ ఊసేలేదు. జిల్లాలో పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. ఇది ఉందనే విషయం దా దాపుగా అధికారులే మరిచిపోయారన్నట్లుగా కనిపిస్తోంది. బయటి మా ర్కెట్లో బియ్యం, పప్పులు, కూరగాయలు తదితర వస్తువుల ధరలు ఒక్క సారిగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కమిటీ అత్యవసర సమావేశం నిర్వ హించి నియంత్రణపై దృష్టి సారించాల్సి అవసరముంది.
పట్టింపు లేదు...
నిత్యావసర ధరలు ఎక్కువగా ఉన్నాయి. సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ధరల పర్యవేక్షణ కమిటీ దాదాపుగా గత ఏడాది నుంచి సమావేశాలు నిర్వహించడం లేదు. ఒక వేళ నిర్వహించినా కాగితాలకే పరిమితమవుతోంది. కమిటీ గురించి ఎవరికీ పట్టింపు లేకుండా పోయింది. పెరుగుతున్న ధరలను నియంత్రించడం లేదు. ప్రస్తుతం మా ర్కెట్‌లో టామాట కిలో ధర దాదాపుగా సెంచరీకి చేరింది. బియ్యం క్వింటా లు ధర రూ. 6 వేల నుంచి రూ. 6,500 వరకు పలుకుతున్నాయి. ఇంత ధరలు పలుకుతున్నా అధికార యంత్రాంగం ఏ మాత్రం దృషి సారించక పోవడం విమర్శలకు దారితీస్తోంది.
మండుతున్న ధరలు..
ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు విపరీతంగా ఉన్నాయి. కిలో టమాల రూ. 100 దాటింది. ఏ కూరగాయ కొనుగోలు చేసినా కిలో రూ. 80 కిపైగా పలుకుతోంది. దీంతో ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు జంకుతు న్నారు. బీపీటీ బియ్యం క్వింటాలుకు రూ. 5,000 నుంచి రూ. 5,500, హెచ్‌ఎంటీ రూ. 5,500 నుంచి రూ. 5,800 వరకు, జై శ్రీరాం రూ. 6 వేల నుంచి రూ. 6,500 వరకు విక్రయిస్తున్నారు. బియ్యం నాణ్యతను బట్టి వ్యాపారులు ధర అమాంతం పెంచేస్తున్నారు. ఈ ధరలు దాదాపుగా రెండు నెలల నుంచి పెరుగుతూనే వస్తున్నాయి. నియంత్రణ లేకపోవడం తో వచ్చే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు చెబు తున్నారు. కంది పప్పు, ఇతర పప్పుల ధరలూ మండిపోతున్నాయి.
కమిటీ చైర్మన్‌గా కలెక్టర్...
ధరల పర్యవేక్షణ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా జిల్లా పౌర సరఫరాల అధికారిగా వ్యవహరిస్తారు. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ (రె వెన్యూ), వ్యవసాయ శాఖ, మార్కెంటింగ్ శాఖ, ఉద్యాన శాఖ, మార్క్‌ఫె డ్, పౌరసరఫరాల సంస్థ డీఎం, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారు లతో పాటు నిత్యావసర సరుకులతో సంబంధం ఉన్న అధికారులు సభ్యు లుగా ఉంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ కమిటీ ప్రతి నెల స మావేశం నిర్వహించాలి. ప్రస్తుతం ఉన్న ధరలు, విక్రయాలపై చర్చించా ల్సి ఉంటుంది. వ్యాపారులు కృతిమ కొరత సృష్టించి సరుకులు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలి. ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటే ప్రభుత్వ ప రంగా కేంద్రం ఏర్పాటు చేయించి ప్రజలకు సరకులు విక్రయించేలా చర్య లు తీసుకోవాల్సి ఉంటుంది.
నిత్యావసర వస్తువుల ధరలు మండుతున్నాయి
- అడిగొప్పుల రజిని, గృహిణి, జగిత్యాల జిల్లా
ప్రస్తుతం మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నా యి. కూరగాయల ధరలతో పాటు బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. అధికా రులు ధరల నియంత్రణపై దృష్టి సారించాలి.
కృతిమ కొరత సృష్టించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి
కంబ శంకర్, యువకుడు, జగిత్యాల జిల్లా
లాభాలను ఆశిస్తున్న పలువురు వ్యాపారులు అకారణంగా పలు నిత్యా వసర వస్తువుల కృతిమ కొరత సృష్టిస్తున్నారు. వ్యాపారులు సిండేకేట్‌గా మారి పలు వస్తువులను బ్లాక్ చేస్తున్నారు. ధరలను పెంచి మళ్లీ మార్కె ట్‌లోకి తెస్తున్నారు. ప్రధానంగా బియ్యం వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు.