Share News

‘స్థానిక’ ఎన్నికలపై నజర్‌

ABN , Publish Date - May 19 , 2024 | 12:35 AM

పార్లమెంట్‌ ఎన్నికలు ముగియడంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తల దృష్టి స్థానిక సంస్థలపై మళ్లింది. మొన్న ఎమ్మెల్యేల ఎన్నికలు, నిన్న ఎంపీల ఎన్నికలు ముగిశాయి. తమ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడ్చిన ద్వితీయ శ్రేణి నాయకులు, గ్రామస్థాయి నాయకుల గెలుపు కోసం ఎమ్మెల్యేలు, పార్టీల ఇన్‌చార్జీలు చెమటోడ్చాల్సి ఉంటుంది,

‘స్థానిక’ ఎన్నికలపై నజర్‌

- రిజర్వేషన్లపై అయోమయం

- పాతవి కొనసాగిస్తారా? మారుస్తారా?

- బీసీల రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్‌

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పార్లమెంట్‌ ఎన్నికలు ముగియడంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తల దృష్టి స్థానిక సంస్థలపై మళ్లింది. మొన్న ఎమ్మెల్యేల ఎన్నికలు, నిన్న ఎంపీల ఎన్నికలు ముగిశాయి. తమ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడ్చిన ద్వితీయ శ్రేణి నాయకులు, గ్రామస్థాయి నాయకుల గెలుపు కోసం ఎమ్మెల్యేలు, పార్టీల ఇన్‌చార్జీలు చెమటోడ్చాల్సి ఉంటుంది, వచ్చే నెల 4వ తేదీన పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నది. గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన ముగియగా, ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. మండల, జిల్లా పరిషత్‌ల పాలకవర్గాల పదవీకాలం జూలై 3వ తేదీన ముగియనున్నది. ఈ ఎన్నికల్లో పాత రిజర్వేషన్లనే అమలుచేస్తారా? లేక చట్టాన్ని సవరించి మళ్లీ రిజర్వేషన్లు ప్రకటిస్తారా అనే విషయమై అయోమయం నెలకొన్నది. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్‌ చట్టం-2018ని తీసుకవచ్చింది. ఐదేళ్లకోసారి రొటేషన్‌ పద్ధతిన ప్రకటించే రిజర్వేషన్లను పదేళ్లకోసారి మార్చాలని చట్టసవరణ చేశారు. ఆ ప్రకారం వెళ్లాలంటే ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. స్థానిక సంస్థల రిజర్వేషన్లంటినీ రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఖరారు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, బీసీలకు 27 శాతం, జనరల్‌కు 49.5 శాతం రిజర్వేషన్లను అమలుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టిన నేపథ్యంలో అది పూర్తయిన తర్వాత ఆ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి వినతి పత్రాలను కూడా అందజేశారు. ఇవేగాకుండా రిజర్వేషన్ల విషయంలో చట్ట సవరణ చేయకుండా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు.

ఫ కొత్త మండలాల ఏర్పాటు..

గడిచిన ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా కొన్ని మండలాలను ఏర్పాటు చేశారు. రెండు మండలాల్లోని కొన్ని గ్రామాలను కలుపుకుని కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని పాలకుర్తి మండలం ఉండెడ, ముంజంపల్లి, మారేడుపల్లి గ్రామాలను కొత్తగా ఏర్పాటు చేసిన ఎండపల్లి మండలంలో కలిపారు. ఈ మండలం జగిత్యాల జిల్లాలో ఉండడం గమనార్హం. అలాగే జిల్లాలో గతంలో ఉన్న పంచాయతీల్లో సుగ్లాంపల్లి, పూసాల గ్రామపంచాయతీలను కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పడ్డ సుల్తానాబాద్‌లో విలీనం చేశారు. అంతర్గాం మండలం లింగాపూర్‌, కుందనపల్లి, రామగుండం మండలంలోని ఎల్కలపల్లి పంచాయతీ పరిధిలోని 2 వార్డులు, రామగిరి మండలం వెంకట్రావుపల్లి పంచాయతీని రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. కొత్తగా ఏర్పడ్డ పంచాయతీలతో కలిపి మొత్తం 263 పంచాయతీలకు 2436 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. విలీన గ్రామాల ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో లింగాపూర్‌, కుందనపల్లి, వెంకట్రావుపల్లి, ఎల్కలపల్లిలోని రెండు వార్డులను మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి తొలగించారు. వాటికి ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదు. ఈ పంచాయతీలకు రిజర్వేషన్లు ఎలా ఖరారు చేస్తారనే విషయమై చర్చ జరుగుతున్నది. కొత్తగా మరికొన్ని మండలాలు, పంచాయతీలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఉన్న నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వం రిజర్వేషన్లపై చట్ట సవరణ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తున్నది. అయితే గ్రామాల్లో మాత్రం అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎక్కడ నలుగురు కలిసినా చర్చ జరుగుతున్నది.

Updated Date - May 19 , 2024 | 12:36 AM